సిరాజ్.. క్యా హువా?
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:26 AM
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమితో జట్టు కూర్పుపై కూడా చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగి రోహిత్ సేనను దెబ్బ తీస్తే.. ఆతిథ్య భారత్ మాత్రం ఇద్దరు పేసర్లతోనే ఆడింది. ఇందులో బుమ్రా మాత్రమే...
13 టెస్టుల్లో 19 వికెట్లు
నిరాశపరిచిన పేసర్
రెండో టెస్టుకు చోటు కష్టమే
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమితో జట్టు కూర్పుపై కూడా చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగి రోహిత్ సేనను దెబ్బ తీస్తే.. ఆతిథ్య భారత్ మాత్రం ఇద్దరు పేసర్లతోనే ఆడింది. ఇందులో బుమ్రా మాత్రమే ఆకట్టుకోగలిగాడు. మరో పేసర్ మహ్మద్ సిరాజ్ అంచనాలను అందుకోలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు మాత్రమే తీశాడు. కనీసం అతడి స్థానంలో ఫామ్‌లో ఉన్న ఆకాశ్‌దీ్‌పను ఆడించినా ఫలితం ఉండేదని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం నుంచి జరిగే పుణె టెస్టులో సిరాజ్‌ను తప్పించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. వాస్తవానికి విదేశాల్లో రాణిస్తున్నా.. భారత గడ్డపై జరిగిన టెస్టులో సిరాజ్ ప్రదర్శన సంతృప్తికరంగా లేదు. ఇక్కడ తను 13 టెస్టులు ఆడితే.. తీసింది 19 వికెట్లు మాత్రమే. ఇందులో నాలుగు టెస్టుల్లోనైతే ఒక్క వికెట్ కూడా రాలేదు. ఇక చివరి ఏడు టెస్టుల్లో 12 వికెట్లే తీశాడు. కనీసం టెస్టుకు రెండు వికెట్లు కూడా పడగొట్టలేకపోయాడు. అంతేకాకుండా బుమ్రాతో సమానంగా కొత్త బంతితో ఎలాంటి ప్రభావమూ చూపలేకపోతున్నాడు. అంటే ఉపఖండంలో అతడి తడబాటు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
అయితే సిరాజ్ తన లైన్ అండ్ లెంగ్త్‌ను సరిచేసుకుంటే ప్రభావం చూపగలడని ఓ కోచ్ తెలిపాడు. విదేశీ పిచ్‌లపై అతడి బౌలింగ్ సరిగ్గా సరిపోతుందని, అందుకే బౌన్సీ పిచ్‌లుండే ఆస్ర్టేలియా, దక్షిణాఫ్రికాల్లో ఐదేసి వికెట్లతో రాణించినట్టు గుర్తుచేశాడు. బౌన్స్ తక్కువగా ఉండే భారత పిచ్‌లపై అందుకే వెనుకబడుతున్నట్టు తెలిపాడు. ఇదిలావుండగా జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్నప్పుడు కొత్త బంతితో వికెట్లను ఆశిస్తారని, అలాగే రెండో కొత్త బంతితోనూ రాణించాలని కోరుకుంటారని మాజీ కీపర్ సబా కరీం అన్నాడు. ఈ విషయంలో ఆకాశ్ దీప్ మెరుగ్గా కనిపిస్తున్నాడని, చాలా ఏళ్లుగా భారత పిచ్‌లపై అతడు ఆడుతున్న విషయం మరువరాదని చెప్పాడు. ఆర్‌సీబీ మాజీ కోచ్ మైక్ హెస్సెన్ కూడా రెండో టెస్టుకు సిరాజ్ స్థానంలో ఆకాశ్‌ను ఆడించే విషయమై టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచించే అవకాశం ఉంద న్నాడు.