Share News

IPL : ఇద్దరికీ ఇదే లాస్ట్‌ చాన్స్‌

ABN , Publish Date - May 24 , 2024 | 03:01 AM

ఐపీఎల్‌ ఫైనల్‌కు ముందు చిట్టచివరి ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అద్భుత హిట్టింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లకు.. తమ సుడులు తిరిగే బంతులు, పదునైన పేస్‌తో...

IPL : ఇద్దరికీ ఇదే లాస్ట్‌ చాన్స్‌

నేడు ఐపీఎల్‌ క్వాలిఫయర్‌ 2

రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌,

జియో సినిమాలో

రాజస్థాన్‌ X సన్‌రైజర్స్‌ మధ్య పోరు

గెలిచిన జట్టు ఫైనల్‌కు

చెన్నై: ఐపీఎల్‌ ఫైనల్‌కు ముందు చిట్టచివరి ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అద్భుత హిట్టింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లకు.. తమ సుడులు తిరిగే బంతులు, పదునైన పేస్‌తో ఉచ్చులో బిగిస్తున్న రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్ల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. గెలిచిన జట్టు కోల్‌కతాతో ఆదివారం ఫైనల్లో పోటీ పడుతుంది. చెపాక్‌ స్టేడియం వేదికగా శుక్రవారం క్వాలిఫయర్‌ 2లో ఇరు జట్లు తలపడబోతున్నాయి. అయితే వరుస విజయాలతో జోరు మీదున్న రైజర్స్‌కు కోల్‌కతాతో క్వాలిఫయర్‌ 1లో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ ఓటమిని మరిపిస్తూ ఈ కీలక పోరులో కచ్చితంగా గెలవాల్సిందే. లేనిపక్షంలో లీగ్‌లో ఇప్పటిదాకా రికార్డులను తిరగరాసిన తమ ఆటతీరుకు ఫలితం దక్కకుండా పోతుంది. ఇక రాజస్థాన్‌ ఆరంభ తొమ్మిది మ్యాచ్‌ల్లోనే 16 పాయింట్లు సాధించినప్పటికీ.. ఆ తర్వాత దాదాపు 25 రోజుల పాటు మరో విజయమే లభించలేదు. కానీ ఎలిమినేటర్‌లో చక్కటి ప్రదర్శనతో బెంగళూరును ఇంటిముఖం పట్టించింది. ఇప్పుడు మరో గెలుపుతో ఫైనల్‌కు అర్హత సాధించి గత ఓటములను మర్చిపోవాలనుకుంటోం ది. ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక లీగ్‌ మ్యాచ్‌లో రైజర్స్‌ ఆఖరి బంతికి పరుగు తేడాతో నెగ్గింది. మరోవైపు చెన్నై వేదికలో ఈ రెండు జట్లకు మెరుగైన రికార్డు లేదు. సీఎ్‌సకేపై రైజర్స్‌ 134, రాజస్థాన్‌ 141 పరుగులే చేసి ఓటమిపాలయ్యాయి.


‘ట్రావిషేక్‌’

శుభారంభమే కీలకం

సన్‌రైజర్స్‌ జోరుకు ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మల మెరుపు ఆటతీరే కారణం. పవర్‌ హిట్టింగ్‌ను ఈ ఇద్దరూ మరో స్థాయికి తీసుకెళ్లారు. హెడ్‌ 199.62 స్ట్రయిక్‌ రేట్‌తో, అభిషేక్‌ 207.40 స్ట్రయిక్‌ రేట్‌తో బెంబేలెత్తిస్తూ పవర్‌ప్లేలోనే రెండుసార్లు వంద పరుగులను దాటించారు. జట్టు బాదిన 166 సిక్సర్లలో వీరిద్దరివే 72 ఉండడం విశేషం. వీరి మెరుపు ఆరంభాలు మిడిలార్డర్‌పై ఒత్తిడి పడకుండా కాపాడుతున్నాయి. కానీ చివరి మ్యాచ్‌లో కోల్‌కతాపై ఇద్దరూ విఫలం కావడంతో జట్టు చిత్తుగా ఓడాల్సి వచ్చింది. అందుకే బ్యాటింగ్‌ను మరింత పటిష్టపర్చేందుకు మార్‌క్రమ్‌, ఫిలి్‌ప్సలలో ఒకరిని తీసుకోవాల్సి ఉంటుంది. మిడిలార్డర్‌లో త్రిపాఠి, క్లాసెన్‌ వేగంగా ఆడుతున్నారు. నితీ శ్‌ కుమార్‌ రాజస్థాన్‌పై 42 బంతుల్లోనే 76 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ చూపాల్సి ఉంది. కెప్టెన్‌ కమిన్స్‌ ఫినిషర్‌ పాత్ర పోషిస్తున్నాడు. బౌలింగ్‌లో పేసర్లు కమిన్స్‌, భువనేశ్వర్‌, నటరాజన్‌ కీలకం కానున్నారు. స్పిన్నర్‌గా మార్కండేను ఆడించే అవకాశం ఉంది.


బౌలింగే బలంగా..

సన్‌రైజర్స్‌తో పోలిస్తే రాజస్థాన్‌ బ్యాటర్లు విధ్వంసకరంగా కనిపించకపోయినా.. వీరి విజయాల్లో బౌలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆరంభంలో లెఫ్టామ్‌ పేసర్‌ బౌల్ట్‌ వికెట్లను తీస్తుండగా.. వరల్డ్‌క్లాస్‌ స్పిన్నర్లు చాహల్‌, అశ్విన్‌లతో మధ్య ఓవర్లలో ప్రత్యర్థి జట్లను నిలువరిస్తున్నారు. ఇక డెత్‌ ఓవర్లలో అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ పరుగులను కట్టడి చేయగలుగుతుండడం ఆర్‌ఆర్‌కు కలిసివచ్చే విషయం. బ్యాటింగ్‌లో జైస్వాల్‌, కెప్టెన్‌ శాంసన్‌లపై భారం పడుతోంది. అయితే ఉప్పల్‌లో రైజర్స్‌పై 202 పరుగుల ఛేదనలో ఆఖరి బంతికి రెండు పరుగులు చేయలేక ఓడింది. గెలుపు ముంగిట బోల్తా పడిన ఆ మ్యాచ్‌కు బదులు తీర్చుకోవాలనుకుంటోంది. చెపాక్‌ స్లో పిచ్‌పై మూడో స్పిన్నర్‌గా కేశవ్‌ మహరాజ్‌ను కూడా బరిలోకి దిగే అవకాశముంది. అయితే అప్పుడు ఇద్దరు పేసర్లతోనే ఆడాల్సి ఉంటుంది.


పిచ్‌, వాతావరణం

శుక్రవారం వర్షం నుంచి ఎలాంటి అంతరాయం లేదు. వేడితో పాటు తేమ ఎక్కువగా ఉండనుంది. రాత్రి మంచు ప్రభావం ఉంటుంది. దీంతో టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపుతుంది. ఈ సీజన్‌లో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదుసార్లు చేజింగ్‌ టీమ్‌ గెలిచింది.

తుది జట్లు (అంచనా)

రాజస్థాన్‌ రాయల్స్‌: జైస్వాల్‌, క్యాడ్‌మోర్‌, శాంసన్‌, పరాగ్‌, జురెల్‌, పోవెల్‌/కేశవ్‌ మహరాజ్‌, అశ్విన్‌, బౌల్ట్‌, అవేశ్‌, ఖాన్‌, సందీప్‌, చాహల్‌.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: హెడ్‌, అభిషేక్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ కుమార్‌, క్లాసెన్‌, సమద్‌, షాబాజ్‌ అహ్మద్‌, కమిన్స్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌, నటరాజన్‌, మార్కండే.

వర్షంతో రద్దయితే..

రానున్న రోజుల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే మ్యాచ్‌ రోజు శుక్రవారం మాత్రం ఆకాశం మేఘావృతంగా కనిపించినా వాన కురిసే చాన్స్‌ 2 శాతం మాత్రమే ఉంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్‌ వీలు కాకపోతే రిజర్వ్‌డే ఉంటుంది. ఒకవేళ శనివారం కూడా మ్యాచ్‌ రద్దయితే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్‌ జట్టు ఫైనల్‌కు వెళుతుంది.

Updated Date - May 24 , 2024 | 03:01 AM