Share News

జురెల్‌ ఆటకు ఫిదా

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:53 AM

సరైన వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ కోసం వెతుకుతున్న భారత్‌కు తానే తగిన సమాధానమంటూ ధ్రువ్‌ జురెల్‌ తెరపైకి దూసుకొచ్చాడు. 2022లో జరిగిన యాక్సిడెంట్‌ కారణంగా....

జురెల్‌  ఆటకు ఫిదా

  • అద్భుతమైన ఆటగాడంటున్న మాజీలు

  • ధోనీతో పోల్చిన గవాస్కర్‌

న్యూఢిల్లీ: సరైన వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ కోసం వెతుకుతున్న భారత్‌కు తానే తగిన సమాధానమంటూ ధ్రువ్‌ జురెల్‌ తెరపైకి దూసుకొచ్చాడు. 2022లో జరిగిన యాక్సిడెంట్‌ కారణంగా రిషభ్‌ పంత్‌ దూరం కావడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేసే వికెట్‌ కీపర్‌ కోసం టీమిండియా ఎదురు చూస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో కేఎస్‌ భరత్‌ బ్యాటర్‌గా ఆకట్టుకోలేక పోవడంతో.. మూడో టెస్ట్‌లో జురెల్‌కు చాన్స్‌ దక్కింది. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసిన ధ్రువ్‌.. రాంచీ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో ఆపద్బాంధవుడిగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒడిదొడుకులు ఎదురైనా.. గిల్‌తో కలసి జట్టును గెలిపించాడు. క్లిష్టపరిస్థితుల్లోనూ కంగారుపడకుండా.. స్ట్రయిక్‌ రొటేట్‌ చేసిన తీరుకు మాజీ క్రికెటర్లు ఫిదా అయ్యారు. భారత్‌కు ‘రత్నం’ దొరికిందని కొనియాడారు. మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ అయితే.. ధ్రువ్‌ను మహేంద్ర సింగ్‌ ధోనీతో పోల్చాడు. సెహ్వాగ్‌, లక్ష్మణ్‌తోపాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్‌ మూడీ కూడా ఈ యువ ఆటగాడి పోరాట పటిమను ప్రశంసించాడు.

ఫోక్స్‌ సలాం..!: ప్రత్యర్థి ఆటగాళ్లు మెచ్చుకోవడమంటే సామాన్యం కాదు. అలాంటిది ఇంగ్లండ్‌ కీపర్‌ ఫోక్స్‌ కూడా ధ్రువ్‌ పోరాటపటిమకు అభివందనాలు తెలిపాడు. ‘ఫోక్స్‌కు జురెల్‌పై అభిమానం ఏర్పడింద’ని ఇంగ్లిష్‌ టీమ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ చెప్పాడు. ఒంటరి పోరాటం చేసి 90 పరుగుల వద్ద అవుటైనప్పుడు రూట్‌ కూడా జురెల్‌ను అభినందించాడు.

జడేజా కంటే ముందు పంపాలి : కుక్‌

రెండు మ్యాచ్‌లతోనే ఆకట్టుకొన్న జురెల్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో జడేజా కంటే ముందుగా పంపాలని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ సూచించాడు. ‘జురెల్‌ బ్యాటింగ్‌లో సమతుల్యత ఉంది. పాదాల కదలికల్లో వేగం ఉంది. మరోవైపు జడేజా రిస్క్‌ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నట్టుగా ఉంది. షాట్‌ ఆడే విషయంలో జడేజాతో పోల్చితే ధ్రువ్‌ బెటర్‌’ అని అన్నాడు.

Updated Date - Feb 28 , 2024 | 03:53 AM