Share News

IND vs AFG: సూపరో.. సూపర్‌

ABN , Publish Date - Jan 18 , 2024 | 02:53 AM

ఆహా...ఏమి మ్యాచ్‌..భారత్‌-అఫ్ఘానిస్థాన్‌ జట్ల మధ్య బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగినఆఖరి టీ20 ఫ్యాన్స్‌కు నాలుగు గంటలపాటు మస్త్‌ మజాను పంచింది..పరుగుల వరద పారిన పోరులో విజేతను తేల్చేందుకు ఏకంగా రెండు సూపర్‌ ఓవర్లు అనివార్యమయ్యాయి..అయితే రెండో సూపర్‌ ఓవర్లో యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అద్భుత బౌలింగ్‌తో రెండు వికెట్లు

IND vs AFG: సూపరో.. సూపర్‌

తొలుత టై.. ఆపై రెండు సూపర్‌ ఓవర్లు

భారత్‌ థ్రిల్లింగ్‌ విన్‌

మూడో టీ20లో పోరాడి ఓడిన అఫ్ఘానిస్థాన్‌

రోహిత్‌ సెంచరీ సిరీస్‌ క్లీన్‌స్వీ్‌ప

బెంగళూరు : ఆహా...ఏమి మ్యాచ్‌..భారత్‌-అఫ్ఘానిస్థాన్‌ జట్ల మధ్య బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగినఆఖరి టీ20 ఫ్యాన్స్‌కు నాలుగు గంటలపాటు మస్త్‌ మజాను పంచింది..పరుగుల వరద పారిన పోరులో విజేతను తేల్చేందుకు ఏకంగా రెండు సూపర్‌ ఓవర్లు అనివార్యమయ్యాయి..అయితే రెండో సూపర్‌ ఓవర్లో యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అద్భుత బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియాకు ఉత్కంఠ విజయం అందించాడు. సూపర్‌ ఓవర్లో 2 వికెట్లు పతనమైతే ఆలౌట్‌ అయినట్టు లెక్క. బుధవారం జరిగిన మూడో టీ20లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 121 నాటౌట్‌) సెంచరీతో, డాషింగ్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ (39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 నాటౌట్‌) అర్ధ శతకంతో అదరగొట్టగా, తొలుత టీమిండియా 20 ఓవర్లలో 212/4 స్కోరు చేసింది. రోహిత్‌, రింకూ ఐదో వికెట్‌కు 190 పరుగుల (95 బంతుల్లో) అభేద్య భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. టీ20ల్లో భారత్‌కు ఏ వికెట్‌కైనా ఇది రికార్డు. భారీ ఛేదనలో గుల్బదిన్‌ నైబ్‌ (23 బంతుల్లో 55 నాటౌట్‌), రహ్మనుల్లా గుర్బాజ్‌ (32 బంతుల్లో 50), ఇబ్రహీం జద్రాన్‌ (41 బంతుల్లో 50) అర్ధ శతకాలతో అఫ్ఘాన్‌ కూడా 20 ఓవర్లలో 212/6 స్కోరు చేసింది. నబీ (16 బంతుల్లో 34) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీ్‌సను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. రోహిత్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, దూబే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌స’గా నిలిచారు.

వణికించిన అఫ్ఘానిస్థాన్‌: భారీ ఛేదనలో అఫ్ఘానిస్థాన్‌ ఓపెనర్లు గుర్బాజ్‌, ఇబ్రహీం భారత బౌలర్లను బెంబేలెత్తిస్తూ, తొలి వికెట్‌కు ఏకంగా 93 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్‌ కుల్దీప్‌ బౌలింగ్‌లో సుందర్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌తో రహ్మనుల్లా గుర్బాజ్‌ అవుట్‌ కావడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. ఆపై రెండు వికెట్లను వెంటవెంటనే చేజార్చుకున్నా..నబీ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో మరోసారి ఆతిథ్య జట్టులో గుబులు రేపాడు. నబీ ఇన్నింగ్స్‌కు సుందర్‌ ముగింపు పలికినా..చివరి బ్యాటర్లు జతగా గుల్బదిన్‌ నైబ్‌ అఫ్ఘానిస్థాన్‌ను గెలుపు అంచులదాకా తీసుకొచ్చాడు. ఆఖరి ఓవర్లో అఫ్ఘాన్‌ విజయానికి 19 పరుగులు చేయాల్సి వచ్చింది. ముకేశ్‌ వేసిన ఆ ఓవర్లో గుల్బదిన్‌ 4,6 కొట్టడంతో ఆఖరి బంతికి మూడు పరుగులుగా సమీకరణం మారింది. కానీ గుల్బదిన్‌ రెండు పరుగులే తీయడంతో మ్యాచ్‌ టై అయింది. కాగా, ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో విఫలమైన విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. అవేశ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించిన నజీబుల్లా జద్రాన్‌ను అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. అంతకుముందు వాషింగ్టన్‌ వేసిన 17వ ఓవర్లో కరీం కొట్టిన భారీ షాట్‌ను కోహ్లీ బౌండరీ లైన్‌ వద్ద గాల్లోకి ఎగిరి ఆపి, సిక్సర్‌ ఖాయమనుకున్నదాన్ని ఒక్క పరుగుకే పరిమితం చేశాడు.

రోహిత్‌, రింకూ విన్యాసం: టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ను..ఫరీద్‌ అహ్మద్‌, ఒమర్‌జాయ్‌ కట్టుదిట్టమైన బంతులతో పరుగులు చేయకుండా నిరోధించారు. ఫరీద్‌ వేసిన మూడో ఓవర్లో రోహిత్‌ బౌండరీ కొట్టినా..తర్వాత రెండు వరుస వికెట్లతో అఫ్ఘాన్‌ పేసర్‌ ఝలకిచ్చాడు. ఫరీద్‌ బంతిని క్రీజునుంచి బయటకు వచ్చి జైస్వాల్‌ (4) భారీ షాట్‌గా మలచబోయి నబీకి చిక్కాడు. ఇక..ఎదుర్కొన్న తొలి బంతినే షాట్‌గా కొట్టబోయి విరాట్‌ కూడా క్యాచవుట్‌ అయ్యాడు. ఇక అజ్మతుల్లా ఒమర్‌ జాయ్‌..దూబే (1)ను కీపర్‌ గుర్బాజ్‌ క్యాచ్‌ ద్వారా పెవిలియన్‌ చేర్చాడు. దీని నుంచి కోలుకొనేలోపే..ఫరీద్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌కు యత్నించి శాంసన్‌ డకౌటయ్యాడు. దాంతో పవర్‌ ప్లేలోపే 22/4తో టీమిండియా తీవ్ర కష్టాల్లో పడింది. కానీ ఎనిమిదో ఓవర్లో..అరంగేట్ర పేసర్‌ సలీమ్‌కు రింకూసింగ్‌, రోహిత్‌ భారీ సిక్సర్లతో స్వాగతం పలికారు. అజ్మతుల్లా వేసిన 19వ ఓవర్లో 6,4,4తో దుమ్ము రేపిన రోహిత్‌ 2018 అనంతరం టీ20లలో తొలి సెంచరీ అందుకున్నాడు. ఇదే ఓవర్లో సిక్సర్‌ బాదిన రింకూ హాఫ్‌ సెంచరీ మార్క్‌ చేరాడు. రింకూ 6,6,6 దంచడంతో..ఆఖరి ఓవర్లో భారత్‌ ఏకంగా 36 రన్స్‌ సాధించింది. మొత్తంగా చివరి ఐదు ఓవర్లలో భారత్‌ 103 కొల్లగొట్టింది.

టీ20ల్లో అత్యధిక సెంచరీ (5)లు చేసిన తొలి బ్యాటర్‌ రోహిత్‌ శర్మ. అలాగే ఈ ఫార్మాట్‌లో అతడికి అత్యధికం కూడా. 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై 118 రోహిత్‌ గత అత్యుత్తమం.

అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకిది 35వ డకౌట్‌. ఈ క్రమంలో సచిన్‌ (34)ను అధిగమించాడు.

over-super.jpg

స్కోరుబోర్డు

భారత్‌: జైస్వాల్‌ (సి) నబీ (బి) ఫరీద్‌ 4, రోహిత్‌ (నాటౌట్‌) 121, కోహ్లీ (సి) ఇబ్రహీం (బి) ఫరీద్‌ 0, దూబే (సి) గుర్బాజ్‌ (బి) అజ్మతుల్లా 1, శాంసన్‌ (సి) నబీ (బి) ఫరీద్‌ 0, రింకూ (నాటౌట్‌) 69; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 20 ఓవర్లలో 212/4; వికెట్ల పతనం: 1-18, 2-18, 3-21, 4-22; బౌలింగ్‌: ఫరీద్‌ 4-0-20-3, అజ్మతుల్లా 4-0-33-1, కైస్‌ 4-0-28-0, సలీమ్‌ 3-0-43-0, అష్రఫ్‌ 2-0-25-0, కరీమ్‌ 3-0-54-0.

అఫ్ఘానిస్థాన్‌: గుర్బాజ్‌ (సి) సుందర్‌ (బి) కుల్దీప్‌ 50, ఇబ్రహీం (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) సుందర్‌ 50, గుల్బదిన్‌ (నాటౌట్‌) 55, అజ్మతుల్లా (సి) బిష్ణోయ్‌ (బి) సుందర్‌ 0, నబీ (సి) అవేశ్‌ (బి) సుందర్‌ 34, జనత్‌ (రనౌట్‌/శాంసన్‌) 2, నజీబుల్లా (సి) కోహ్లీ (బి) అవేశ్‌ 5, అష్రఫ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 212/6; వికెట్ల పతనం: 1-93, 2-107, 3-107, 4-163, 5-167, 6-182; బౌలింగ్‌: ముకేష్‌ 4-0-44-0, అవేశ్‌ 4-0-55-1, బిష్ణోయ్‌ 4-0-38-0, సుందర్‌ 3-0-18-3, దూబే 2-0-25-0, కుల్దీప్‌ 3-0-31-1.

Updated Date - Jan 18 , 2024 | 06:26 AM