Share News

మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ చాంపియన్‌ కివీస్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:42 AM

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌ జట్టు కొత్త చాంపియన్‌గా ఆవిర్భవించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన ఆ జట్టు 32 పరుగులతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. తొలుత కివీస్‌ 20

మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ చాంపియన్‌ కివీస్‌

ఫైనల్లో సఫారీలు చిత్తు

అటు పురుషులు.. ఇటు మహిళలు

న్యూజిలాండ్‌ డబుల్‌ ధమాకా

న్యూజిలాండ్‌ పురుషులు, మహిళల జట్లు ఒకేరోజు చరిత్రాత్మక విజయాలతో మురిపించాయి. టామ్‌ లాథమ్‌ సారథ్యంలోని పురుషుల జట్టు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై తొలి టెస్టు విజయాన్ని అందుకోగా.. సోఫీ డివైన్‌ నేతృత్వంలోని మహిళల బృందం ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి తొలిసారి టీ20 ప్రపంచ కప్‌ చాంపియన్‌గా అవతరించింది.

దుబాయ్‌: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌ జట్టు కొత్త చాంపియన్‌గా ఆవిర్భవించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన ఆ జట్టు 32 పరుగులతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. తొలుత కివీస్‌ 20 ఓవర్లలో 158/5 స్కోరు చేసింది. అమీలీ కెర్‌ (43), బ్రూక్‌ హాలీ డే (38), సుజీ బేట్స్‌ (32) సత్తా చాటారు. ఎం లాబా రెండు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 126/9 స్కోరుకే పరిమితమై ఓడింది. వోల్వార్ట్‌ (33), బ్రిట్స్‌ (17), ట్రయన్‌ (14) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘సిరీస్‌’ అమీలీ కెర్‌ మూడు వికెట్లు పడగొట్టింది. 2009, 2010 టోర్నీలలో రన్నర్‌పగా నిలిచిన న్యూజిలాండ్‌ ఈసారి మాత్రం ట్రోఫీని దక్కించుకుంది. ఇది తొమ్మిదో టీ20 ప్రపంచ కప్‌కాగా.. గత 8 సార్లలో ఆసీస్‌ 6 సార్లు, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ ఒక్కోసారి విజేతగా నిలిచాయి.

ఒత్తిడికి చిత్తు: ఛేదనలో ఓపెనర్లు శుభారంభం ఇచ్చినా.. మిగతా బ్యాటర్లు ఒత్తిడికి చిత్తవడంతో సౌతాఫ్రికాకు ఓటమితప్పలేదు. కెప్టెన్‌ వోల్వార్ట్‌, బ్రిట్స్‌ ధాటిగా ఆడి మొదటి వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ఏడో ఓవర్లో బ్రిట్స్‌ (17)ను జొనాస్‌ అవుట్‌ చేయగా, పదో ఓవర్లో కీలకమైన వోల్వార్ట్‌తోపాటు బాష్‌ (9)ను పెవిలియన్‌ చేర్చిన కెర్‌ సఫారీలకు డబుల్‌ షాకిచ్చింది. అప్పటికే కొండెక్కిన రన్‌రేట్‌ను అధిగమించలేక సౌతాఫ్రికా వరుస వికెట్లు చేజార్చుకుని ఓటమి పాలైంది. దాంతో వరుసగా రెండోసారీ సఫారీలు రన్నర్‌పగానే నిలవాల్సి వచ్చింది. 2023లో ఆ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.


ఆ ముగ్గురి దూకుడు: టాపార్డర్‌లో కెర్‌, బేట్స్‌, మిడిలార్డర్‌లో హాలీ డే దూకుడుగా ఆడడంతో కివీస్‌ పటిష్ట స్కోరు చేసింది. రెండో ఓవర్లో ప్లిమ్మెర్‌ (9)ను అవుటైనా బేట్స్‌, కెర్‌ వేగంగా ఆడి రెండో వికెట్‌కు 37 పరుగులు జత చేశారు. అనంతరం ధనాధన్‌ బ్యాటింగ్‌తో హాలీ డే, కెర్‌ నాలుగో వికెట్‌కు 57 పరుగులు జోడించారు.

సంక్షిప్తస్కోర్లు

న్యూజిలాండ్‌: 20 ఓవర్లలో 158/5 (కెర్‌ 43, హాలీ డే 38, బేట్స్‌ 32, ఎం లాబా 2/31).

దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 126/9 (వోల్వార్ట్‌ 33, బ్రిట్స్‌ 17, ట్రయన్‌ 14, కెర్‌ 3/24, మెయిర్‌ 3/25).

Updated Date - Oct 21 , 2024 | 12:42 AM