భారత్ VS మినీ భారత్
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:31 AM
అది పేరుకే అమెరికా జట్టు.. అందులో సగం మంది భారత మూలాలున్న ఆటగాళ్లే. బ్లూ జెర్సీ వేసుకోవాలనే కల.. కలగానే మిగలడంతో దేశం వదిలి వెళ్లిన భారత ఆటగాళ్లు ఇప్పుడు అమెరికా జట్టు తరపున తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు...

గెలిస్తే సూపర్-8కు..
యూఎస్‌తో రోహిత్ సేన పోరు నేడు
జోష్‌లో ఇరు జట్లు
న్యూయార్క్: అది పేరుకే అమెరికా జట్టు.. అందులో సగం మంది భారత మూలాలున్న ఆటగాళ్లే. బ్లూ జెర్సీ వేసుకోవాలనే కల.. కలగానే మిగలడంతో దేశం వదిలి వెళ్లిన భారత ఆటగాళ్లు ఇప్పుడు అమెరికా జట్టు తరపున తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందుకే భారత్ వర్సెస్ మినీ భారత్‌గా మారిన ఈ మ్యాచ్‌పై అందరికీ ఆసక్తి నెలకొంది. అలాగే గ్రూప్ ‘ఎ’లో రోహిత్ సేనకు సమవుజ్జీగా ఉన్నది కూడా యూఎస్ జట్టేననే విషయం మరువరాదు. ఇక పాకిస్థాన్‌పై స్వల్ప లక్ష్యాన్ని భారత్ కాపాడుకుని విజయం సాధించగా.. అటు అదే పాక్ జట్టుతో మ్యాచ్‌ను యూఎస్ సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లి మరీ గెలిచింది. దీంతో ఇరు జట్లు కూడా ప్రస్తుతం రెండేసి విజయాలతో నాలుగు పాయింట్లతో ఉన్నాయి. ఎవరు గెలిచినా సూపర్-8కి వెళ్లే అవకాశం ఉంటుంది. పసికూనే కదా అని తేలిగ్గా తీసుకుంటే.. ఫలితం మరోలా ఉంటుంది కాబట్టి టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిందే. ఈ టీమ్‌లో ఆరోన్ జోన్స్, గౌస్ భారీ హిట్టింగ్‌తో అదరగొడుతుండగా, కొరే అండర్సన్ అనుభవం ఉపయోగపడగలదు. సూర్యకుమార్‌తో కలిసి దేశవాళీల్లో ముంబైకి ఆడిన యూఎస్ పేసర్ నేత్రావల్కర్‌పై అందరి దృష్టీ నెలకొంది.
శాంసన్‌ను ఆడిస్తారా?
ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. కీపర్ పంత్ మాత్రమే స్వేచ్ఛగా ఆడుతున్నాడు. ఓపెనర్‌గా వస్తున్న విరాట్‌తో పాటు టీ20ల్లో నెంబర్‌వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేలవ షాట్లతో నిరాశపరిచారు. రోహిత్ కూడా త్వరగానే నిష్క్రమిస్తున్నాడు. అపార అనుభవం కలిగిన వీరు పిచ్‌ను అర్థం చేసుకుంటూ క్రీజులో కుదురుకోవాలి. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి.. జట్టులో చోటు దక్కించుకున్న శివమ్ దూబే ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు. స్పిన్నర్లను కూడా సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో శాంసన్‌ను ఆడిస్తారా? లేక దూబేకు మరో అవకాశం ఇస్తారా? అనేది చూడాల్సిందే. స్పిన్నర్లు అక్షర్, జడేజా ఇప్పటిదాకా ప్రభావం చూపలేదు. పేస్‌త్రయం బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్‌తో పాటు అదనపు బౌలర్‌గా హార్దిక్ కొనసాగనున్నాడు.
పిచ్, వాతావరణం
నసౌ కౌంటీ పిచ్ పేసర్లకు స్వర్గధామంగా మారింది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లకు కష్టకాలమే. 120 స్కోరును ఛేదించడం కూడా అసాధ్యంగా మారుతోంది. టాస్ గెలిచిన జట్టు ఎప్పటిలాగే ఫీల్డింగ్‌కే మొగ్గుచూపవచ్చు. వాతావరణం పాక్షికంగా మేఘావృతంగా ఉండనుంది. వర్షం నుంచి ముప్పు లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), విరాట్, పంత్, సూర్యకుమార్, దూబే/శాంసన్, హార్దిక్, జడేజా, అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్.
యూఎ్‌సఏ: స్టీవెన్ టేలర్, మోనంక్ (కెప్టెన్), గౌస్, జోన్స్, నితీశ్ కుమార్, అండర్సన్, హర్మీత్, జస్దీప్, కెన్జిగె, నేత్రావల్కర్, అలీ ఖాన్.
పాయింట్ల పట్టిక గ్రూప్-ఎ
జటు మ్యా గె ఓ ఫ.తే పా రన్‌రేట్
భారత్ 2 2 0 0 4 1.455
అమెరికా 2 2 0 0 4 0.626
పాకిస్థాన్ 3 1 2 0 2 0.191
కెనడా 3 1 2 0 2 -0.493
ఐర్లాండ్ 2 0 2 0 0 -1.712
ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; పా: పాయింట్లు