Share News

కిక్కిచ్చే ఫైట్‌

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:44 AM

నేడే భారత్‌ X పాక్‌ మ్యాచ్‌ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానేవచ్చింది. టీ20 వరల్డ్‌క్‌పలో అసలైన కిక్కిచ్చే ఫైట్‌కు రంగం సిద్ధమైంది...

కిక్కిచ్చే ఫైట్‌

ప్రపంచకప్‌లో నేటి మ్యాచ్‌లు

వెస్టిండీస్‌ X ఉగాండా (ఉ.6. గం.)

భారత్‌ X పాకిస్థాన్‌ (రాత్రి.8. గం.)

ఒమన్‌ X స్కాట్లాండ్‌ (రాత్రి 10.30 గం.)

నేడే భారత్‌ X పాక్‌ మ్యాచ్‌ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానేవచ్చింది. టీ20 వరల్డ్‌క్‌పలో అసలైన కిక్కిచ్చే ఫైట్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు జరిగినా బోసిపోయి కనిపించిన నసౌ స్టేడియం ఇక ఇరు జట్ల ఫ్యాన్స్‌తో కిటకిటలాడనుంది. రీసేల్‌ మార్కెట్‌లో ఒక్క టిక్కెట్‌ ధరే కోటీ 50 లక్షలు పలుకుతుందంటేనే ఈ పోరుకున్న డిమాండ్‌ ఏంటో అర్థమవుతోంది. ఇదంతా..

భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ గురించే. ఈ మెగా టోర్నీ ముఖాముఖి పోరులో 6-1 ఆధిక్యంతో తిరుగులేని రికార్డున్న టీమిండియాను.. పసికూన యూఎస్‌ చేతిలో ఓడిన పాక్‌ ఏమేరకు ఎదుర్కోగలదో చూడాల్సిందే!


న్యూయార్క్‌: టీ20 ప్రపంచక్‌పలో అత్యంత ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రెండేళ్ల తర్వాత తొలిసారిగా టీమిండియా ఆదివారం పాకిస్థాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయంతో రోహిత్‌ సేన ఆత్మవిశ్వాసంతో ఉండగా.. పాకిస్థాన్‌ పసికూన యూఎ్‌సఏ చేతిలో ఓడి డీలా పడింది. దీంతో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్‌ బృందానికి భారత్‌పై గెలుపు చాలా కీలకం. ఇక ఇక్కడి డ్రాప్‌ ఇన్‌ పిచ్‌పై అనూ హ్య బౌన్స్‌ బ్యాటర్లను బెంబేలెత్తిస్తోంది. చివరిసారి ఇరుజట్లు 2022 టీ20 వరల్డ్‌క్‌పలో తలపడగా ఆఖరి బంతికి భారత్‌ గెలిచింది. ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు అధ్యక్షస్థాయి భద్రతను ఏర్పాటు చేశారు.

మెరుగైన రికార్డుతో..: కొత్త బంతిని ఎదుర్కొనేందుకు ఈసారి కూడా ఓపెనర్లుగా రోహిత్‌, విరాట్‌ రానున్నారు. ఐర్లాండ్‌తో కోహ్లీ అనవసర షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. కానీ పాక్‌పై మెరుగైన రికార్డున్న విరాట్‌పై ఈసారీ భారీగా అంచనాలు న్నాయి. బంతి పాతగా మారే వరకు ఓపిగ్గా ఎదురుచూస్తేనే ఈ పిచ్‌పై పరుగులు వస్తాయి. వన్‌డౌన్‌లో పంత్‌ ఫామ్‌ జట్టుకు సానుకూలాంశం. పాక్‌ స్పిన్నర్లపై ఎదురుదాడికి శివమ్‌ దూబే సిద్ధంగా ఉన్నాడు. ఐర్లాండ్‌తో ఆడిన మాదిరే భారత్‌ నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది.


తీవ్ర ఒత్తిడిలో..: ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై ఓడడాన్ని అలవాటుగా మార్చుకున్న పాక్‌.. ఈ మ్యాచ్‌ను మరింత ఒత్తిడి మధ్య ఆడనుంది. పాక్‌కు బౌలింగే ప్రధాన బలంగా ఉన్నప్పటికీ యూఎస్‌ బ్యాటర్లు వీరిని దీటుగా ఎదుర్కొని సూపర్‌ ఓవర్‌లో గెలిచారు. ఈ ఓటమితో ఆగ్రహంగా ఉన్న అభిమానులను తిరిగి సంతోషంలో ముంచెత్తాలంటే భారత్‌పై విజయం పాక్‌కు అవసరం. పేసర్లు షహీన్‌, నసీమ్‌, ఆమిర్‌, రౌఫ్‌ తమ పేస్‌ పదునుతో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనుకుంటు న్నారు. బ్యాటింగ్‌లో రిజ్వాన్‌, ఉస్మాన్‌ విఫలమవుతున్నారు. బాబర్‌ వేగంగా ఆడాల్సి ఉంది. స్పిన్నర్‌ షాదాబ్‌ స్థానంలో సయీమ్‌ అయూబ్‌ను తీసుకునే చాన్సుంది.


తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, పంత్‌, సూర్యకుమార్‌, శివమ్‌ దూబే, హార్దిక్‌, జడేజా, అక్షర్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, సిరాజ్‌.

పాకిస్థాన్‌: రిజ్వాన్‌, ఉస్మాన్‌, బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), ఫఖర్‌, ఆజమ్‌ ఖాన్‌, ఇఫ్తికార్‌, షాదాబ్‌/సయీమ్‌, షహీన్‌, నసీమ్‌ షా, ఆమిర్‌, రౌఫ్‌.

పిచ్‌, వాతావరణం

నేటి ఉదయం 10 గంటలకు వర్షం కురిసే అవకాశం ఉంది. టాస్‌ ఆలస్యం కావచ్చు. ఇక నసౌ స్టేడియం పిచ్‌ను అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. ఇప్పటి దాకా జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండుసార్లు మాత్రమే 100+ స్కోరు దాటింది. అందుకే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే ఈ ట్రాక్‌పై భారీ స్కోర్లను ఆశించలేం. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

Updated Date - Jun 09 , 2024 | 04:44 AM