Share News

కోల్‌కతా అలవోకగా..

ABN , Publish Date - Apr 15 , 2024 | 01:28 AM

ఫిల్‌ సాల్ట్‌ (47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89 నాటౌట్‌) దూకుడైన అర్ధ శతకంతోపాటు పేసర్‌ స్టార్క్‌ (3/28) చెలరేగడంతో.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది...

కోల్‌కతా అలవోకగా..

8 వికెట్లతో లఖ్‌నవూపై గెలుపు

మెరిసిన సాల్ట్‌, స్టార్క్‌

పూరన్‌ పోరాటం వృథా

కోల్‌కతా: ఫిల్‌ సాల్ట్‌ (47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 89 నాటౌట్‌) దూకుడైన అర్ధ శతకంతోపాటు పేసర్‌ స్టార్క్‌ (3/28) చెలరేగడంతో.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎ్‌సజీ)పై అలవోక విజయం సాధించింది. తొలుత లఖ్‌నవూ 20 ఓవర్లలో 161/7 స్కోరు చేసింది. పూరన్‌ (45), రాహుల్‌ (39), ఆయుష్‌ బదోని (29) ఫర్వాలేదనిపించారు. నరైన్‌ (1/17) ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. అనంతరం కోల్‌కతా 15.4 ఓవర్లలో 162/2 స్కోరు చేసి నెగ్గింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ నరైన్‌ (6), రఘువంశీ (7)లను మొహిసిన్‌ అవుట్‌ చేసి కోల్‌కతాకు షాకిచ్చాడు. కానీ, మరో ఓపెనర్‌ సాల్ట్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ (38 నాటౌట్‌) మూడో వికెట్‌కు 76 బంతుల్లో 120 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో కోల్‌కతా 26 బంతులు మిగిలుండగానే గెలిచింది. లఖ్‌నవూ తరఫున అరంగేట్రం చేసిన జోసెఫ్‌ తొలి ఓవర్‌ బౌల్‌ చేసి రెండు వైడ్లు, రెండు నోబాల్స్‌తో ఏకంగా 22 పరుగులిచ్చాడు. కాగా, ఐపీఎల్‌లో లఖ్‌నవూపై కోల్‌కతాకు ఇదే మొదటి విజయం. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా సాల్ట్‌ నిలిచాడు.

పూరన్‌ ఒక్కడే..: మిస్టరీ స్పిన్నర్‌ నరైన్‌, వరుణ్‌ పరుగులను కట్టడి చేయగా.. ఆఖరి ఓవర్‌లో స్టార్క్‌ రెండు వికెట్లతో సత్తా చాటడంతో లఖ్‌నవూ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఒక దశలో ఎల్‌ఎ్‌సజీ 111/5తో పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో పూరన్‌ ఎదురుదాడితో టీమ్‌ స్కోరు 160 పరుగుల మార్క్‌ను దాటింది. క్రునాల్‌ (7 నాటౌట్‌)తో కలసి ఆరో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పూరన్‌ను ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో స్టార్క్‌ పెవిలియన్‌ చేర్చాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఓపెనర్‌ డికాక్‌ (10), హుడా (8)లను స్వల్ప స్కోర్లకే కోల్పోయింది. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి సూపర్‌ జెయింట్స్‌ 49/2తో నిలిచింది. ఈ దశలో రాహుల్‌, బదోని ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినా.. నరైన్‌, రాణా భారీ షాట్లు ఆడకుండా అడ్డుకొన్నారు. రాహుల్‌ను రస్సెల్‌ పెవిలియన్‌ చేర్చగా.. స్టొయినిస్‌ (10)ను వరుణ్‌ బోల్తా కొట్టించాడు. బదోనిని 15వ ఓవర్‌లో నరైన్‌ క్యాచవుట్‌ చేశాడు. అయితే, డెత్‌ ఓవర్లలో పూరన్‌ దూకుడైన ఆటతో లఖ్‌నవూ 48 పరుగులు రాబట్టగలిగింది.

స్కోరుబోర్డు

లఖ్‌నవూ: డికాక్‌ (సి) నరైన్‌ (బి) వైభవ్‌ 10, రాహుల్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) రస్సెల్‌ 39, దీపక్‌ హుడా (సి) రమణ్‌దీప్‌ (బి) స్టార్క్‌ 8, బదోని (సి) రఘువంశీ (బి) నరైన్‌ 29, స్టొయినిస్‌ (సి) సాల్ట్‌ (బి) వరుణ్‌ 10, పూరన్‌ (సి) సాల్ట్‌ (బి) స్టార్క్‌ 45, క్రునాల్‌ (నాటౌట్‌) 7, అర్షద్‌ (బి) స్టార్క్‌ 5; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 161/7; వికెట్ల పతనం: 1-19, 2-39, 3-78, 4-95, 5-111, 6-155, 7-161; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-28-3, వైభవ్‌ 3-0-34-1, హర్షిత్‌ రాణా 4-0-35-0, నరైన్‌ 4-0-17-1, వరుణ్‌ చక్రవర్తి 4-0-30-1, రస్సెల్‌ 1-0-16-1.

కోల్‌కతా: సాల్ట్‌ (నాటౌట్‌) 89, నరైన్‌ (సి) స్టొయినిస్‌ (బి) మొహిసిన్‌ 6, రఘువంశీ (సి) రాహుల్‌ (బి) మొహిసిన్‌ 7, శ్రేయాస్‌ (నాటౌట్‌) 38; ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 15.4 ఓవర్లలో 162/2; వికెట్ల పతనం: 1-22, 2-42; బౌలింగ్‌: జోసెఫ్‌ 4-0-47-0, మొహిసిన్‌ 4-0-29-2, క్రునాల్‌ 1-0-14-0, యశ్‌ ఠాకూర్‌ 2-0-25-0, అర్షద్‌ 2-0-24-0, బిష్ణోయ్‌ 2.4-0-17-0.

Updated Date - Apr 15 , 2024 | 01:28 AM