Share News

టాస్‌ కూడా వేయలేదు!

ABN , Publish Date - Oct 17 , 2024 | 06:06 AM

ఎడతెరిపిలేని వర్షం కారణంగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్ట్‌ మొదటి రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. బుధవారం ఉదయం నుంచే వాన కురుస్తుండడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు తొలి రోజు ఆటను రద్దు...

టాస్‌ కూడా వేయలేదు!

ఉ. 9.15 నుంచి స్పోర్ట్స్‌18లో..

  • తొలి రోజు ఆట వర్షార్పణం

  • భారత్‌-కివీ్‌స మొదటి టెస్ట్‌

బెంగళూరు: ఎడతెరిపిలేని వర్షం కారణంగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్ట్‌ మొదటి రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. బుధవారం ఉదయం నుంచే వాన కురుస్తుండడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కనీసం టాస్‌ వేయడానికి కూడా పరిస్థితులు సహకరించలేదు. మధ్యాహ్నం 2 గంటలకు అంపైర్లు పిచ్‌ను పరిశీలించడానికి వచ్చినప్పుడు.. వికెట్‌కు ఇరువైపులా తడిగా ఉన్నట్టు గమనించారు. ఆ సమయంలో మరోసారి భారీ వర్షం కురవడంతో ఆటను రద్దు చేశారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో హాక్‌-ఐ కెమెరాలను కూడా అమర్చలేదు. ఒకవేళ మ్యాచ్‌ జరిగే పరిస్థితులుంటే ఆ కెమెరాలను అమర్చడానికే మరో గంటన్నర సమయం పట్టేది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారు. వీరికి కోహ్లీ, యశస్వీ జైస్వాల్‌ నెట్‌ ప్రాక్టీ్‌సను చూసే చాన్స్‌ దక్కింది.


గురువారం కూడా మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం బట్టి తెలుస్తోంది. ఒక రోజు నష్టపోవడంతో.. మిగిలిన నాలుగు రోజులు 98 ఓవర్ల చొప్పున ఆట సాగేందుకు మ్యాచ్‌ 15 నిమిషాలు ముందుగా ఆరంభమై.. 15 నిమిషాలు ఆలస్యంగా ముగియనుంది. స్లో ఓవర్‌ రేట్‌ నడిస్తే మరో అరగంటపాటు ఆటను పొడిగించే అవకాశం ఉంది. గురువారం ఉదయం 8.45 గంటలకు టాస్‌ను షెడ్యూల్‌ చేశారు.

Updated Date - Oct 17 , 2024 | 06:06 AM