Share News

IPL SRH VS KKR : క్లాసెన్‌ పోరాడినా..

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:01 AM

కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. భారీ లక్ష్య ఛేదనలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (29 బంతుల్లో 8 సిక్సర్లతో 63) ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించినా ఫలితం లేకపోయింది. దీంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా

IPL SRH VS KKR : క్లాసెన్‌ పోరాడినా..

రస్సెల్‌ ఆల్‌రౌండ్‌షో

సన్‌రైజర్స్‌కు తప్పని ఓటమి

ఆఖరి బంతికి కోల్‌కతా విజయం

పరుగుల వరద పారిన ఈడెన్‌లో అదిరిపోయే మ్యాచ్‌..

4 ఓవర్లలో 76 పరుగులు కావాల్సి వేళ హెన్రిచ్‌ క్లాసెన్‌ అసమాన ఆటతీరును ప్రదర్శించాడు. బంతి పడితే సిక్సర్‌ అనే రీతిలో విధ్వంసం సాగించాడు. ఇక సన్‌రైజర్స్‌ గెలుపు ఖాయమే అనుకున్న వేళ ఆఖరి ఓవర్‌లో పేసర్‌ హర్షిత్‌ మాయ చేశాడు. దీంతో చివరి బంతికి గెలిచిన కేకేఆర్‌ ఊపిరిపీల్చుకుంది. అయితే లీగ్‌లో అత్యంత విలువైన ఆటగాడు స్టార్క్‌ అసలే మాత్రం ప్రభావం చూపలేదు.. ఐపీఎల్‌లో ఆండ్రీ రస్సెల్‌ సిక్సర్ల సంఖ్య. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఎక్కువ సిక్సర్లు బాదిన తొమ్మిదో బ్యాటర్‌.

కోల్‌కతా: కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. భారీ లక్ష్య ఛేదనలో హెన్రిచ్‌ క్లాసెన్‌ (29 బంతుల్లో 8 సిక్సర్లతో 63) ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించినా ఫలితం లేకపోయింది. దీంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 4 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 రన్స్‌ చేసింది. ఆండ్రీ రస్సెల్‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 64 నాటౌట్‌), సాల్ట్‌ (54) మెరుపు ఆటను ప్రదర్శించారు. నటరాజన్‌కు మూడు, మార్కండేకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసి ఓడింది. మయాంక్‌ (32), అభిషేక్‌ (32) రాణించారు. హర్షిత్‌కు మూడు, ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రస్సెల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఛేదన బాగానే ఉన్నా..: భారీ ఛేదనను సన్‌రైజర్స్‌ ఆత్మవిశ్వాసంతో ఆరంభించింది. ఓపెనర్లు మయాంక్‌, అభిషేక్‌ పోటాపోటీ చెలరేగారు. నాలుగో ఓవర్‌లో మయాంక్‌ 6,4 బాదగా ఐదో ఓవర్‌లో అభిషేక్‌ 4,6,6తో మరింత జోరు చూపాడు. ఆరో ఓవర్‌లో మయాంక్‌ వెనుదిరిగినా పవర్‌ప్లేలో జట్టు 65 పరుగులతో నిలిచింది. అటు అభిషేక్‌ను రస్సెల్‌ అవుట్‌ చేసినా త్రిపాఠి (20), మార్‌క్రమ్‌ (18) ఓవర్‌కు పది రన్‌రేట్‌ తగ్గకుండా చూడగా పది ఓవర్లలో జట్టు 99రన్స్‌ సాధించింది. కానీ ఇద్దరూ వరుస ఓవర్లలో వెనుదిరగడం దెబ్బతీసింది. సమద్‌ (15) దూకుడు కాసేపే అయింది.

వామ్మో.. క్లాసెన్‌: చివరి నాలుగు ఓవర్లలో క్లాసెన్‌ అంచనాలకు మించి ఆడాడు. సిక్సర్లు బాదడమే లక్ష్యంగా ఆడేస్తూ కేకేఆర్‌కు వణుకు పుట్టించాడు. 18వ ఓవర్‌లో తను రెండు సిక్సర్లు, షాబాజ్‌ ఓ సిక్సర్‌తో 21 రన్స్‌ సమకూరాయి. దీంతో సమీకరణం 12 బంతులు 39 రన్స్‌కు చేరింది. అయితే స్టార్క్‌ వేసిన 19వ ఓవర్‌లో క్లాసెన్‌ మూడు సిక్సర్లు, షాబాజ్‌ సిక్సర్‌ బాదడంతో 26 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో 13 పరుగులే కావాల్సి ఉండడంతో కేకేఆర్‌కు ఓటమి తప్పదనిపించింది. తొలి బంతినే క్లాసెన్‌ సిక్సర్‌గా మలిచినా పేసర్‌ హర్షిత్‌ ఒత్తిడికి లోను కాలేదు. ముందు షాబాజ్‌, ఆ తర్వాత క్లాసెన్‌ వికెట్లు తీయడంతో కేకేఆర్‌ ఆశలు పెరిగాయి. ఆఖరి బంతికి ఐదు రన్స్‌ అవసరమైనా కమిన్స్‌ (0 నాటౌట్‌) కనీసం టచ్‌ కూడా చేయలేకపోయాడు.

సాల్ట్‌ మెరుపు ఆరంభం: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఓవైపు ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ బాదుడు సాగుతుంటే.. మరోవైపు టపటపా వికెట్లు కోల్పోయింది. 51/4 స్కోరుతో కష్టాల్లో పడినా, జట్టు 200 దాటిందంటే రస్సెల్‌ విజృంభణే కారణం. ఇక నాలుగో ఓవర్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ (7), కెప్టెన్‌ శ్రేయాస్‌ (0)ల వికెట్లు తీసి పేసర్‌ నటరాజన్‌ షాక్‌ ఇచ్చాడు. రాణా (9)రివర్స్‌ హిట్‌కు వెళ్లి మార్కండే గూగ్లీకి బలయ్యాడు.

ఏమా బాదుడు..: గత సీజన్‌లో దారుణంగా విఫలమైన రస్సెల్‌ ఈసారి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 16వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, 17వ ఓవర్‌లో 6,4 బాదడంతో స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. భువీ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో రస్సెల్‌ 6,6,4తో 26 రన్స్‌ రాబట్టడంతో స్కోరు 200కి చేరింది. 20 బంతుల్లోనే రస్సెల్‌ ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. మరోవైపు చివరి 30 బంతుల్లో కేకేఆర్‌ 85 పరుగులు సాధించడం విశేషం.

స్కోరుబోర్డు

కోల్‌కతా: సాల్ట్‌ (సి) యాన్సెన్‌ (బి) మార్కండే 54, నరైన్‌ (రనౌట్‌/షాబాజ్‌) 2, వెంకటేశ్‌ (సి) యాన్సెన్‌ (బి) నటరాజన్‌ 7, శ్రేయాస్‌ (సి) కమిన్స్‌ (బి) నటరాజన్‌ 0, నితీశ్‌ (సి) త్రిపాఠి (బి) మార్కండే 9, రమణ్‌దీప్‌ (సి) మార్కండే (బి) కమిన్స్‌ 35, రింకూ (బి) మార్‌క్రమ్‌ (బి) నటరాజన్‌ 23, రస్సెల్‌ (నాటౌట్‌) 64, స్టార్క్‌ (నాటౌట్‌) 6, ఎక్స్‌ట్రాలు 8, (మొత్తం 20 ఓవర్లలో) 208/7 : వికెట్లపతనం: 1-23, 2-32, 3-32, 4-51, 5-105, 6-119, 7-200 బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-51-0, యాన్సెన్‌ 3-0-40-0, నటరాజన్‌ 4-0-32-3, కమిన్స్‌ 4-0- 32-1, మార్కండే 4-0-39-2, షాబాజ్‌ 1-0-14-0

హైదరాబాద్‌: మయాంక్‌ (సి) రింకూ (బి) హర్షిత్‌ 32, అభిషేక్‌ (సి) వరుణ్‌ (బి) రస్సెల్‌ 32, త్రిపాఠి (సి) హర్షిత్‌ (బి) సునీల్‌ 20, మార్‌క్రమ్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 18, క్లాసెన్‌ (సి) సుయాష్‌ (బి) హర్షిత్‌ 63, సమద్‌ (సి) వెంకటేశ్‌ (బి) రస్సెల్‌ 15, షాబాజ్‌ (సి) శ్రేయాస్‌ (బి) హర్షిత్‌ 16, యాన్సెన్‌ (నాటౌట్‌) 1, కమిన్స్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 7, (మొత్తం 20 ఓవర్లలో) 204/7 : వికెట్లపతనం : 1-60, 2-71, 3-107, 4-111, 5-145, 6-203, 7-204 : బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-53-0, హర్షిత్‌ రాణా 4-0-33-3,వరుణ్‌ 4-0-55-1, సునీల్‌ 4-0-19-1, రస్సెల్‌ 2-0-25-2, సుయాష్‌ 2-0-18-0.

Updated Date - Mar 24 , 2024 | 03:01 AM