Share News

కుర్రాళ్లోయ్‌.. కుర్రాళ్లు

ABN , Publish Date - Feb 20 , 2024 | 02:23 AM

‘వారు నేటితరం కుర్రాళ్లు’.. యశస్వీ జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌లనుద్దేశించి కెప్టెన్‌ రోహిత్‌ చేసిన వ్యాఖ్యలివి. ఈ మేరకు అతడు ఇన్‌స్టా స్టోరీలో వీరి ఫొటోలు పోస్ట్‌ చేశాడు. వాస్తవానికి భారత క్రికెట్‌లో...

కుర్రాళ్లోయ్‌.. కుర్రాళ్లు

‘వారు నేటితరం కుర్రాళ్లు’.. యశస్వీ జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌లనుద్దేశించి కెప్టెన్‌ రోహిత్‌ చేసిన వ్యాఖ్యలివి. ఈ మేరకు అతడు ఇన్‌స్టా స్టోరీలో వీరి ఫొటోలు పోస్ట్‌ చేశాడు. వాస్తవానికి భారత క్రికెట్‌లో ఇప్పుడు యువ ఆటగాళ్ల హవా నడుస్తోంది. అదీ సంప్రదాయక టెస్టు ఫార్మాట్‌లో కావడం మరో విశేషం.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులోనే కాదు.. వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులోనూ కుర్రాళ్ల విజృంభణను అంతా గమనించే ఉంటారు. అందుకే భారత టెస్టు క్రికెట్‌ భవిష్యత్‌ యువ ఆటగాళ్ల చేతుల్లో పదిలంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అటు కెప్టెన్‌ రోహిత్‌ కూడా మూడో టెస్టులో 434 పరుగుల రికార్డు విజయాన్ని యువ ఆటగాళ్ల ఖాతాలోనే వేశాడు. అలాగే ఈ సిరీ్‌సలో జట్టు రిజర్వ్‌ బెంచ్‌ ఎంత బలంగా ఉందో కూడా ప్రపంచ క్రికెట్‌కు తెలిసివచ్చింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ లేకపోయినా ఇబ్బందేమీ లేకుండా ఈ సిరీ్‌సలో జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ కదం తొక్కుతోంది. 22 ఏళ్ల జైస్వాల్‌ విశ్వరూపాన్ని గమనిస్తున్న క్రికెట్‌ దిగ్గజాలు వేనోళ్ల పొగుడుతున్నారు. వినోద్‌ కాంబ్లీ, డాన్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత రెండు డబుల్‌ సెంచరీలు బాదేసిన పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఆడింది ఏడు టెస్టులే అయినా అతడి పరిణతి చెందిన బ్యాటింగ్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌గా మారింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలో అతనాడిన ఆడిన ఆటకు.. కుదురుకున్నాక బ్యాట్‌ ఝుళిపించిన తీరుకు అసలు సంబంధమే లేదు. పరిస్థితిని అంచనా వేసుకుంటూ జట్టుకు విలువైన ఇన్నింగ్స్‌ను అందించే ప్రయత్నంలో జైస్వాల్‌ ఆడిన తీరది. దిగ్గజ పేసర్‌ అండర్సన్‌ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లతో రాబోయే పరుగుల తుఫాన్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. సెంచరీ అయ్యాక వెన్ను నొప్పితో మైదానం వీడి.. మరుసటి రోజు వచ్చి మరో సెంచరీ బాదిన అతడి నిలకడైన ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు బాదిన అతడి పవర్‌ హిట్టింగ్‌ సైతం ప్రత్యర్థి జట్లను వణికించేదే. అందుకే ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డకెట్‌ అతడిని భవిష్యత్‌ సూపర్‌స్టార్‌గా ప్రకటించేశాడు. అతి పేద కుటుంబం నుంచి వచ్చి నేడు భారత క్రికెట్‌కు ఆశాకిరణంగా చెప్పుకొనే స్థాయికి ఎదిగిన యశస్వీ దేశంలోని ఎందరో వర్థమాన ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తున్నాడు. అంతేకాదు.. ‘కష్టపడనిదే ఏదీ దరిచేరదు. నా చిన్నప్పుటి ప్రయాణంలో బస్సు రైలు లేదా ఆటో రిక్షాలు అందుకునేందుకు చాలా కష్టాలు పడాల్సివచ్చేది. నేను ఆ స్థాయినుంచి కష్టాలు పడుతూ వచ్చినవాణ్ణి. అందుకే ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ అలాగే ఉంటా. క్రీజులో ఉన్న ప్రతిసారీ వంద శాతం నా శక్తిని వినియోగిస్తా’ అని యశస్వీ చెబుతున్నాడు.

మరో ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ సైతం జట్టులో సుస్థిరంగా ఉండేందుకే వచ్చానని చాటుకున్నాడు. రాజ్‌కోట్‌ టెస్టులో అతడికి తుది జట్టులో చోటు దక్కగానే క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో సంతోషించారు. అతడి దేశవాళీ క్రికెట్‌ ప్రతిభ అలాంటిది మరి. జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా 2022 రంజీ సీజన్‌లో 928 పరుగులు బాదాడంటే ఈ యువ ఆటగాడి ఆకలి ఎలా ఉందో తెలుస్తుంది. ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 45 మ్యాచ్‌ల్లో 14 శతకాలతో 3912 రన్స్‌ సాధించాడు. రాహుల్‌ గాయం రూపంలో అతడికి అదృష్టం తలుపు తట్టింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగి రెండు ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీలతో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. అయితే ఇంగ్లండ్‌ స్పిన్నర్లు హార్ట్‌లీ, రెహాన్‌, రూట్‌లను అలవోకగా ఎదుర్కోవడం వెనుక అతడి అలుపెరుగని కష్టం కూడా ఉంది. తండ్రి, కోచ్‌ నౌషద్‌ ఖాన్‌ అతడికి ఆఫ్‌, లెగ్‌, లెఫ్టామ్‌ స్పిన్నర్ల తో రోజుకు 500 బంతులు వేయించి ప్రాక్టీస్‌ చేయించేవాడు. కరోనా సమయంలోనూ ప్రాక్టీస్‌ కోసం ముంబై నుంచి వివిధ నగరాలకు 1600 కి.మీలపాటు కారులో ప్రయాణించేవాడట. అలాగే కాన్పూర్‌ అకాడమీలో స్పిన్నర్‌ కుల్దీప్‌ బంతులను అదేపనిగా ఎదుర్కొని రాటుదేలాడు. మ్యాచ్‌లు లేనప్పుడు సర్ఫరాజ్‌ కోసం నౌషద్‌ ఇంట్లోనే ఆస్ట్రో టర్ఫ్‌ వికెట్‌ను ఏర్పాటు చేసి ఆడించేవాడు. ఇంతటి కఠోర సాధన కారణంగానే ఆడుతోంది ఇంగ్లండ్‌లాంటి జట్టుపై అయినా ఈ కుర్రాడు అదురూ బెదురు లేకుండా బ్యాటింగ్‌ చేశాడు. ఏదిఏమైనా ప్రస్తుత తరుణంలో సీనియర్లను కాదని కొత్త ఆటగాళ్లకే టీమిండియా సెలెక్టర్లు పెద్దపీట వేస్తున్నారు కాబట్టి.. యంగ్‌ గన్స్‌ కూడా తమ ప్రతిభ నిరూపించుకుంటే వారి స్థానాలకు ఢోకా లేనట్టే..

Updated Date - Feb 20 , 2024 | 02:23 AM