Share News

అరెరె.. ఆర్సీబీ!

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:27 AM

ఆఖరి ఓవర్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాడు కర్ణ్‌ శర్మ (7 బంతుల్లో 3 సిక్స్‌లతో 20) సిక్స్‌లతో ఆశలు రేపినా.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతికి రనౌట్‌ చేసి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) విజయాన్ని దక్కించుకొంది...

అరెరె.. ఆర్సీబీ!

నేటి మ్యాచ్‌

రాజస్థాన్‌ X ముంబై, రాత్రి, 7.30 గం.

భారీ ఛేదనలో పరుగు తేడాతో కోల్‌కతా చేతిలో పరాజయం

రాణించిన సాల్ట్‌, అయ్యర్‌, రస్సెల్‌

జాక్స్‌, పటీదార్‌, కర్ణ్‌ పోరాటం వృథా

కోల్‌కతా: ఆఖరి ఓవర్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాడు కర్ణ్‌ శర్మ (7 బంతుల్లో 3 సిక్స్‌లతో 20) సిక్స్‌లతో ఆశలు రేపినా.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతికి రనౌట్‌ చేసి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) విజయాన్ని దక్కించుకొంది. ఆదివారం నాటకీయ మలుపులు తిరుగుతూ సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో బెంగళూరుపై గెలిచింది. నైట్‌ రైడర్స్‌ నిర్దేశించిన 223 పరుగుల భారీ ఛేదనలో.. ఆఖరి ఓవర్‌లో ఆర్సీబీ గెలుపునకు 21 పరుగులు కావాలి. ఈ దశలో స్టార్క్‌ బౌలింగ్‌లో శర్మ మూడు సిక్స్‌లతో ఉత్కంఠ రేపాడు. అయితే, అతడు క్యాచవుట్‌ కావడంతో.. చివరి బంతికి మూడు రన్స్‌ కావాల్సి వచ్చింది. కానీ, ఒక్క పరుగు పూర్తి చేసిన ఫెర్గూసన్‌ రనౌటవడంతో ఆర్సీబీకి నిరాశ తప్పలేదు. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 222/6 స్కోరు చేసింది. ఫిల్‌ సాల్ట్‌ (14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 50), రమణ్‌దీప్‌ (9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్‌) సత్తా చాటారు. గ్రీన్‌, యశ్‌ దయాళ్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో బెంగళూరు ఓవర్లన్నీ ఆడి 221 రన్స్‌కు ఆలౌటైంది. విల్‌ జాక్స్‌ (32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55), రజత్‌ పటీదార్‌ (23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) పోరాడారు. రస్సెల్‌ 3, హర్షిత్‌ రాణా, నరైన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో ఓటముల్లో డబుల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసిన ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న రస్సెల్‌ (27 నాటౌట్‌, 3/25)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ మ్యాచ్‌’ దక్కింది.

ఆదుకొన్న జాక్స్‌, పటీదార్‌: ఛేదనలో ఓపెనర్‌ కోహ్లీ (18).. రాణా బౌలింగ్‌లో వివాదాస్పద రీతిలో అవుటయ్యాడు. విరాట్‌ దాన్ని నోబాల్‌గా భావించినా.. రివ్యూ అనంతరం లీగల్‌ డెలివరీగా ప్రకటించారు. ఇక, డుప్లెసి (7)ని వరుణ్‌ వెనక్కి పంపాడు. అయితే, జాక్స్‌, పటీదార్‌ మూడో వికెట్‌కు 48 బంతుల్లో 102 పరుగుల భాగస్వామ్యంతో జట్టును మ్యాచ్‌లో నిలిపారు. కానీ, 12వ ఓవర్‌లో వీరిద్దరినీ అవుట్‌ చేసిన రస్సెల్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. తొలి బంతికి జాక్స్‌ను.. నాలుగో బంతికి పటీదార్‌ను పెవిలియన్‌ చేర్చడంతో బెంగళూరు 145/4తో నిలిచింది. గ్రీన్‌ (6)ను నరైన్‌, సుయాష్‌ (24)ను హర్షిత్‌ బోల్తా కొట్టించారు. డెత్‌ ఓవర్లలో దినేష్‌ కార్తీక్‌ (18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25) క్రీజులో ఉండడంతో ఆర్సీబీ గెలుస్తుందనుకున్నా.. కీలక సమయంలో కార్తీక్‌ను రస్సెల్‌ అవుట్‌ చేశాడు. ఆఖర్లో కర్ణ్‌ శర్మ భయపెట్టినా ఫలితం లేకపోయింది.

సాల్ట్‌ దూకుడు..: ఓపెనర్‌ సాల్ట్‌ అదిరే ఆరంభాన్నివ్వగా.. మిడిలార్డర్‌లో కెప్టెన్‌ అయ్యర్‌ ఆదుకోవడంతో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ప్రత్యర్థికి సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. నరైన్‌ (10) విఫలమైనా.. సాల్ట్‌ భారీషాట్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, 5వ ఓవర్‌లో సాల్ట్‌ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో.. తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. నరైన్‌, రఘువంశీ (3)లను యశ్‌ ఒకే ఓవర్‌లో అవుట్‌ చేయడంతో.. పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 75/3. వెంకటేష్‌ అయ్యర్‌ (16)ను గ్రీన్‌ క్రీజులో కుదురుకోన్విలేదు. కానీ, రింకూ సింగ్‌ (24)తో కలసి 5వ వికెట్‌కు 40 పరుగులు జోడించిన శ్రేయాస్‌ అయ్యర్‌.. రస్సెల్‌తో ఆరో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకొన్నాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న అయ్యర్‌ను గ్రీన్‌ పెవిలియన్‌ చేర్చినా.. చివరి రెండు ఓవర్లలో రస్సెల్‌ అండతో రమణ్‌దీప్‌ దుమ్మురేపడంతో జట్టు స్కోరు 220 దాటింది.

స్కోరుబోర్డు

కోల్‌కతా: సాల్ట్‌ (సి) పటీదార్‌ (బి) సిరాజ్‌ 48, నరైన్‌ (సి) కోహ్లీ (బి) యశ్‌ 10, రఘువంశీ (సి) గ్రీన్‌ (బి) యశ్‌ 3, వెంకటేష్‌ (సి) లోమ్రోర్‌ (బి) గ్రీన్‌ 16, శ్రేయాస్‌ (సి) డుప్లెసి (బి) గ్రీన్‌ 50, రింకూ (సి) యశ్‌ (బి) ఫెర్గూసన్‌ 24, రస్సెల్‌ (నాటౌట్‌) 27, రమణ్‌దీప్‌ (నాటౌట్‌) 24; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 20 ఓవర్లలో 222/6; వికెట్ల పతనం: 1-56, 2-66, 3-75, 4-97, 5-137, 6-179; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-40-1, యశ్‌ దయాళ్‌ 4-0-56-2, ఫెర్గూసన్‌ 4-0-47-1, కర్ణ్‌ శర్మ 4-0-33-0, గ్రీన్‌ 4-0-35-2.

బెంగళూరు: కోహ్లీ (సి అండ్‌ బి) రాణా 18, డుప్లెసి (సి) వెంకటేష్‌ (బి) వరుణ్‌ 7, జాక్స్‌ (సి) రఘువంశీ (బి) రస్సెల్‌ 55, పటీదార్‌ (సి) రాణా (బి) రస్సెల్‌ 52, గ్రీన్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) నరైన్‌ 6, సుయాష్‌ (సి) రఘువంశీ (బి) రాణా 24, లోమ్రోర్‌ (సి అండ్‌ బి) నరైన్‌ 4, కార్తీక్‌ (సి) సాల్ట్‌ (బి) రస్సెల్‌ 25, కర్ణ్‌ శర్మ (సి అండ్‌ బి) స్టార్క్‌ 20, సిరాజ్‌ (నాటౌట్‌) 0, ఫెర్గూసన్‌ (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 221 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-27, 2-35, 3-137, 4-138, 5-151, 6-155, 7-187, 8-202, 9-220, 10-221; బౌలింగ్‌: హర్షిత్‌ రాణా 4-0-33-2, స్టార్క్‌ 3-0-55-1, వరుణ్‌ 4-0-36-1, నరైన్‌ 4-0-34-2, సుయాష్‌ 2-0-33-0, రస్సెల్‌ 3-0-25-3.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 7 6 1 0 12 0.677

కోల్‌కతా 7 5 2 0 10 1.206

హైదరాబాద్‌ 7 5 2 0 10 0.914

చెన్నై 7 4 3 0 8 0.529

లఖ్‌నవూ 7 4 3 0 8 0.123

గుజరాత్‌ 8 4 4 0 8 -1.055

ముంబై 7 3 4 0 6 -0.133

ఢిల్లీ 8 3 5 0 6 -0.477

పంజాబ్‌ 8 2 6 0 4 -0.292

బెంగళూరు 8 1 7 0 2 -1.046

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

Updated Date - Apr 22 , 2024 | 03:27 AM