టీ20 వరల్డ్‌క్‌పనకు కిషన్, అయ్యర్ కష్టమేనా!
ABN , Publish Date - Mar 01 , 2024 | 05:58 AM
సీనియర్ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు నిరాకరించడం భారత క్రికెట్‌లో సంచలనం రేపింది. ఇటీవలి కాలంలో టీమిండియాలో...
న్యూఢిల్లీ: సీనియర్ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు నిరాకరించడం భారత క్రికెట్‌లో సంచలనం రేపింది. ఇటీవలి కాలంలో టీమిండియాలో తరచూ కనిపించే వీరికి వార్షిక కాంట్రాక్ట్‌లు లభించక పోవడంతో.. జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌క్‌పలో చోటు దక్కడం కష్టంగా మారింది. వ్యక్తిగత కారణాలతో సౌతాఫ్రికా టూర్ మధ్యలోనే కిషన్ వైదొలగగా.. ఇంగ్లండ్‌తో అయ్యర్ రెండు టెస్ట్‌లు ఆడాడు. అయితే, వీరికి కాంట్రాక్ట్‌లు ఎందుకివ్వలేదనే విషయాన్ని బోర్డు ఎక్కడా స్పష్టం చేయలేదు. కానీ, దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తున్న వారికి గట్టి హెచ్చరికలే పంపిందని విశ్లేషకులు చెబుతున్నారు. బోర్డు ప్రకటనలో కూడా ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు.. జాతీయ జట్టుకు దూరమైనప్పుడు ఆయా సమయాల్లో జరుగుతున్న దేశవాళీ లీగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.
శ్రేయాస్ స్వయంకృతమా?
శ్రేయాస్ తన భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకొంటున్నాడన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. రెండో టెస్ట్ తర్వాత వెన్నునొప్పిగా ఉందని తప్పుకొన్నాడు. అయితే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) మెడికల్ టీమ్ మాత్రం అతను మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నట్టు నివేదిక ఇచ్చింది. అయినా కూడా ఎంపికకు అందుబాటులో ఉండేందుకు అయ్యర్ నిరాకరించినట్టు సమాచారం. రంజీలు కూడా ఆడకుండా.. నైట్‌రైడర్స్ నిర్వహించిన ప్రీ సీజన్ క్యాంప్‌లో శ్రేయాస్ పాల్గొనడం సెలెక్టర్లకు ఏమాత్రం రుచించలేదట. ఇషాన్‌ను కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలని కోచ్ ద్రవిడ్ సూచించాడు. అయితే, హార్దిక్ పాండ్యాతో కలసి ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నట్టు సోషల్ మీడియాలో ఫొటోలు వచ్చాయి.
అందరినీ సమంగా చూడాలి
‘బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తా. ప్రతి ఆటగాడూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. ఖాళీగా ఉన్న సమయంలో కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా రాష్ట్రం తరఫున ఆడాలి. అయ్యర్, కిషన్‌లపైనే చర్యలు తీసుకోవడం సబబుకాదు. ఈ విషయంలో అందరికీ ఒకే తరహా నిబంధనలు ఉండాలి.’
కీర్తి ఆజాద్, 1983 వరల్డ్‌కప్ జట్టు సభ్యుడు