Share News

ఆధిక్యం కోసం భారత్‌

ABN , Publish Date - Jul 10 , 2024 | 02:45 AM

ఐదు టీ20ల సిరీ్‌సలో భాగంగా భారత యువ జట్టు కీలక మ్యాచ్‌ ఆడనుంది. ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా ఉండగా, నేడు జింబాబ్వేతో జరిగే మూడో మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా...

ఆధిక్యం కోసం భారత్‌

ఓపెనర్‌గా జైస్వాల్‌!

నేడు జింబాబ్వేతో మూడో టీ20

హరారే: ఐదు టీ20ల సిరీ్‌సలో భాగంగా భారత యువ జట్టు కీలక మ్యాచ్‌ ఆడనుంది. ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా ఉండగా, నేడు జింబాబ్వేతో జరిగే మూడో మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. తద్వారా ఆధిక్యం సాధించి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టవచ్చు. అయితే టీ20 వరల్డ్‌కప్‌ అనంతరం యశస్వీ జైస్వాల్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే జట్టులో చేరడంతో తుది కూర్పు ఆసక్తికరంగా మారింది. ఓపెనర్‌గా అభిషేక్‌, జైస్వాల్‌లలో ఎవరివైపు మొగ్గు చూపుతారనేది వేచిచూడాల్సిందే. ఆ స్థానంలో ఇప్పటికే అభిషేక్‌ శర్మ దుమ్మురేపే ఆటతీరుతో శతకం బాదేశాడు. అయితే ఆడిన 17 టీ20ల్లో 161కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో ఉన్న జైస్వాల్‌పైనే కెప్టెన్‌ గిల్‌ ఆసక్తి చూపవచ్చు. అప్పుడు అభిషేక్‌ వన్‌డౌన్‌లో ఆడాల్సి ఉంటుంది. అదే జరిగితే రుతురాజ్‌ నాలుగో స్థానంలో, ఇక కీపర్‌గా శాంసన్‌ ఆ తర్వాత బరిలోకి దిగుతారు. మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్‌ దూబే, పరాగ్‌ ఇన్నింగ్స్‌ను కదం తొక్కించగలరు. అలాగే సాయి సుదర్శన్‌, జురెల్‌, పరాగ్‌ తమ స్థానాలను కోల్పోవాల్సి ఉంటుంది.


మరోవైపు తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన జింబాబ్వే ఆ తర్వాత అన్నింటా విఫలమై 100 పరుగుల తేడాతో చిత్తయింది. ముఖ్యంగా భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఈ జట్టు బ్యాటర్లు పూర్తిగా తేలిపోతున్నారు. ఈ కీలక మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్‌ విభాగం రాణిస్తే భారత్‌కు పోటీ ఇవ్వగలుగుతుంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: గిల్‌ (కెప్టెన్‌), జైస్వాల్‌, అభిషేక్‌, రుతురాజ్‌, శాంసన్‌, దూబే, రింకూ, సుందర్‌, బిష్ణోయ్‌, అవేశ్‌, ముకేశ్‌.

జింబాబ్వే: మధెవెరె, ఇన్నోసెంట్‌, బెన్నెట్‌, సికందర్‌ రజా (కెప్టెన్‌), మైర్స్‌, క్యాంప్‌బెల్‌, మదండె, మసకద్జ, జోంగ్వే, ముజరబాని, చటార.

Updated Date - Jul 10 , 2024 | 02:45 AM