Share News

ముంబై గెలిచింది

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:42 AM

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో ఎట్టకేలకు బోణీ కొట్టింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రొమారియో షెఫర్డ్‌ (10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 నాటౌట్‌) ఊచకోతతో.. ఐపీఎల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 29 పరుగుల తేడాతో...

ముంబై గెలిచింది

నేటి మ్యాచ్‌

చెన్నై X కోల్‌కతా, వేదిక: చెన్నై-రా.7.30 గం.

షెఫర్డ్‌ (10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 నాటౌట్‌)

అదరగొట్టిన రోహిత్‌, షెఫర్డ్‌, డేవిడ్‌

29 పరుగులతో ఓడిన ఢిల్లీ

  • కొట్జీకి 4 వికెట్లు

  • స్టబ్స్‌, షా పోరాటం వృథా

ముంబై: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో ఎట్టకేలకు బోణీ కొట్టింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రొమారియో షెఫర్డ్‌ (10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 నాటౌట్‌) ఊచకోతతో.. ఐపీఎల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఢిల్లీ కూడా తుదికంటా పోరాడినా.. షెఫర్డ్‌ చివరి ఓవర్‌ విధ్వంసమే రెండు జట్ల మధ్య తేడా చూపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు చేసింది. వాంఖడేలో ముంబైకిదే అత్యధిక స్కోరు. రోహిత్‌ శర్మ (27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), టిమ్‌ డేవిడ్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 42), హార్దిక్‌ (39) రాణించారు. అక్షర్‌ పటేల్‌, నోకియా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఢిల్లీ ఓవర్లన్నీ ఆడి 205/8 స్కోరు మాత్రమే చేసింది. స్టబ్స్‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 71 నాటౌట్‌), పృథ్వీ షా (40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66), అభిషేక్‌ పోరెల్‌ (41) పోరాటాలు వృథా అయ్యాయి. కొట్జీ 4, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా మూడు మ్యాచ్‌ల ఓటమి తర్వాత ముంబైకిది తొలి గెలుపుకాగా.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి దిగజారింది.

జోరు తగ్గిన పవర్‌ప్లే..: భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఢిల్లీ.. పవర్‌ప్లేలో ఆశించినంత వేగంగా పరుగులు చేయలేకపోవడం ఒకరకంగా ఓటమికి కారణమైంది. ఓపెనర్‌ వార్నర్‌ (10) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. మరో ఓపెనర్‌ షా, అభిషేక్‌ రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 94/1తో పోటీ ఇచ్చేలా కనిపించింది. కానీ, షాను బుమ్రా బౌల్డ్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. ఈ దశలో పోరెల్‌తో కలసి మూడో వికెట్‌కు 34 పరుగులు జోడించిన స్టబ్స్‌.. తుది వరకూ ఒంటరి పోరాటాన్ని కొనసాగించాడు. అభిషేక్‌ను బుమ్రా.. పంత్‌ (1)ను కొట్జీ అవుట్‌ చేయడంతో ఢిల్లీ ఆశలు వదిలేసుకొంది. 19వ ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ (8) రనౌట్‌ అయినా.. స్టబ్స్‌ మూడు సిక్స్‌లు బాదడంతో ఢిల్లీ 201/5తో నిలిచింది. చివరి ఓవర్‌లో క్యాపిటల్స్‌ విజయానికి 35 పరుగులు కావాల్సి ఉండగా.. లలిత్‌ (3), కుశాగ్ర (0), రిచర్డ్‌సన్‌ (2)ను అవుట్‌ చేసిన కొట్జీ.. 4 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు.

దుమ్మురేపిన రోహిత్‌..: ఆరంభంలో రోహిత్‌ శర్మ.. ఆఖర్లో షెఫర్డ్‌ వీరహారంతో ముంబై భారీ స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు ఇషాన్‌, రోహిత్‌ అదిరే ఆరంభాన్నిచ్చారు. అయితే, రోహిత్‌ను బౌల్డ్‌ చేసిన అక్షర్‌.. 80 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. ఈ సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన సూర్యకుమార్‌ (0)ను నోకియా డకౌట్‌ చేశాడు. 11వ ఓవర్లో ఇషాన్‌ను అక్షర్‌ అవుట్‌ చేయగా.. తిలక్‌ వర్మ (6) ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయాడు.

స్కోరుబోర్డు

ముంబై: రోహిత్‌ (బి) అక్షర్‌ 49, ఇషాన్‌ (సి అండ్‌ బి) అక్షర్‌ 42, సూర్యకుమార్‌ (సి/సబ్‌) ఫ్రేజర్‌ (బి) నోకియా 0, హార్దిక్‌ (సి/సబ్‌) ఫ్రేజర్‌ (బి) నోకియా 39, తిలక్‌ (సి) అక్షర్‌ (బి) ఖలీల్‌ 6, డేవిడ్‌ (నాటౌట్‌) 45, షెఫర్డ్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 234/5; వికెట్ల పతనం: 1-80, 2-81, 3-111, 4-121, 5-181; బౌలింగ్‌: ఖలీల్‌ 4-0-39-1, ఇషాంత్‌ 3-0-40-0, రిచర్డ్‌సన్‌ 4-0-40-0, అక్షర్‌ 4-0-35-2, లలిత్‌ 1-0-15-0, నోకియా 4-0-65-2.

ఢిల్లీ: పృథ్వీ షా (బి) బుమ్రా 66, వార్నర్‌ (సి) హార్దిక్‌ (బి)షెఫర్డ్‌ 10, అభిషేక్‌ (సి) డేవిడ్‌ (బి) బుమ్రా 41, స్టబ్స్‌ (నాటౌట్‌) 71, పంత్‌ (సి) హార్దిక్‌ (బి) కొట్జీ 1, అక్షర్‌ (రనౌట్‌) 8, లలిత్‌ (సి) ఇషాన్‌ (బి) కొట్జీ 3, కుశాగ్ర (సి) తిలక్‌ (బి) కొట్జీ 0, రిచర్డ్‌సన్‌ (సి) రోహిత్‌ (బి) కొట్జీ 2; ఎక్స్‌టాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 205/8; వికెట్ల పతనం: 1-22, 2-110, 3-144, 4-153, 5-194, 6-203, 7-203, 8-205; బౌలింగ్‌: కొట్జీ 4-0-34-4, బుమ్రా 4-0-22-2, ఆకాశ్‌ 4-0-45-0, షెఫర్డ్‌ 4-0-54-1, నబీ 2-0-17-0, చావ్లా 2-0-32-0.

6 బంతులు, 32 పరుగులు

సీజన్‌లో రెండో మ్యాచ్‌ ఆడుతున్న ముంబై బ్యాటర్‌ రొమారియో షెఫర్డ్‌ విధ్వంసమే సృష్టించాడు. ముంబై ఇన్నింగ్స్‌లో చివరి 13 బంతులు మిగిలి ఉన్నప్పుడు క్రీజులోకి అడుగుపెట్టిన తను ఆఖరి ఓవర్‌లో ఢిల్లీకి పట్టపగలే చుక్కలు చూపించాడు. పేసర్‌ నోకియా వేసిన ఈ ఓవర్‌లో అతను వరుసగా 4,6,6,6,4,6తో ఏకంగా 32 పరుగులు రాబట్టి స్కోరును 234కి చేర్చాడు. గతేడాది లఖ్‌నవూ నుంచి ట్రేడింగ్‌ ద్వారా ముంబై ఈ విండీస్‌ ఆల్‌రౌండర్‌ను తీసుకుంది.

ఎగతాళిని ‘కట్టడి’ చేశారు!

తొలి మూడు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌ హార్దిక్‌కు ముంబై అభిమానుల నుంచి ఎదురైన ఎగతాళి, హేళన ఈసారి అంతగా కనిపించలేదు. వ్యతిరేకతను తగ్గించేందుకు ముంబై ఫ్రాంచైజీ ఆదివారం నాటి మ్యాచ్‌కు ఏకంగా 18 వేల టిక్కెట్లను పాఠశాల విద్యార్ధులకు ఉచితంగా పంపిణీ చేసింది. ‘అందరికీ విద్య, క్రీడల దినోత్సవం’లో భాగంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ వీరిని రప్పించింది. మరోవైపు టాస్‌ సమయంలోనూ హార్దిక్‌ను గేలి చేస్తున్నట్టుగా టీవీల్లో ఎలాంటి శబ్దం వినిపించలేదు. దీంతో కావాలనే సౌండ్‌ను బ్లాక్‌ చేశారని ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 4 4 0 0 8 1.120

కోల్‌కతా 3 3 0 0 6 2.518

లఖ్‌నవూ 4 3 1 0 6 0.775

చెన్నై 4 2 2 0 4 0.517

హైదరాబాద్‌ 4 2 2 0 4 0.409

పంజాబ్‌ 4 2 2 0 4 -0.220

గుజరాత్‌ 5 2 3 0 4 -0.797

ముంబై 4 1 3 0 2 -0.704

బెంగళూరు 5 1 4 0 2 -0.843

ఢిల్లీ 5 1 4 0 2 -1.370

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

Updated Date - Apr 08 , 2024 | 01:42 AM