Share News

చరిత్ర తిరగరాస్తూ.. హైదరాబాదుడు

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:35 AM

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. తిరగరాయాలన్నా మేమే..’ అన్నట్టుగా తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌ చెలరేగుతోంది. మారిన జెర్సీ మహిమో.. కొత్త ఆటగాళ్ల చేరిక మాయో కానీ మైదానంలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది....

చరిత్ర తిరగరాస్తూ.. హైదరాబాదుడు

నేటి మ్యాచ్‌

కోల్‌కతా X రాజస్థాన్‌ రాత్రి, 7.30 గం.

ఐపీఎల్‌ అత్యధిక స్కోరు రికార్డు బద్దలు

సన్‌రైజర్స్‌ 287/3

హెడ్‌ మెరుపు శతకం

ట్రావిస్‌ హెడ్‌ (41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102)

క్లాసెన్‌, సమద్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ సమద్‌ (10 బంతుల్లో 37 నాటౌట్‌)

262/7తో పోరాడి ఓడిన బెంగళూరు

దినేశ్‌ కార్తీక్‌ శ్రమ వృథా

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. తిరగరాయాలన్నా మేమే..’ అన్నట్టుగా తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌ చెలరేగుతోంది. మారిన జెర్సీ మహిమో.. కొత్త ఆటగాళ్ల చేరిక మాయో కానీ మైదానంలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు (277/3) బాది ఇరవై రోజులైనా కాలేదు.. ఈసారి బెంగళూరుపై విరుచుకుపడి ఏకంగా 287 రన్స్‌తో సంచలనం సృష్టించింది. వీర బాదుడుకు పర్యాయపదంగా ట్రావిస్‌ హెడ్‌, క్లాసెన్‌, సమద్‌ త్రయం విధ్వంసానికి చిన్నస్వామిలో పరుగుల కుంభవృష్టే కురిసింది. బంతి పడిందే ఆలస్యం అందరి చూపూ స్టాండ్స్‌ వైపే.. వీలైతే స్టేడియంపైన కూడా ఉండేలా బ్యాట్‌తో వీరంగం ఆడారు. అటు ఆర్‌సీబీకి మెరుపు ఆరంభం దక్కినా మిడిలార్డర్‌ తడబాటుతో.. దినేశ్‌ కార్తీక్‌ ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది.

బెంగళూరు: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌లో రికార్డులను బద్దలుకొడుతోంది. అసాధ్యమనుకున్న స్కోర్లను అలవోకగా సాధేస్తూ ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తోంది. ట్రావిస్‌ హెడ్‌ (41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102) మెరుపు శతకానికి క్లాసెన్‌ (31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 67), అబ్దుల్‌ సమద్‌ (10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్‌) బాదుడు తోడవడంతో ఆకాశమే హద్దుగా చెలరేగింది. అయితే రికార్డు ఛేదనలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సైతం పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో సన్‌రైజర్స్‌ 25 పరుగుల తేడాతో నెగ్గింది. రైజర్స్‌కిది హ్యాట్రిక్‌ గెలుపు కాగా, ఆర్‌సీబీకి వరుసగా ఐదో ఓటమి. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. మార్‌క్రమ్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్‌), అభిషేక్‌ (34) ఆకట్టుకున్నారు. ఫెర్గూసన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 7 262/7 స్కోరు చేసింది. దినేశ్‌ కార్తీక్‌ (35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 83), డుప్లెసి (28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 62), విరాట్‌ (20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 42) పోరాటం చూపారు. కమిన్స్‌ 3, మార్కండే 2 వికెట్లు తీశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా హెడ్‌ నిలిచాడు.

దినేశ్‌ కార్తీక్‌ పోరాటం: అతి భారీ ఛేదనలో ఆర్‌సీబీ ఓపెనర్లు డుప్లెసి, విరాట్‌ జట్టుకు కావాల్సిన విధంగానే ఆడారు. అయితే మధ్యలో వికెట్ల పతనం వీరి లయకు బ్రేక్‌ వేసింది. ఆ తర్వాత దినేశ్‌ కార్తీక్‌ ఎంతగా పోరాడినా లక్ష్యం భారీగా ఉండడంతో ఫలితం లేకపోయింది. రెండో ఓవర్‌లో విరాట్‌ 4,6తో వేగం పెంచగా, డుప్లెసి తర్వాతి ఓవర్‌లో 4,6,6తో 18 రన్స్‌ అందించాడు. ఇదే జోరుతో పవర్‌ప్లేలో జట్టు 79 పరుగులు సాధించింది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీకిదే అత్యధికం. ఇంతవరకు పోటీలో ఉన్నట్టుగానే కనిపించించింది. కానీ ఏడో ఓవర్‌లో విరాట్‌ను మార్కండే బౌల్డ్‌ చేయడంతో తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అంతే.. తర్వాతి మూడు ఓవర్లలోనే విల్‌ జాక్స్‌ (7) రనౌట్‌తో పాటు పటీదార్‌ (9), డుప్లెసి, సౌరవ్‌ చౌహాన్‌ (0)ల వికెట్లు కోల్పోవడంతో 122/5 స్కోరుతో జట్టు ఓటమి దిశగా పయనించింది. కానీ, దినేశ్‌ కార్తీక్‌ పట్టు వదల్లేదు. 13వ ఓవర్‌లో మహిపాల్‌ లోమ్రోర్‌ (19) 6,6.. దినేశ్‌ 6,4తో 25 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్‌లోనూ దినేశ్‌ 4,4,6,4తో 21 రన్స్‌ రాబట్టాడు. అటు లోమ్రోర్‌ను కమిన్స్‌ అవుట్‌ చేయడమే కాకుండా పరుగులను కట్టడి చేయడంతో రన్‌రేట్‌ 25కి పైగా పెరిగింది. దినేశ్‌ 19వ ఓవర్‌లో 6,4 బాది అవుటయ్యాడు. ఇక అప్పటిదాకా నిదానంగా ఆడిన రావత్‌ (25 నాటౌట్‌) ఆఖరి ఓవర్‌లో 4 ఫోర్లతో 18 రన్స్‌ రాబట్టి ఓటమి అంతరాన్ని తగ్గించాడు.

రైజర్స్‌ బ్యాటర్ల ఊచకోత: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ వాయువేగంతో సాగింది. ఓపెనర్‌ హెడ్‌ బాదుడుకు చిన్నస్వామి స్టేడియం మరింత చిన్నదిగా మారినట్టనిపించింది. క్లాసెన్‌, సమద్‌ సైతం బ్యాట్లు ఝుళిపించడంతో రికార్డు స్కోరు నమోదైంది. బెంగళూరు బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ ఆరంభంలోనే హెడ్‌ చెలరేగిన విధానంతో రైజర్స్‌ అలవోకగా రన్స్‌ కొల్లగొట్టింది. పవర్‌ప్లేలోనే హెడ్‌ అర్ధసెంచరీ పూర్తి కాగా జట్టు స్కోరు కూడా 7.1 ఓవర్‌లోనే 100 పరుగులకు చేరింది. రెండో ఓవర్‌లోనే 20 పరుగులు వచ్చాయి. ఐదో ఓవర్‌లో 6,6,4తో 18 రన్స్‌.. ఆరో ఓవర్‌లో 6,6,4తో 20 రన్స్‌ రాబట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 76 పరుగులు చేసింది. ఆ తర్వాత హెడ్‌ మరింతగా చెలరేగాడు. ఏడో ఓవర్‌లోనే అతను మరోసారి 4,6,6తో 21 రన్స్‌ అందించాడు. తొమ్మిదో ఓవర్‌లో అభిషేక్‌ను టోప్లే అవుట్‌ చేసినా.. అప్పటికే 49 బంతుల్లో 108 పరుగుల భాగస్వామ్యం సమకూరింది. వికెట్‌ తీసిన ఆనందాన్ని ప్రత్యర్థికి దూరం చేస్తూ మధ్య ఓవర్లలో క్లాసెన్‌ రెచ్చిపోయాడు. అటు హెడ్‌ తన బాదుడుతో 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి 13వ ఓవర్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత బాధ్యతను తీసుకున్న క్లాసెన్‌ భారీ సిక్సర్లతో హోరెత్తించాడు. 17వ ఓవర్‌లో అతడు బాదిన సిక్సర్‌ ఏకంగా 106మీ. ఎత్తులో వెళ్లి స్టేడియంపైన పడింది. అతడి ధాటికి 15 ఓవర్లలోనే స్కోరు 200 దాటింది. 17వ ఓవర్‌లో క్లాసెన్‌ నిష్క్రమించగా, మూడో వికెట్‌కు మార్‌క్రమ్‌తో కలిసి 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. చివరి మూడు ఓవర్లలోనైనా ఆర్‌సీబీకి ఉపశమనం కలుగలేదు. అబ్దుల్‌ సమద్‌ జూలు విదుల్చుతూ 19వ ఓవర్‌లో 4,4,6,6,4తో 25 పరుగులు పిండుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్‌లో మార్‌క్రమ్‌ 4,6.. సమద్‌ 6తో ఐపీఎల్‌లో రైజర్స్‌ తమ టాప్‌ స్కోరును తిరగరాసింది.

స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: అభిషేక్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) టోప్లే 34, హెడ్‌ (సి) డుప్లెసి (బి) ఫెర్గూసన్‌ 102, క్లాసెన్‌ (సి) వైశాఖ్‌ (బి) ఫెర్గూసన్‌ 67, మార్‌క్రమ్‌ (నాటౌట్‌) 32, సమద్‌ (నాటౌట్‌) 37, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 287/3; వికెట్ల పతనం: 1-108, 2-165, 3-231; బౌలింగ్‌: జాక్స్‌ 3-0-32-0, టోప్లే 4-0-68-1, యష్‌ దయాల్‌ 4-0-51-0, ఫెర్గూసన్‌ 4-0-52-2, వైశాఖ్‌ 4-0-64-0, లోమ్రోర్‌ 1-0-18-0.

బెంగళూరు: కోహ్లీ (బి) మార్కండే 42, డుప్లెసి (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 62, జాక్స్‌ (రనౌట్‌) 7, పటీదార్‌ (సి) నితీశ్‌ (బి) మార్కండే 9, సౌరవ్‌ (ఎల్బీ) కమిన్స్‌ 0, దినేశ్‌ కార్తీక్‌ (సి) క్లాసెన్‌ (బి) నటరాజన్‌ 83, లోమ్రోర్‌ (బి) కమిన్స్‌ 19, రావత్‌ (నాటౌట్‌) 25, వైశాఖ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 262/7; వికెట్ల పతనం: 1-80, 2-100, 3-111, 4-121, 5-122, 6-181, 7-244; బౌలింగ్‌: అభిషేక్‌ 1-0-10-0, భువనేశ్వర్‌ 4-0-60-0, షాబాజ్‌ 1-0-18-0, నటరాజన్‌ 4-0-47-1, కమిన్స్‌ 4-0-43-3, మార్కండే 4-0-46-2, ఉనాద్కట్‌ 2-0-37-0.

549

ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం పరుగులు. ఒక టీ20 మ్యాచ్‌లో ఇన్ని రన్స్‌ సాధించడం ఇదే తొలిసారి.

1

చేజింగ్‌లో 250+ పరుగులు చేసిన తొలి ఐపీఎల్‌ జట్టుగా బెంగళూరు

1

ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన టీమ్‌గా సన్‌రైజర్స్‌

1

ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (22) బాదిన జట్టుగా సన్‌రైజర్స్‌

2

టీ20ల్లో రెండో అత్యధిక స్కోరు (287/3) నమోదు చేసిన సన్‌రైజర్స్‌. నేపాల్‌ (314/3) టాప్‌లో ఉంది.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 6 5 1 0 10 0.767

కోల్‌కతా 5 4 1 0 8 1.688

చెన్నై 6 4 2 0 8 0.726

హైదరాబాద్‌ 6 4 2 0 8 0.502

లఖ్‌నవూ 6 3 3 0 6 0.038

గుజరాత్‌ 6 3 3 0 6 -0.637

పంజాబ్‌ 6 2 4 0 4 -0.218

ముంబై 6 2 4 0 4 -0.234

ఢిల్లీ 6 2 4 0 4 -0.975

బెంగళూరు 7 1 6 0 2 -1.185

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

Updated Date - Apr 16 , 2024 | 02:36 AM