Share News

IPL 2024 : పదిహేడు పట్టేదెవరు?

ABN , Publish Date - May 26 , 2024 | 04:49 AM

విధ్వంసకర ఆటతీరుతో మెరుపు ఇన్నింగ్స్‌లు.. ఔరా అనిపించిన రికార్డు స్కోర్లు.. కళ్లు చెదరగొట్టేలా ఫీల్డింగ్‌ విన్యాసాలతో పాటు బౌలర్ల మాయాజాలానికి నేటితో తెర పడనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-17వ సీజన్‌లో చిట్టచివరి మ్యాచ్‌కు...

IPL 2024 : పదిహేడు పట్టేదెవరు?

కోల్‌కతాతో సన్‌రైజర్స్‌ అమీతుమీ

రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌,

జియో సినిమాలో..

రెండు నెలల క్రితం తాజా సీజన్‌ ఆరంభమైనప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టైటిల్‌ పోరులో నిలుస్తాయని ఎవరూ ఊహించి ఉండరేమో? గతేడాది ఏడు, పది స్థానాల్లో నిలిచిన ఈ జట్లు.. కొత్త కోచ్‌, కొత్త కెప్టెన్‌ల ఆధ్వర్యంలో ఈసారి అద్వితీయ ప్రదర్శనతో వహ్వా అనిపించాయి. రికార్డు స్కోర్లతో రైజర్స్‌ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తే.. సమష్టి ఆటతీరుతో కోల్‌కతా ‘టాప్‌’ లేపింది. తద్వారా పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ సమవుజ్జీల మధ్యే అంతిమ సమరం కూడా జరుగబోతోంది. ఇక కప్పు కొట్టి హీరోలుగా నిలిచేదెవరో తేలడమే తరువాయి!


చెన్నై: విధ్వంసకర ఆటతీరుతో మెరుపు ఇన్నింగ్స్‌లు.. ఔరా అనిపించిన రికార్డు స్కోర్లు.. కళ్లు చెదరగొట్టేలా ఫీల్డింగ్‌ విన్యాసాలతో పాటు బౌలర్ల మాయాజాలానికి నేటితో తెర పడనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-17వ సీజన్‌లో చిట్టచివరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇక మిగిలింది ఫైనల్‌ మాత్రమే. ఆదివారం చెపాక్‌ స్టేడియంలో జరిగే ఈ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు టైటిల్‌ కోసం తలపడబోతున్నాయి. 2012, 2014లో కేకేఆర్‌ విజేతగా నిలవగా, 2016లో రైజర్స్‌ చాంపియన్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌ ఓ రకంగా కోచ్‌ గంభీర్‌ వ్యూహాలకు.. కెప్టెన్‌ కమిన్స్‌ నాయకత్వ ప్రతిభకు సవాల్‌గా నిలువనుంది. ఎందుకంటే ఈ ఏడాది లీగ్‌లో ఈ ఇద్దరి ఆగమనంతో రెండు జట్ల తలరాతే మారింది. నువ్వా.. నేనా? అనే రీతిలో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం వహిస్తూ టాప్‌-2గా నిలిచాయి. క్వాలిఫయర్‌1లోనే రైజర్స్‌పై గెలిచిన కోల్‌కతా నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆ జట్టుకు నాలుగు రోజుల విశ్రాంతి లభించగా, రెట్టించిన ఉత్సాహంతో మూడో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. ఇక ఆ మ్యాచ్‌లో పరాభవానికి బదులు తీర్చుకోవడంతో పాటు రెండోసారి విజేతగా నిలవాలని రైజర్స్‌ పట్టుదలగా ఉంది. ఐపీఎల్‌లో రెండు జట్ల మధ్య 27 మ్యాచ్‌లు జరగ్గా కేకేఆర్‌ 18-9తో ఆధిక్యంలో ఉంది. తాజా సీజన్‌లోనూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ నెగ్గింది.


సమష్టి ఆటే బలంగా..

కోల్‌కతా ఈ సీజన్‌లో ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడి ముందుకుసాగలేదు. ఓపెనర్లు నరైన్‌, సాల్ట్‌ల దూకుడుతో హ్యాట్రిక్‌ విజయాలతో ఆరంభమైన ప్రస్థానం లీగ్‌ దశలో టాప్‌తో ముగిసింది. తమ మూడో మ్యాచ్‌లో ఢిల్లీపై అయితే ఏకంగా 272 పరుగులతో విరుచుకుపడింది. ఇప్పుడు సాల్ట్‌ స్థానంలో గుర్బాజ్‌ ఫర్వాలేదనిపిస్తున్నాడు. అటు నరైన్‌ తన సహజశైలిలో ఆడుతున్నాడు. ఇక మిడిలార్డర్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌, కెప్టెన్‌ శ్రేయా్‌సలతో పాటు నితీశ్‌ రాణా, ఆండ్రీ రస్సెల్‌, రింకూ సింగ్‌లతో పాటు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు వరుణ్‌, నరైన్‌ తురుపుముక్కలుగా ఉంటున్నారు. చెపాక్‌ పిచ్‌ కూడా వీరికి సహకరించే అవకాశం ఉంది. అలాగే క్వాలిఫయర్‌1లో పేసర్‌ స్టార్క్‌ మెరుపు బౌలింగ్‌ ఎవరూ మర్చిపోలేనిది. పవర్‌ప్లేలోనే రైజర్స్‌కు ముకుతాడు వేశాడు. అందుకే ఈ పోరులో కేకేఆర్‌ను ఫేవరెట్‌గా భావిస్తున్నారు.


ఓపెనర్లు రాణిస్తేనే..

లీగ్‌దశలో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన సన్‌రైజర్స్‌ ఓపెనర్లు హెడ్‌, అభిషేక్‌ ప్లేఆ్‌ఫ్సలో ఉస్సూరుమనిపించారు. ఈ జోడీ విధ్వంసంతోనే 287, 277, 266 స్కోర్లతో బెదరగొట్టింది. కానీ స్లో పిచ్‌లపై వీరి బ్యాట్ల నుంచి బౌండరీలు రాలేకపోతున్నాయి. హెడ్‌ అయితే చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు డకౌటయ్యాడు. దీంతో జట్టుకు మెరుపు ఆరంభాలు దక్కలేదు. టాపార్డర్‌లో త్రిపాఠి దూకుడు సానుకూలాంశమైనా, మిడిలార్డర్‌లో క్లాసెన్‌పైనే భారం పడుతోంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు అతడిని అడ్డుకుంటే రైజర్స్‌కు ఇబ్బందులు తప్పవు. నితీశ్‌, మార్‌క్రమ్‌ ఇటీవలి మ్యాచ్‌ల్లో విఫలం కావడం భారీస్కోరుపై ప్రభావం చూపిస్తోంది. అయినా క్వాలిఫయర్‌-2లో బౌలర్లు రాణించడంతోనే రాజస్థాన్‌ను చిత్తు చేసింది. కేకేఆర్‌తో పోలిస్తే స్పిన్‌ బలహీనంగా ఉన్నా.. రాజస్థాన్‌పై సత్తాచాటిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ షాబాజ్‌, పార్ట్‌ టైం బౌలర్‌ అభిషేక్‌ ఫైనల్లోనూ జోరు కొనసాగించాలనుకుంటున్నారు. పేసర్లు కమిన్స్‌, నటరాజన్‌, భువనేశ్వర్‌ ఎప్పటిలాగే కీలకం కానున్నారు.


పిచ్‌, వాతావరణం

శనివారం సాయంత్రం చెన్నైలో వర్షం కురిసినా.. నేడు మాత్రం ఆకాశం పూర్తిగా మేఘావృతంగా ఉండనుంది. వర్షం పడే అవకాశం 3 శాతం మాత్రమే. ఇక చివరి మ్యాచ్‌లో మంచు ప్రభావం లేకపోవడంతో స్పిన్నర్లు హవా చూపారు. అందుకే నేటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ తీసుకునే అవకాశం ఉంది.

వర్షంతో వీలు కాకుంటే..

ఐపీఎల్‌ ఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంది. దీంతో ఆదివారం వర్షం కారణంగా మ్యాచ్‌ వీలు కాకుంటే సోమవారం నిర్వహిస్తారు. ఒకవేళ అప్పుడు కూడా ఆటకు అనుకూల పరిస్థితి లేక రద్దయితే కోల్‌కతాను విజేతగా ప్రకటిస్తారు. ఎందుకంటే.. పట్టికలో కేకేఆర్‌ 20 పాయింట్లతో అన్నిజట్లకన్నా టాప్‌లో ఉండడమే దీనికి కారణం.

తుది జట్లు (అంచనా)

కోల్‌కతా: గుర్బాజ్‌, నరైన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రస్సెల్‌, రింకూ సింగ్‌, రమణ్‌దీప్‌, స్టార్క్‌, వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి.

సన్‌రైజర్స్‌: హెడ్‌, అభిషేక్‌, త్రిపాఠి, మార్‌క్రమ్‌, క్లాసెన్‌, నితీశ్‌, సమద్‌, కమిన్స్‌ (కెప్టెన్‌), ఉనాద్కట్‌, నటరాజన్‌, భువనేశ్వర్‌.

Updated Date - May 26 , 2024 | 04:49 AM