Share News

రాహుల్‌ అవుట్‌ బుమ్రా వచ్చేశాడు

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:59 AM

ఇంగ్లండ్‌తో జరిగే ఆఖరిదైన ఐదో టెస్టు కోసం భారత జట్టును ప్రకటించారు. ధర్మశాలలో ఈనెల 7 నుంచి జరుగనున్న ఈ మ్యాచ్‌ కోసం 16 మంది ఆటగాళ్ల జాబితాను సెలెక్షన్‌ కమిటీ...

రాహుల్‌ అవుట్‌ బుమ్రా వచ్చేశాడు

ఆఖరి టెస్టుకు భారత జట్టు

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే ఆఖరిదైన ఐదో టెస్టు కోసం భారత జట్టును ప్రకటించారు. ధర్మశాలలో ఈనెల 7 నుంచి జరుగనున్న ఈ మ్యాచ్‌ కోసం 16 మంది ఆటగాళ్ల జాబితాను సెలెక్షన్‌ కమిటీ గురువారం ప్రకటించింది. అయితే మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇంకా కోలుకోలేదు. గాయంతో బాధపడుతున్న అతను ఈ టెస్టుకు కూడా దూరమవుతున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. మరోవైపు పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆఖరి టెస్టుకు ఎంపిక చేశారు. ఇక రాహుల్‌ ఐదు టెస్టుల సిరీస్‌లో కేవలం మొదటి టెస్టు మాత్రమే ఆడగా, ఆ తర్వాత తొడ కండరాల గాయంతో వైదొలిగాడు. వైద్య నిపుణుల అభిప్రాయం తీసుకునేందుకు రాహుల్‌ లండన్‌ వెళ్లాడు. గతేడాది కూడా ఇదే గాయంతో 4 నెలలపాటు విశ్రాంతి తీసుకున్న రాహుల్‌.. ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ల్లోనూ ఆడే అవకాశం లేదు. తను జట్టులో లేకపోవడంతో రజత్‌ పటీదార్‌ కొనసాగవచ్చు. కానీ పేలవ ఫామ్‌ లో ఉన్న అతడికి తుది జట్టులో చోటు కష్టమే. ధర్మశాలలో దేవ్‌దత్‌ పడిక్కళ్‌కు చాన్స్‌ లభించవచ్చు.

భారత జట్టు

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రజత్‌ పటీదార్‌, రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రవి అశ్విన్‌, బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌, ముకేశ్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, దేవ్‌దత్‌ పడిక్కళ్‌, కేఎస్‌ భరత్‌, అక్షర్‌ పటేల్‌.

బుమ్రా కమ్‌బ్యాక్‌

రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో స్టార్‌ పేసర్‌ బుమ్రాకు పని ఒత్తిడి కారణంగా విశ్రాంతినిచ్చారు. ఇప్పుడు చివరి టెస్టులో చోటు కల్పించారు. ఆడిన మూడు టెస్టుల్లోనే 17 వికెట్లు తీసిన బుమ్రా..జడేజా, అశ్విన్‌లతో కలిసి టాప్‌లో ఉన్నాడు. అయితే రాంచీలో గెలిచిన భారత్‌ 3-1తో ఇప్పటికే సిరీస్‌ కూడా సాధించింది. సిరీస్‌ గెలిస్తే అతనికి ఆఖరి టెస్టులోనూ విశ్రాంతి కల్పిస్తారని తొలుత భావించారు. మరోవైపు బుమ్రా రాకతో తుది జట్టులో ఆకాశ్‌ దీప్‌నకు చోటు దక్కుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అరంగేట్ర టెస్టులోనే ఈ బెంగాల్‌ పేసర్‌ మూడు వికెట్లతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక 2 నుంచి జరిగే రంజీ సెమీ్‌సలో తమిళనాడుకు ఆడేందుకు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను విడుదల చేశారు. ఆ మ్యాచ్‌ ముగిశాక అవసరమైతే తిరిగి భారత జట్టుతో కలుస్తాడు.

Updated Date - Mar 01 , 2024 | 05:59 AM