Share News

ఫటాఫట్‌ పరాగ్‌ మెరుపు అర్ధసెంచరీ

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:41 AM

తాజా సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జోరు సాగిస్తోంది. యువ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్‌ (45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 నాటౌట్‌) మెరుపు ఆటతీరుతో ఐపీఎల్‌లో తన అత్యధిక స్కోరు సాధించగా..

ఫటాఫట్‌ పరాగ్‌ మెరుపు అర్ధసెంచరీ

నేటి మ్యాచ్‌

బెంగళూరు Xకోల్‌కతా, రాత్రి 7.30 గం. నుంచి

  • రాజస్థాన్‌కు రెండో గెలుపు

  • ఢిల్లీకి నిరాశ

జైపూర్‌: తాజా సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జోరు సాగిస్తోంది. యువ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్‌ (45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 నాటౌట్‌) మెరుపు ఆటతీరుతో ఐపీఎల్‌లో తన అత్యధిక స్కోరు సాధించగా.. బౌలర్లు సైతం తమ వంతు సహకారం అందించారు. దీంతో గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ 12 పరుగుల తేడాతో నెగ్గింది. ఆఖరి ఓవర్‌లోనూ ఢిల్లీకి గెలిచే అవకాశం ఉన్నా.. పేసర్‌ అవేశ్‌ పదునైన యార్కర్లతో కట్టడి చేశాడు. శాంసన్‌ సేనకిది వరుసగా రెండో విజయం కాగా.. డీసీకిది రెండో ఓటమి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. అశ్విన్‌ (19 బంతుల్లో 3 సిక్సర్లతో 29), ధ్రువ్‌ (12 బంతుల్లో 3 ఫోర్లతో 20) వేగంగా ఆడారు. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడింది. వార్నర్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 49), స్టబ్స్‌ (23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 నాటౌట్‌) రాణించారు. చాహల్‌, బర్గర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రియాన్‌ పరాగ్‌ నిలిచాడు.

ఆరంభం బాగున్నా..

భారీ ఛేదనను ఢిల్లీ ఆత్మవిశ్వాసంతో ఆరంభించినా.. తుదికంటా ఆ ఊపును కొనసాగించలేకపోయింది. కీలక సమయాల్లో రాయల్స్‌ బౌలర్లు వికెట్లు తీసి ఫలితాన్ని సాధించారు. చివర్లో స్టబ్స్‌ పోరాటం సరిపోలేదు. ప్రారంభంలో ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, మార్ష్‌ ఎడాపెడా బౌండరీలతో స్కోరు పది పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. రెండో ఓవర్‌లో మార్ష్‌ మూడు ఫోర్లు, మూడో ఓవర్‌లో రెండు ఫోర్లతో జోరు చూపాడు. కానీ నాలుగో ఓవర్‌లో పేసర్‌ బర్గర్‌.. మార్ష్‌ (23), భుయ్‌ (0)ల వికెట్లను తీశాడు. అటు వార్నర్‌ మాత్రం తగ్గకుండా బౌల్ట్‌ ఓవర్‌లో 6,6, బర్గర్‌ ఓవర్‌లో మరో 4,6తో పవర్‌ప్లేలో ఢిల్లీ 59/2తో పటిష్టంగానే కనిపించింది. అటు పంత్‌ (28) కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించాడు. అయితే హాఫ్‌ సెంచరీకి పరుగు దూరంలో వార్నర్‌ను పేసర్‌ అవేశ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అప్పటికే మూడో వికెట్‌కు 67 పరుగులు జత చేరాయి. ఓవర్‌ వ్యవధిలోనే కెప్టెన్‌ పంత్‌ వికెట్‌ను సైతం డీసీ కోల్పోవడం దెబ్బతీసింది. చాహల్‌ ఓవర్‌లో కట్‌ షాట్‌ ఆడబోయిన తను కీపర్‌ శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇక నాలుగు ఓవర్లలో 60 పరుగులు చేయాల్సిన వేళ ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది. అటు రాజస్థాన్‌ బౌలర్లు ఆత్మవిశ్వాసంతో కనిపించారు. కానీ హిట్టర్‌ ట్రిస్టాన్‌ స్టబ్స్‌ ఎదురుదాడికి దిగడంతో లక్ష్యం వేగంగా కరిగింది. 17వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది 19 రన్స్‌ అందించడంతో డీసీ శిబిరంలో కాస్త జోష్‌ కనిపించింది. ఇక 19వ ఓవర్‌లోనూ తను 6,4 సాధించగా, సమీకరణం ఆరు బంతులు, 17 రన్స్‌కి మారింది. అయితే పేసర్‌ అవేశ్‌ అద్భుతంగా కట్టడి చేస్తూ 20వ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇవ్వడంతో డీసీకి రెండో ఓటమి తప్పలేదు.

డెత్‌ ఓవర్లలో దాడి

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ తొలి పది ఓవర్లలో 57 పరుగులే చేయగా.. ఆ తర్వాత పది ఓవర్లలో ఏకంగా 128 పరుగులు రాబట్టింది. ఇందులో యువ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్‌ విజృంభణకు ఆఖరి ఆరు ఓవర్లలోనే 92 రన్స్‌ వచ్చాయి. మధ్య ఓవర్లలో అశ్విన్‌ వేగం కూడా ఉపయోగపడింది. పవర్‌ప్లేలో 31 పరుగులకే పరిమితమైన జట్టు ఓపెనర్‌ జైస్వాల్‌ (5), కెప్టెన్‌ శాంసన్‌ (15) వికెట్లను కోల్పోయింది. ఇక ఓపెనర్‌ బట్లర్‌ (11) పేలవ ఫామ్‌ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. 37/3 స్కోరుతో కష్టాల్లో పడిన ఆర్‌ఆర్‌ను అశ్విన్‌, రియాన్‌ జోడీ ఆదుకుంది. ఐదో నెంబర్‌లో బరిలోకి దిగిన అశ్విన్‌ హిట్టింగ్‌కు దిగి పదో ఓవర్‌లో సిక్సర్‌, తర్వాతి ఓవర్‌లో రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అటు పరాగ్‌ సైతం కుల్దీప్‌ ఓవర్‌లో సిక్సర్‌ బాదడంతో ఆటలో కాస్త వేగం పెరిగింది. అయితే చక్కగా కుదురుకున్న అశ్విన్‌ భారీ షాట్‌కు వెళ్లి స్పిన్నర్‌ అక్షర్‌కు దొరికిపోయాడు. దీంతో నాలుగో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం పరాగ్‌ బ్యాట్‌ ఝుళిపిస్తూ ఖలీల్‌ ఓవర్‌లో 6,4,4.. ముకేశ్‌ ఓవర్‌లో 4,6 బాది 34 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. అటు ధ్రువ్‌ జురెల్‌ (20)తో ఐదో వికెట్‌కు 52 పరుగులు జత చేశాడు. ఇక ఆఖరి ఓవర్‌లో రియాన్‌ విశ్వరూపం ప్రదర్శిస్తూ.. 4,4,6,4,6తో 25 పరుగులు సమకూర్చాడు. అటు తన చివరి 19 బంతుల్లో పరాగ్‌ 58 పరుగులు సాధించడం విశేషం.

స్కోరుబోర్డు

పంజాబ్‌ కింగ్స్‌: జైస్వాల్‌ (బి) ముఖేష్‌ 5, బట్లర్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 11, శాంసన్‌ (సి) పంత్‌ (బి) ఖలీల్‌ 15, పరాగ్‌ (నాటౌట్‌) 84, అశ్విన్‌ (సి) స్టబ్స్‌ (బి) అక్షర్‌ 29, జురెల్‌ (బి) నోకియా 20, హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 14, ఎక్స్‌ట్రాలు 7: మొత్తం (20 ఓవర్లలో) 185/5 ; వికెట్లపతనం : 1/9, 2/30, 3/36, 4/90, 5/142 ; బౌలింగ్‌ : ఖలీల్‌ 4-0-24-1, ముఖేష్‌ 4-0-49-1, నోకియా 4-0-48-1, అక్షర్‌ 4-0-21-1, కుల్దీప్‌ 4-0-41-1

ఢిల్లీ క్యాపిటల్స్‌: వార్నర్‌ (సి) సందీప్‌ (బి) అవేశ్‌ 49, మార్ష్‌ (బి) బర్గర్‌ 23, భుయ్‌ (సి) శాంసన్‌ (బి) బర్గర్‌ 0, పంత్‌ (సి) శాంసన్‌ (బి) చాహల్‌ 28, స్టబ్స్‌ (నాటౌట్‌) 44, పోరెల్‌ (సి) బట్లర్‌ (బి) చాహల్‌ 9, అక్షర్‌ (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు 5: మొత్తం (20 ఓవర్లలో) 173/5 ; వికెట్లపతనం : 1/30, 2/30, 3/97, 4/105, 5/122 ; బౌలింగ్‌ : బౌల్ట్‌ 3-0-29-0, బర్గర్‌ 3-0-29-2, అశ్విన్‌ 3-0-30-0, అవేశ్‌ ఖాన్‌ 4-0-29-1, చాహల్‌ 3-0-19-2, సందీప్‌ శర్మ 4-0-36-0.

Updated Date - Mar 29 , 2024 | 02:41 AM