మనోడు నిలబెట్టాడు
ABN , Publish Date - Dec 29 , 2024 | 06:06 AM
నితీశ్ కుమార్ బ్యాట్ నుంచి వచ్చిన స్కోర్లివి. తన బ్యాటింగ్ తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నా కనీసం 50+ స్కోరైనా నమోదు కావడం లేదే అనే వెలితి అందరిలోనూ ఉంది. చివరకు సాధించాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ బరిలోకి దిగిన తను.. ఓ వైపు ఫాలోఆన్ ప్రమాదం...

ఆసీ్‌సతో బాక్సింగ్ డే టెస్టు
అజేయ శతకంతో చెలరేగిన నితీశ్
భారత్ తొలి ఇన్నింగ్స్ 358/9
సుందర్ అర్ధసెంచరీ
41, 38 నాటౌట్,
42, 42, 16..
తాజా సిరీస్‌లో నితీశ్ కుమార్ బ్యాట్ నుంచి వచ్చిన స్కోర్లివి. తన బ్యాటింగ్ తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నా కనీసం 50+ స్కోరైనా నమోదు కావడం లేదే అనే వెలితి అందరిలోనూ ఉంది. చివరకు సాధించాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ బరిలోకి దిగిన తను.. ఓ వైపు ఫాలోఆన్ ప్రమాదం పొంచి ఉండగా.. ప్రఖ్యాత మెల్‌బోర్న్ మైదానంలో అబ్బురమనిపించే షాట్లతో చెలరేగాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి ప్రపంచ అత్యుత్తమ స్థాయి బౌలర్లను కాచుకుంటూ 21 ఏళ్ల నితీశ్ వైల్డ్ ఫైర్ బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. కుమారుడి కెరీర్ కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ తండ్రి కళ్ల ముందే.. కెరీర్‌లో తొలి సెంచరీతో ఈ తెలుగు తేజం క్రీడాభిమానులను ఉప్పొంగిపోయేలా చేశాడు. అటు సుందర్ హాఫ్ సెంచరీతో జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు.
మెల్‌బోర్న్: ఎవరూ ఊహించని విధంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ వహ్వా.. అనిపిస్తున్నాడు. ఆసీ్‌సతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో అజేయ శతకం (105 బ్యాటింగ్) ద్వారా గట్టి పంచే ఇచ్చాడు. తద్వారా జట్టును ఫాలోఆన్ నుంచి కూడా గట్టెక్కించాడు. వాషింగ్టన్ సుందర్ (50)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 127 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో మూడో రోజు శనివారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358/9 స్కోరుతో నిలిచింది. అయితే వెలుతురులేమితో పాటు వర్షం కారణంగా ఆఖరి సెషన్‌ను గంట ముందుగానే ముగించారు. బోలాండ్, కమిన్స్‌లకు మూడేసి, లియోన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం భారత జట్టు 116 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక చేతిలో వికెట్లేమీ లేకపోవడంతో నితీశ్ వీలైనంత వేగంగా పరుగులు రాబట్టాల్సి ఉంది. ఆదివారం అర్ధగంట ముందుగానే మ్యాచ్ ఆరంభం కానుంది.
పంత్ పేలవంగా..: 164/5 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించగా, ఆదుకుంటారనుకున్న పంత్ (28), జడేజా (17) తీవ్రంగా నిరుత్సాహపరిచారు. ఆరంభంలో ఇద్దరూ ఆచితూచి ఆడి వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ఓపిగ్గా క్రీజులో నిలవాల్సిన పంత్ నిర్లక్ష్యపు షాట్‌కు వెనుదిరిగాడు. బోలాండ్ ఓవర్‌లో అనవసరంగా ర్యాంప్ షాట్‌కు వెళ్లి క్యాచ్ ఇచ్చాడు. దీంతో అతడి షాట్ ఎంపిక తీవ్ర విమర్శలపాలైంది. అటు జడేజా కూడా కాసేపటికే వెనుదిరిగాడు. నితీశ్ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించి సుందర్‌తో ఆదుకునే ప్రయత్నం చేశాడు. తొలి సెషన్‌లో జట్టు 27 ఓవర్లలో 80 పరుగులు చేయగా ఇందులో నితీశ్‌వే 40 రన్స్ ఉండడం విశేషం.
ఆదుకున్న నితీశ్-సుందర్: 221 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ.. ఆసీస్ బౌలర్ల జోరు చూస్తే భారత్‌కు ఫాలోఆన్ తప్పదనిపించింది. అప్పటికి మరో 53 పరుగులు చేయాల్సి ఉంది. అయితే నితీశ్ మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా అన్ని రకాల షాట్లతో ఎంసీజీలో బంతిని పరిగెత్తించాడు. అటు సుందర్ కూడా నిలకడ చూపడంతో జట్టుకు ఫాలోఆన్ తప్పింది. రెండో సెషన్‌లో వీరు వికెట్ కోల్పోకుండా ఆడారు. ఇప్పటిదాకా టెస్టుల్లో 40+ స్కోరును దాటలేకపోయిన నితీశ్ ముందుగా అర్ధసెంచరీ పూర్తి చేసి పుష్ప తరహాలో సంబరాలు చేసుకున్నాడు. దీంతో చూస్తుండగానే సుందర్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు వంద పరుగులు జోడించాడు. 97వ ఓవర్‌లో వర్షం కురవడంతో టీబ్రేక్‌కు కాస్త ముందుగానే వెళ్లారు.
తీవ్ర ఉత్కంఠ: అర్ధగంట ఆలస్యంగా ఆరంభమైన ఆఖరి సెషన్‌లో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు.. చివరకు 108వ ఓవర్‌లో నితీశ్ ఓ ఫోర్ సాధించగా.. సుందర్ తన అర్ధసెంచరీని పూర్తి చేశాడు. ఆసీ్‌సను విసిగిస్తున్న ఈ జోడీని లియోన్ దెబ్బతీశాడు. ఆ వెంటనే 114వ ఓవర్‌లో మూడో బంతికి బుమ్రాను కమిన్స్ డకౌట్ చేశాడు. అప్పటికి నితీశ్ 99 పరుగులతో ఉన్నాడు. అభిమానులతో పాటు స్టేడియంలో కూర్చున్న నితీశ్ తండ్రి ఉద్వేగంతో కనిపించాడు. మిగిలిన ఆ మూడు బంతులను సిరాజ్ ఎలా ఎదుర్కొంటాడా? అని అంతా ఊపిరిబిగపట్టి ఎదురుచూశారు. సిరాజ్ కెరీర్‌లో అత్యంత సవాల్‌తో కూడిన క్షణాలను విజయవంతంగానే అధిగమించాడు. ఇక తర్వాతి ఓవర్‌లో ఫుల్లర్ లెంగ్త్‌తో వేసిన మూడో బంతిని నితీశ్ అమాంతం మిడాన్ వైపు లాఫ్టెడ్ షాట్‌తో బౌండరీకి తరలించాడు. సెంచరీ పూర్తయ్యాక నితీశ్ మోకాలు నేలకు ఆనించి బ్యాట్‌పై హెల్మెట్‌ను ఉంచి ఎడమచేతిని ఆకాశం వైపు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ దృశ్యాన్ని ఎంసీజీతో పాటు టీవీల్లో తిలకించిన లక్షలాది అభిమానులు కూడా పులకించిపోయారు. మరో ఓవర్ తర్వాత వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది.
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 474
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (రనౌట్) 82; రోహిత్ (సి) బోలాండ్ (బి) కమిన్స్ 3; రాహుల్ (బి) కమిన్స్ 24; విరాట్ (సి) క్యారీ (బి) బోలాండ్ 36; ఆకాశ్ (సి) లియోన్ (బి) బోలాండ్ 0; పంత్ (సి) లియోన్ (బి) బోలాండ్ 28; జడేజా (ఎల్బీ) లియోన్ 17; నితీశ్ (బ్యాటింగ్) 105; సుందర్ (సి) స్మిత్ (బి) లియోన్ 50; బుమ్రా (సి) ఖవాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 116 ఓవర్లలో 358/9. వికెట్ల పతనం: 1-8, 2-51, 3-153, 4-154, 5-159, 6-191, 7-221, 8-348, 9-350.బౌలింగ్: స్టార్క్ 25-2-86-0; కమిన్స్ 27-6-86-3; బోలాండ్ 27-7-57-3; లియోన్ 27-4-88-2; మార్ష్ 7-1-28-0; హెడ్ 3-0-11-0.
అరుదైన గౌరవం
క్లిష్ట పరిస్థితుల్లో శతక్కొట్టి జట్టును ఆదుకున్న నితీశ్ సహచరుల నుంచి గౌరవాన్ని అందుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ సహా జట్టు ఆటగాళ్లంతా నితీశ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వస్తున్న సమయంలో గౌరవ సూచకంగా బౌండరీ లైన్ వద్దకు వెళ్లి చప్పట్లతో అభినందించారు. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్‌లాంటి దిగ్గజాలు కూడా నితీశ్ ఆటను కొనియాడుతూ లేచి నిలుచోవడం విశేషం. మాజీ కోచ్ రవిశాస్ర్తికి కన్నీరు ఆగలేదు.
1
ఆసీస్ గడ్డపై ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు (105 బ్యాటింగ్) సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో కుంబ్లే (87) పేరిట ఈ ఫీట్ ఉండేది.
1
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 8,9 స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు (నితీశ్, సుందర్) 150+ బంతులు ఎదుర్కోవడం ఇదే తొలిసారి.
2
ఆసీ్‌సలో 8 అంతకంటే దిగువ స్థానాల్లో అత్యధిక భాగస్వామ్యం (127) అందించిన రెండో భారత జోడీగా నితీశ్-సుందర్. టాప్‌లో సచిన్-హర్భజన్ (129) ఉన్నారు.
3
ఆసీ్‌సలో భారత్ నుంచి సెంచరీ సాధించిన మూడో అతిపిన్న వయస్కుడి (21 ఏళ్ల 216 రోజులు)గా నితీశ్. సచిన్ (18), పంత్ (21 ఏళ్ల 92) ముందున్నారు.
4
ఆస్ర్టేలియా గడ్డపై శతకాలు సాధించిన తెలుగు ఆటగాళ్లలో నితీశ్ నాలుగోవాడు. అంతకు ముందు హైదరాబాదీ ఆటగాళ్లు ఎంఎల్ జైసింహ (1968), అజరుద్దీన్ (1992), వీవీఎస్ లక్ష్మణ్ (2000-08 మధ్య 4 శతకాలు) సెంచరీలు సాధించారు.
నాన్నకు అంకింతం
తన తొలి టెస్టు శతకాన్ని తండ్రి ముత్యాలరెడ్డికి అంకితం ఇస్తున్నట్టు నితీశ్ ప్రకటించాడు. తాను సెంచరీ పూర్తి చేయడాన్ని చూసి ఉద్వేగంతో ఏడ్చేస్తున్న తండ్రి ఫొటోను పోస్ట్ చేసిన నితీశ్.. ‘ఇది మీకోసమే నాన్న’ అని ఆ ఫొటో కింద రాశాడు. ‘నాకోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు. నేను ఈస్థితికి చేరడం వెనుక ఆయన త్యాగం ఎంతో ఉంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఒకానొక సందర్భంలో ఆయన ఏడవడాన్ని చూశా. నా తొలి జెర్సీని ఆయనకు ఇచ్చినప్పుడు నాన్న మొహంలో సంతోష్నాన్ని నేను మాటల్లో వర్ణించలేను’ అని నితీశ్ అన్నాడు.
కలకాలం గుర్తుండే ఇన్నింగ్స్
ఈ ఇన్నింగ్స్ నితీశ్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలి టెస్టు నుంచే అతడి బ్యాటింగ్ నన్ను ఆకట్టుకుంది. సిరీ్‌సలో ఈరోజు అతి కీలక ఇన్నింగ్స్ ఆడడం ద్వారా నితీశ్ కెరీర్‌లో మరోమెట్టు పైకెక్కాడు. అతడికి సుందర్ చక్కగా సహకరించాడు.
సచిన్
అనేక సెంచరీలకు నాంది
నేను కచ్చితంగా చెప్పగలను.. ఈ శతకం నువ్వు సాధించబోయే అనేక సెంచరీలకు నాంది. భయం లేకుండా నువ్వు ఆడిన స్ట్రోక్ ప్లేను, నీ సానుకూల దృక్పథాన్ని ఎంతో ఆస్వాదించా. ఇకముందూ ఇలాగే ఆడాలి. దేవుడి ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి.
వీవీఎస్ లక్ష్మణ్
నితీశ్‌కు ఏసీఏ నజరానా రూ.25 లక్షలు
హైదరాబాద్: నితీశ్ కుమార్‌కు ఆంధ్ర క్రికెట్ సంఘం రూ. 25 లక్షల నజరానా ప్రకటించింది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు అతడికి అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి నితీశ్ వచ్చాక సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ నగదు బహుమతిని అందించనున్నామని ఏసీఏ తెలిపింది.