Share News

Plate trophy : తొలి మెట్టు ఎక్కాం

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:58 AM

రంజీ ప్లేట్‌ గ్రూప్‌ నుంచి హైదరాబాద్‌ జట్టు తిరిగి ఎలిట్‌ గ్రూప్‌నకు అర్హత సాధించినందుకు హైదరాబా దీగా చాలా సంతోషంగా ఉంది. ప్లేట్‌ ట్రోఫీ సాధించడంతో తొలి మెట్టు ఎక్కాం. ఇది ఆరంభం మాత్రమే. వచ్చే సీజన్‌లో మా స్థాయికి తగ్గ ఆట తీరు కనబరుస్తాం. రంజీ ఎలిట్‌ ట్రోఫీ సాధించి, హైదరాబాద్‌ సత్తా

 Plate trophy : తొలి మెట్టు ఎక్కాం

ఆఫ్‌ స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌

తదుపరి లక్ష్యం రంజీ ఎలిట్‌ ట్రోఫీ

ఏడు మ్యాచ్‌ల్లో 56 వికెట్లు. ఇందులో ఏడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన. తాజాగా ముగిసిన రంజీ ప్లేట్‌ ట్రోఫీలో తన స్పిన్‌ మాయాజాలంతో మిస్టరీ స్పిన్నర్‌గా పేరుగాంచిన తనయ్‌ త్యాగరాజన్‌ పేరు ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో మార్మోగు తోంది. ముఖ్యంగా సెమీస్‌లో 13, ఫైనల్లో 10 వికెట్లు పడగొట్టి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. రంజీ ప్లేట్‌ ట్రోఫీలో హైదరాబాద్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన లెఫ్టార్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ తనయ్‌తో ఆంధ్రజ్యోతి ముచ్చటించింది. ఈ సందర్భంగా తనయ్‌ చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే..

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి/హైదరాబాద్‌)

రంజీ ప్లేట్‌ గ్రూప్‌ నుంచి హైదరాబాద్‌ జట్టు తిరిగి ఎలిట్‌ గ్రూప్‌నకు అర్హత సాధించినందుకు హైదరాబా దీగా చాలా సంతోషంగా ఉంది. ప్లేట్‌ ట్రోఫీ సాధించడంతో తొలి మెట్టు ఎక్కాం. ఇది ఆరంభం మాత్రమే. వచ్చే సీజన్‌లో మా స్థాయికి తగ్గ ఆట తీరు కనబరుస్తాం. రంజీ ఎలిట్‌ ట్రోఫీ సాధించి, హైదరాబాద్‌ సత్తా నిరూపిస్తాం. వాస్తవానికి హైదరాబాద్‌ జట్టును పరిశీలిస్తే ప్లేట్‌లో ఆడాల్సిన జట్టు కాదు. కాకపోతే గత సీజన్‌లో జరిగిన కొన్ని తప్పిదాల కారణంగా ఊహించని పరిణామాలు చూశాం. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు జట్టంతా సమావేశ మైనప్పుడు మనం కచ్చితంగా మార్పు చూపించాలని బలంగా నిశ్చయించుకున్నాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో దూకుడుగా ఆడి, ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఈ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసి, ఫలితం రాబట్టాం. హెచ్‌సీఏ యాజమాన్యం, సెలెక్టర్ల నుంచి కూడా మంచి మద్దతు లభించింది.

ఇది ఆరంభమే..కష్టానికి తగిన ప్రతిఫలం

ఈ సీజన్‌ రంజీ ప్లేట్‌ గ్రూప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక నుంచి నిలకడగా రాణిస్తూ దేశంలోని టాప్‌ స్పిన్నర్లలో ఒకడిగా ఎదిగేందుకు శ్రమిస్తా. ఈ సీజన్‌లో మునుపటి కంటే నా బౌలింగ్‌ మెరుగు పర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి మంచి అవకాశాలు లభించాయి. ఈ టోర్నీలో చాలా నేర్చుకున్నా కూడా. తదుపరి టోర్నీలతో పాటు వచ్చే రంజీ సీజన్‌లో రాణించడానికి ఈ ప్రదర్శన ప్రేరణగా నిలుస్తుంది.

వైవిధ్యం చూపించా..

ఈ సీజన్‌ ప్రారంభానికి ముందే ఒక లక్ష్యంతో బరిలోకి దిగా. సంప్రదాయబద్ధ బౌలింగ్‌కే పరిమితం కాకుండా బంతి బంతికి వైవిధ్యం చూపించడంతో పాటు బ్యాటర్‌ను ఎంత తికమక పెడితే అన్ని ఎక్కువ వికెట్లు లభించే అవకాశముంటుందని భావించి, ఆ దిశగా సాధన చేశా. ఓవర్‌లో ఎక్కువ బంతులు వికెట్‌ తీసే బంతులు, సరైన్‌ లెంగ్త్‌తో మంచి బంతులు వేయగలగడంతో వికెట్లు తీయగలిగా. నా బౌలింగ్‌లో వైవిధ్యం, మార్పు రావడానికి కోచ్‌ రవితో పాటు సహచరులు సహకరించారు.

సవాళ్లు ఎదురయ్యాయి..

ప్లేట్‌ గ్రూప్‌లోని చిన్న జట్లలో నాణ్యమైన బ్యాటర్లు ఉండరనుకుంటారు. కానీ, ఈ సీజన్‌లో నాకు ప్రతి జట్టులోనూ ఇద్దరు, ముగ్గురు బ్యాటర్ల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. వాళ్లకి బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదించా. ముఖ్యంగా ఫైనల్లో మేఘాలయ బ్యాటర్‌ రాజ్‌ బిస్వాతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు బౌలింగ్‌ చేయడం సవాల్‌గా అనిపించింది. ఇదే ఎలిట్‌ గ్రూప్‌ లేదా ఐపీఎల్‌ల్లోనో అయితే, బ్యాటర్లతో మరికొంత పోటీ ఎక్కువ ఉండేది. వచ్చే టోర్నీలకు ఇందుకు తగ్గట్టే సన్నద్ధమవుతా.

Updated Date - Feb 21 , 2024 | 03:58 AM