Share News

RR vs LSG : సంజూ..సత్తా

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:35 AM

ఐపీఎల్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ విజయంతో ఆరంభించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజూ శాంసన్‌ (52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో సత్తా చాటిన వేళ...

RR vs LSG : సంజూ..సత్తా

రాజస్థాన్‌ శుభారంభం

20 పరుగులతో లఖ్‌నవూ ఓటమి

జైపూర్‌: ఐపీఎల్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ విజయంతో ఆరంభించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజూ శాంసన్‌ (52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 నాటౌట్‌) అజేయ అర్ధ శతకంతో సత్తా చాటిన వేళ.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 20 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎ్‌ససీ)ను చిత్తు చేసింది. తొలుత రాజస్థాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (29 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 43) అదరగొట్టాడు. లఖ్‌నవూ బౌలర్లలో నవీనుల్‌ హక్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో లఖ్‌నవూ ఓవర్లన్నీ ఆడి 173/6 స్కోరు మాత్రమే చేసింది. బౌల్ట్‌ (2/35) దెబ్బకు జెయింట్స్‌ 11/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌ రాహుల్‌ (58), దీపక్‌ హుడా (26) 4వ వికెట్‌కు 49 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. వీరి భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో హుడాను చాహల్‌ అవుట్‌ చేశాడు. కానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ (41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్‌), రాహుల్‌.. 5వ వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యంతో రాజస్థాన్‌ శిబిరంలో గుబులు రేపారు. అయితే, డెత్‌ ఓవర్లలో సందీప్‌ శర్మ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో లఖ్‌నవూ జోరును అడ్డుకొన్నాడు. ఆఖరి 4 ఓవర్లలో 49 పరుగులు కావాల్సిన సమయంలో.. అర్ధ శతకం పూర్తి చేసుకొన్న రాహుల్‌ను సందీప్‌ క్యాచ్‌ అవుట్‌ చేసి లఖ్‌నవూను దెబ్బతీశాడు.

ఆదుకొన్న శాంసన్‌, పరాగ్‌: అంతకుముందు రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు బట్లర్‌ (11), యశస్వీ జైస్వాల్‌ (24) పవర్‌ప్లేలోపే పెవిలియన్‌ చేరారు. అయితే, కెప్టెన్‌ శాంసన్‌కు పరాగ్‌ రూపంలో చక్కని సహకారం లభించడంతో స్కోరు వేగం పుంజుకొంది. 9వ ఓవర్‌లో యష్‌ బౌలింగ్‌లో పరాగ్‌ బంతిని బౌండ్రీ ఆవలకు తరలించగా.. శాంసన్‌ 2 సిక్స్‌లతో 21 పరుగులు రాబట్టడంతో రాజస్థాన్‌ 84/2తో నిలిచింది. 15వ ఓవర్‌లో నవీన్‌ బౌలింగ్‌లో 4,6తో జోరుచూపిన పరాగ్‌.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. డెత్‌ ఓవర్లలో శాంసన్‌, ధ్రువ్‌ జురెల్‌ (20 నాటౌట్‌) వేగంగా 43 పరుగులు జోడించడంతో.. రాజస్థాన్‌ స్కోరు 190 మార్క్‌ దాటింది.

స్కోరుబోర్డు

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) క్రునాల్‌ (బి) మొహిసిన్‌ 24, బట్లర్‌ (సి) రాహుల్‌ (బి) నవీన్‌ 11, శాంసన్‌ (నాటౌట్‌) 82, పరాగ్‌ (సి) దీపక్‌ (బి) నవీన్‌ 43, హెట్‌మయెర్‌ (సి) రాహుల్‌ (బి) బిష్ణోయ్‌ 5, జురెల్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 193/4; వికెట్ల పతనం: 1-13, 2-49, 3-142, 4-150; బౌలింగ్‌: మొహిసిన్‌ 4-0-45-1, నవీనుల్‌ హక్‌ 4-0-41-2, క్రునాల్‌ 4-0-19-0, బిష్ణోయ్‌ 4-0-38-1, యష్‌ ఠాకూర్‌ 3-0-43-0, బదోని 1-0-6-0.

లఖ్‌నవూ: డికాక్‌ (సి) బర్గర్‌ (బి) బౌల్ట్‌ 4, రాహుల్‌ (సి) జురెల్‌ (బి) సందీప్‌ 58, పడిక్కల్‌ (బి) బౌల్ట్‌ 0, బదోని (సి) బట్లర్‌ (బి) బర్గర్‌ 1, హుడా (సి) జురెల్‌ (బి) చాహల్‌ 26, పూరన్‌ (నాటౌట్‌) 64, స్టొయినిస్‌ (సి) జురెల్‌ (బి) అశ్విన్‌ 3, క్రునాల్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 173/6; వికెట్ల పతనం: 1-4, 2-10, 3-11, 4-60, 5-145, 6-154; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-35-2, బర్గర్‌ 3-0-30-1, అశ్విన్‌ 4-0-35-1, అవేశ్‌ 3-0-21-0, చాహల్‌ 3-0-25-1, సందీప్‌ 3-0-22-1.

Updated Date - Mar 25 , 2024 | 04:41 AM