Share News

పంజాబ్‌కు పంచ్‌

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:17 AM

పంజాబ్‌ కింగ్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. బ్యాటర్లు విఫలమైన చోట బౌలర్లు రాణిస్తూ మ్యాచ్‌ను ఆఖరి ఓవర్‌ వరకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది...

పంజాబ్‌కు పంచ్‌

వరుసగా నాలుగో ఓటమి

3 వికెట్లతో గుజరాత్‌ గెలుపు

ముల్లాపూర్‌: పంజాబ్‌ కింగ్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. బ్యాటర్లు విఫలమైన చోట బౌలర్లు రాణిస్తూ మ్యాచ్‌ను ఆఖరి ఓవర్‌ వరకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అటు పడుతూ, లేస్తూ సాగుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు తిరిగి గెలుపు బాట పట్టింది. స్పిన్నర్‌ సాయి కిశోర్‌ (4/33) అద్భుతంగా రాణించి పంజాబ్‌ వెన్నువిరిచాడు. దీంతో టైటాన్స్‌ మూడు వికెట్లతో నెగ్గింది. పంజాబ్‌కిది వరుసగా నాలుగో ఓటమి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా పంజాబ్‌ 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్‌ (35), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (29), కర్రాన్‌ (20) మాత్రమే రాణించారు. నూర్‌ అహ్మద్‌, మోహిత్‌ శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో గుజరాత్‌ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసి గెలిచింది. రాహుల్‌ తెవాటియా (36 నాటౌట్‌), గిల్‌ (35), సుదర్శన్‌ (31) ఆకట్టుకున్నారు. హర్షల్‌కు మూడు, లివింగ్‌స్టోన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా సాయి కిశోర్‌ నిలిచాడు.

బౌలర్ల పోరాటం సరిపోలేదు..: స్వల్ప స్కోరును కాపాడుకునేందుకు పంజాబ్‌ బౌలర్లు చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. గుజరాత్‌ ఓపెనర్‌ సాహా (13) ఆదిలోనే వెనుదిరగ్గా, కెప్టెన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌ రెండో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలోనే గిల్‌, మిల్లర్‌ (4)లతో పాటు సుదర్శన్‌ వెనుదిరగడంతో టైటాన్స్‌ ఒత్తిడిలో పడింది. అటు అజ్మతుల్లా (13) కూడా నిరాశపరిచిన వేళ.. తెవాటియా బాధ్యత తీసుకున్నాడు. దీంతో 17, 18వ ఓవర్లలో మొత్తం 33 పరుగులు వచ్చాయి. ఇక 12 బంతుల్లో గెలుపునకు ఐదు పరుగులే కావాల్సి ఉండగా.. టైటాన్స్‌ నాలుగు రన్స్‌ చేసి షారుక్‌ (8), రషీద్‌ (3) వికెట్లను కోల్పోయింది. అయినా ఆఖరి ఓవర్‌ తొలి బంతిని ఫోర్‌గా మలిచి తెవాటియా మ్యాచ్‌ను ముగించాడు.

దెబ్బతీసిన సాయి కిశోర్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ చెలరేగినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. రెండో ఓవర్‌లోనే అతడు 4,4,6,4తో 21 రన్స్‌ రాబట్టాడు. ఆరో ఓవర్‌లో పేసర్‌ మోహిత్‌కు చిక్కడంతో తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పంజాబ్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. జితేశ్‌ శర్మ (13), అశుతోష్‌ (3), శశాంక్‌ (8)లను స్పిన్నర్‌ సాయి కిశోర్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చడంతో 99/7 స్కోరుతో జట్టు దయనీయస్థితిలో నిలిచింది. అయితే చివర్లో హర్‌ప్రీత్‌ బ్రార్‌ వేగంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరందించాడు.

స్కోరుబోర్డు

పంజాబ్‌: కర్రాన్‌ (ఎల్బీ) రషీద్‌ 20, ప్రభ్‌సిమ్రన్‌ (సి) సాహా (బి) మోహిత్‌ 35, రొసో (ఎల్బీ) నూర్‌ 9, జితేశ్‌ (బి) సాయి కిశోర్‌ 13, లివింగ్‌స్టోన్‌ (సి) తెవాటియా (బి) నూర్‌ 6, శశాంక్‌ (సి అండ్‌ బి) కిశోర్‌ 8, అశుతోష్‌ (సి) మోహిత్‌ (బి) సాయి కిశోర్‌ 3, హర్‌ప్రీత్‌ సింగ్‌ (రనౌట్‌) 14, హర్‌ప్రీత్‌ బ్రార్‌ (సి) షారుక్‌ (బి) సాయి కిశోర్‌ 29, హర్షల్‌ (సి) షారుక్‌ (బి) మోహిత్‌ 0, రబాడ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 142; వికెట్ల పతనం: 1-52, 2-63, 3-67, 4-78, 5-86, 6-92, 7-99, 8-139, 9-140, 10-142; బౌలింగ్‌: ఒమర్జాయ్‌ 2-0-13-0, సందీప్‌ 1-0-21-0, మోహిత్‌ శర్మ 4-0-32-2, రషీద్‌ 4-0-15-1, నూర్‌ అహ్మద్‌ 4-0-20-2, సాయి కిశోర్‌ 4-0-33-4, షారుక్‌ 1-0-7-0.

గుజరాత్‌: సాహా (సి) అశుతోష్‌ (బి) అర్ష్‌దీప్‌ 13, గిల్‌ (సి) రబాడ (బి) లివింగ్‌స్టోన్‌ 35, సాయి సుదర్శన్‌ (బి) కర్రాన్‌ 31, మిల్లర్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 4, ఒమర్జాయ్‌ (సి) జితేశ్‌ (బి) హర్షల్‌ 13, తెవాటియా (నాటౌట్‌) 36, షారుక్‌ (బి) హర్షల్‌ 8, రషీద్‌ (సి) రొసో (బి) హర్షల్‌ 3, సాయి కిశోర్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 19.1 ఓవర్లలో 146/7; వికెట్ల పతనం: 1-25, 2-66, 3-77, 4-97, 5-103, 6-138, 7-142; బౌలింగ్‌: రబాడ 4-0-40-0, అర్ష్‌దీప్‌ 2.1-0-17-1, హర్షల్‌ 3-0-15-3, కర్రాన్‌ 2-0-18-1, బ్రార్‌ 4-0-35-0, లివింగ్‌స్టోన్‌ 4-0-19-2.

Updated Date - Apr 22 , 2024 | 03:17 AM