Share News

Sunil Gavaskar: ధోనీ వారసుడిలా కనిపిస్తున్నాడు.. యువ ఆటగాడిపై దిగ్గజ ఆటగాడి ప్రశంసలు!

ABN , Publish Date - Feb 25 , 2024 | 06:25 PM

తన అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌పై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు.

Sunil Gavaskar: ధోనీ వారసుడిలా కనిపిస్తున్నాడు.. యువ ఆటగాడిపై దిగ్గజ ఆటగాడి ప్రశంసలు!

తన అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌ (Dhruv Jurel)పై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. ధ్రువ్ అంకిత భావం చూస్తుంటే తనకు ఎంఎస్ ధోనీ (MS Dhoni) గుర్తుకు వస్తున్నాడని ప్రశంసించాడు. ప్రస్తుతం రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో (India vs England) ధ్రువ్ జురెల్ 90 పరుగులు చేసి టీమిండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో గవాస్కర్ అతడిపై ప్రశంసలు కురిపించాడు.

``ధ్రువ్ జురెల్ ఏకాగ్రత, అంకిత భావం చూస్తుంటే నాకు ఎంఎస్ ధోనీ గుర్తుకు వస్తున్నాడు. ఈ రోజు ధ్రువ్ సెంచరీ మిస్ అయి ఉండవచ్చు. కానీ, ఇదే ఏకాగ్రతతో ఆడితే అతడు ఎన్నో సెంచరీలు సాధిస్తాడ``ని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 149 బంతులు ఆడిన ధ్రువ్ రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేశాడు. సెంచరీ చేయడం ఖాయం అనుకునే దశలో టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిదో వికెట్‌కు కుల్‌దీప్‌తో కలిసి ధ్రువ్ 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ (90), యశస్వి జైస్వాల్ (73) రాణించడంతో టీమిండియా 307 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 192 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ (24), యశస్వి (16) అజేయంగా నిలిచారు. భారత్ గెలవాలంటే నాలుగో రోజు మరో 152 పరుగులు అవసరం.

Updated Date - Feb 25 , 2024 | 06:25 PM