Share News

సెలెక్షన్‌ డైలమా

ABN , Publish Date - Mar 06 , 2024 | 06:12 AM

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీ్‌సను దక్కించుకున్న జోష్‌లో ఉన్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌ కోసం సన్నద్ధమవుతోంది. అలాగే ఈ టెస్టుకు స్టార్‌ పేసర్‌ బుమ్రా జట్టులోకి రానున్నాడు. కానీ...

సెలెక్షన్‌ డైలమా

కుల్దీప్‌ వర్సెస్‌ ఆకాశ్‌

ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టు

ధర్మశాల: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీ్‌సను దక్కించుకున్న జోష్‌లో ఉన్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌ కోసం సన్నద్ధమవుతోంది. అలాగే ఈ టెస్టుకు స్టార్‌ పేసర్‌ బుమ్రా జట్టులోకి రానున్నాడు. కానీ మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకోకపోవడంతో ధర్మశాల టెస్టుకూ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి జరిగే ఈ ముగింపు టెస్టు కోసం భారత తుది జట్టు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. బ్యాటింగ్‌ విభాగంలో రజత్‌ పటీదార్‌కు మరో అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. సర్ఫరాజ్‌, జురెల్‌ తమ అరంగేట్రాలను చిరస్మరణీయం చేసుకున్నా.. పటీదార్‌ మాత్రం ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 63 పరుగులే చేసి నిరాశపరిచాడు. సిరీస్‌లో మిగిలింది ఒకే మ్యాచ్‌ కావడంతో ఈ దశలో దేవ్‌దత్‌ పడిక్కళ్‌కు చాన్స్‌ ఇవ్వడం కన్నా.. రజత్‌నే కొనసాగిస్తే బావుంటుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఒక రకంగా అతడికిది ఆఖరి అవకాశంగా భావించవచ్చు.

ఆకాశ్‌ కష్టమే!

బౌలింగ్‌ విభాగంలో మాత్రం కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ మల్లగుల్లాలు పడుతున్నారు. సిరీ్‌సలో ఇప్పటిదాకా పేసర్లు, స్పిన్నర్లు విశేషంగా రాణించారు. దీంతో బుమ్రా రాకతో ఎవరిని ఉంచాలో? ఎవరిని తప్పించాలో? అర్థంకాని పరిస్థితి నెలకొంది. అశ్విన్‌ కెరీర్‌లో వందో టెస్టు ఆడబోతుండడంతో తనకు తుది జట్టులో చోటు ఖాయమే. జడేజా సంగతి సరేసరి. ఇక ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో జట్టు ఇద్దరు పేసర్లతోనే ఆడింది. కాబట్టి బుమ్రాకు జతగా సిరాజ్‌నే కొనసాగించనున్నారు. దీంతో కుల్దీప్‌ యాదవ్‌ లేక ఆకాశ్‌ దీప్‌లలో ఒకరిపై వేటు పడనుంది. ధర్మశాలలో టర్నింగ్‌ వికెట్‌ను ఏర్పాటు చేయనున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు జట్టులో కుల్దీ్‌పనే కొనసాగిస్తారని ఎవరైనా అంచనా వేయగలరు. అంతేకాకుండా నాలుగో టెస్టులో అతడి బ్యాటింగ్‌ నైపుణ్యం కూడా జట్టును ఆదుకుంది. అయితే అరంగేట్రంలోనే ఆకాశ్‌ దీప్‌ మూడు వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ధర్మశాలకు రింకూ సింగ్‌

టీ20 బ్యాటర్‌ రింకూ సింగ్‌ను ఫొటో షూట్‌ కోసంభారత జట్టు యాజమాన్యం ధర్మశాలకు పిలిపించడం ఆసక్తిగా మారింది. బహుశా అతడికి టీ20 వరల్డ్‌క్‌పలో చోటు దక్కవచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీసే భారత్‌కు చివరిది. అనంతరం ఈనెల్లోనే ఆటగాళ్లంతా ఐపీఎల్‌ ఆడనున్నారు. కాబట్టి ఐపీఎల్‌ మధ్యలోనే వరల్డ్‌కప్‌ జట్టును ప్రకటించాల్సి ఉంటుంది. అందుకే ముందస్తుగా రింకూను పిలిపించారని సమాచారం. ఇక ధర్మశాలలో రింకూ ఇంగ్లండ్‌ కోచ్‌ మెకల్లమ్‌ను కలిసిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.

హెలికాప్టర్‌లో రోహిత్‌ ఎంట్రీ

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హెలికాప్టర్‌లో ధర్మశాల చేరుకున్నాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ బిలా్‌సపూర్‌లోని లుహ్ను మైదానంలో నిర్వహించిన సన్సద్‌ ఖేల్‌ మహాకుంభ్‌ 3.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు రోహిత్‌ ధర్మశాల నుంచి హెలికాప్టర్‌లో వెళ్లాడు. ల్యాండ్‌ అయిన వెంటనే హెచ్‌పీసీఏ అధికారు లు, ఈవెంట్‌ నిర్వాహకులు అతడికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రోహిత్‌తో పాటు కోచ్‌ ద్రవిడ్‌ కూడా పాల్గొనగా వేదికపై అభిమానులతో వీరు సరదాగా క్రికెట్‌ ఆడారు.

Updated Date - Mar 06 , 2024 | 06:12 AM