Share News

సూర్య ప్రతాపం

ABN , Publish Date - May 07 , 2024 | 02:36 AM

టీ20ల్లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 నాటౌట్‌) స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు. స్వల్ప ఛేదనలో ముంబై ఇండియన్స్‌ కాస్త తడబడినా...

సూర్య ప్రతాపం

నేటి మ్యాచ్‌

ఢిల్లీ X రాజస్థాన్‌, రాత్రి, 7.30 గం. వేదిక: ఢిల్లీ

51 బంతుల్లో అజేయ శతకం

  • ముంబై ఘనవిజయం

  • సన్‌రైజర్స్‌కు నిరాశ

ముంబై: టీ20ల్లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 నాటౌట్‌) స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు. స్వల్ప ఛేదనలో ముంబై ఇండియన్స్‌ కాస్త తడబడినా.. తన అజేయ శతకంతో అద్భుతంగా పుంజుకుంది. దీంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. పట్టికలోనూ తమ ఆఖరి స్థానాన్ని కాస్త మెరుగుపర్చుకుంది. అటు కమిన్స్‌ సేన మాత్రం బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ విఫలమైంది. ముందుగా సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. హెడ్‌ (48), కమిన్స్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్‌) రాణించారు. హార్దిక్‌ పాండ్యా, పీయూష్‌ చావ్లాలకు మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. తిలక్‌ వర్మ (37 నాటౌట్‌) అండగా నిలిచాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సూర్య నిలిచాడు.


సూర్య-తిలక్‌ శతక భాగస్వామ్యం: ఓ మాదిరి ఛేదనలో ముంబై ఇన్నింగ్స్‌ సైతం రైజర్స్‌ మాదిరే సాగింది. తొలి ఐదు ఓవర్లలోనే ఇషాన్‌ (9), రోహిత్‌ (4), నమన్‌ ధిర్‌ (0)ల వికెట్లను కోల్పోయింది. అప్పటికి స్కోరు 31 మాత్రమే. గత 12 మ్యాచ్‌ల్లో కేవలం రెండుసార్లు మాత్రమే ముంబై ఓపెనర్లు పవర్‌ప్లే దాటడం గమనార్హం. అయితే సూర్యకుమార్‌ తన స్ట్రోక్‌ప్లేతో అదరగొట్టగా.. అతడికి తిలక్‌ చక్కటి సహకారం అందించాడు. ఆరో ఓవర్‌లో తిలక్‌ 4,4 సూర్య 6తో 16 రన్స్‌ రాగా.. తర్వాతి ఓవర్‌లోనే సూర్య మరింత చెలరేగి 4,4,6,6తో 22 రన్స్‌ రాబట్టాడు. దీంతో స్కోరు గాడిన పడింది. అటు రైజర్స్‌ బౌలర్లు కూడా ఈ జోడీని విడదీసేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. వరుస ఫోర్లతో ఆకట్టుకున్న సూర్య 30 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. 17వ ఓవర్‌లోనైతే వరుసగా 4,4,6తో 18 రన్స్‌ రాబట్టి సెంచరీ ముంగిట నిలిచాడు. చివర్లో జట్టు విజయానికి ఏడు.. సూర్య శతకానికి ఆరు పరుగులు అవసరమైన దశలో తిలక్‌ సింగిల్‌ తీయగా, సూర్య సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. నాలుగో వికెట్‌కు ఇద్దరూ అజేయంగా 143 పరుగులు అందించడం విశేషం.


ఆఖర్లో కోలుకుని..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ తన సహజశైలిలో దూకుడు కనబర్చలేకపోయింది. ఓపెనర్‌ హెడ్‌ బ్యాట్‌ నుంచి పెద్దగా మెరుపులు కనిపించలేదు. అయితే ఆఖర్లో కెప్టెన్‌ కమిన్స్‌ పుణ్యమా అని కాస్త పరుగులు జత చేరడంతో స్కోరు 170 దాటగలిగింది. పవర్‌ప్లేలో 56/1తో సన్‌రైజర్స్‌ ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత ముంబై బౌలర్లు వికెట్లతో పాటు రన్స్‌ను కట్టడి చేశారు. దీంతో హెడ్‌ 11వ ఓవర్‌ వరకు ఉన్నా స్కోరు వంద పరుగులు కూడా దాటలేకపోయింది. ఐదో ఓవర్‌లోనే హెడ్‌ను అరంగేట్ర పేసర్‌ అన్షుల్‌ అవుట్‌ చేసినా అది నోబ్‌గా తేలింది. అటు 6,4,4తో అతను ఆ ఓవర్‌లో 19 రన్స్‌ రాబట్టాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ (11)ను ఆరో ఓవర్‌లో బుమ్రా పెవిలియన్‌ చేర్చాడు. ఇక, అన్షుల్‌ ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లోనూ హెడ్‌ క్యాచ్‌ను తుషార వదిలేశాడు. అదే ఓవర్‌లో మయాంక్‌ అగర్వాల్‌ (5)ను అవుట్‌ చేసిన అన్షుల్‌ కెరీర్‌లో తొలి వికెట్‌తో సంతృప్తి చెందాడు. ఆ తర్వాత నితీశ్‌ వచ్చీ రాగానే రెండు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. కానీ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా తన వరుస ఓవర్లలో హెడ్‌, క్లాసెన్‌ (2)లను అవుట్‌ చేయగా.. నితీశ్‌ను హార్దిక్‌ వెనక్కిపంపడంతో 96/5 స్కోరుతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో మార్కో జాన్సెన్‌ (17) 6,4తో జోరు ప్రదర్శించాడు. అయితే ఆ వెంటనే 16వ ఓవర్‌లో షాబాజ్‌ (10), జాన్సెన్‌ల వికెట్లతో హార్దిక్‌ ఝలక్‌ ఇచ్చాడు. ఇక అబ్దుల్‌ సమద్‌ (3)ను చావ్లా ఎల్బీ చేయడంతో రైజర్స్‌ 150 స్కోరు కూడా కష్టమే అనిపించింది. కానీ కెప్టెన్‌ కమిన్స్‌ ఆఖర్లో అదరగొట్టాడు. బుమ్రా ఓవర్‌లో ఫోర్‌ బాదిన అతను తుషారను లక్ష్యంగా చేసుకుని చివరి ఓవర్‌లో 6,4తో 17 రన్స్‌ రాబట్టడంతో జట్టు మెరుగ్గానే కోలుకుంది.


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: హెడ్‌ (సి) తిలక్‌ (బి) చావ్లా 48, అభిషేక్‌ (సి) ఇషాన్‌ (బి) బుమ్రా 11, మయాంక్‌ (బి) అన్షుల్‌ 5, నితీశ్‌ (సి) అన్షుల్‌ (బి) హార్దిక్‌ 20, క్లాసెన్‌ (బి) చావ్లా 2, జాన్సెన్‌ (బి) హార్దిక్‌ 17, షాబాజ్‌ (సి) సూర్య (బి) హార్దిక్‌ 10, అబ్దుల్‌ (ఎల్బీ) చావ్లా 3, కమిన్స్‌ (నాటౌట్‌) 35, సన్వీర్‌ (నాటౌట్‌) 8, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 173/8; వికెట్ల పతనం: 1-56, 2-68, 3-90, 4-92, 5-96, 6-120, 7-124, 8-136; బౌలింగ్‌: నువవాన్‌ తుషార 4-0-42-0, అన్షుల్‌ కాంబోజ్‌ 4-0-42-1, బుమ్రా 4-0-23-1, హార్దిక్‌ 4-0-31-3, పీయూష్‌ చావ్లా 4-0-33-3.

ముంబై: ఇషాన్‌ (సి) మయాంక్‌ (బి) జాన్సెన్‌ 9, రోహిత్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 4, నమన్‌ ధిర్‌ (సి) జాన్సెన్‌ (బి) భువనేశ్వర్‌ 0, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 102, తిలక్‌ (నాటౌట్‌) 37, ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 17.2 ఓవర్లలో 174/3; వికెట్ల పతనం: 1-26, 2-31, 3-31; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-1-22-1, జాన్సెన్‌ 3-0-45-1, కమిన్స్‌ 4-1-35-1, నటరాజన్‌ 3.2-0-31-0, నితీశ్‌ 2-0-16-0, షాబాజ్‌ 1-0-11-0.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

కోల్‌కతా 11 8 3 0 16 1.453

రాజస్థాన్‌ 10 8 2 0 16 0.622

చెన్నై 11 6 5 0 12 0.700

హైదరాబాద్‌ 11 6 5 0 12 -0.065

లఖ్‌నవూ 11 6 5 0 12 -0.371

ఢిల్లీ 11 5 6 0 10 -0.442

బెంగళూరు 11 4 7 0 8 -0.049

పంజాబ్‌ 11 4 7 0 8 -0.187

ముంబై 12 4 8 0 8 -0.212

గుజరాత్‌ 11 4 7 0 8 -1.320

3

టీ20ల్లో ఎక్కువ శతకాలు (6) బాదిన మూడో భారత బ్యాటర్‌గా రుతురాజ్‌, రాహుల్‌తో సమంగా నిలిచిన సూర్య. విరాట్‌ (9), రోహిత్‌ (8) ముందున్నారు.

Updated Date - May 07 , 2024 | 02:36 AM