Share News

Hyderabad: ఐపీఎల్‌కు పటిష్ఠ బందోబస్తు.. 2,500 మంది పోలీసులతో పహారా

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:12 PM

ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium)లో బుధవారం జరగనున్న ఐపీఎల్‌-2024 (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) మ్యాచ్‌కి 2500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ కమిషనర్‌ తరుణ్‌ జోషి(Rachakonda Commissioner Tarun Joshi) వెల్లడించారు.

Hyderabad: ఐపీఎల్‌కు పటిష్ఠ బందోబస్తు.. 2,500 మంది పోలీసులతో పహారా

- మీడియా సమావేశంలో రాచకొండ సీపీ తరుణ్‌ జోషి

హైదరాబాద్‌ సిటీ: ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium)లో బుధవారం జరగనున్న ఐపీఎల్‌-2024 (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) మ్యాచ్‌కి 2500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ కమిషనర్‌ తరుణ్‌ జోషి(Rachakonda Commissioner Tarun Joshi) వెల్లడించారు. ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. బుధవారం సాయంత్రం ముంబై ఇండియన్స్‌ సన్‌రైజర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్నట్లు తెలిపారు. స్టేడియాన్ని మంగళవారం నుంచే తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బందితో పాటు డీసీపీలు, ఏసీపీలు నేరుగా స్టేడియంలో తిరుగుతూ భద్రతను పర్యవేక్షించనున్నట్లు సీపీ తెలిపారు. ప్రత్యేకంగా 360 సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశామన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఐటీ సెల్‌ అధికారులు మానిటరింగ్‌ చేస్తారు. మహిళలకు, చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా, పోకిరీలు, ఆకతాయిలు వేధించకుండా షీటీమ్‌ బృందాలను మఫ్టీలో ఉంటారన్నారు.

వీటిని అనుమతించరు

- ల్యాప్‌టాప్స్‌, కెమెరాలు, మ్యాచ్‌బాక్స్‌లు, బైనాక్యులర్స్‌, బ్యాటరీలు, బ్యాగులు, బ్యానర్స్‌, సిగరెట్లు, లైటర్స్‌, కాయిన్స్‌, హెల్మెట్స్‌, బయటి నుంచి తెచ్చే తినుబండారాలు, వాటర్‌ బాటిల్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, షార్ప్‌ మెటల్‌ వస్తువులు, వైరింగ్‌ పెన్స్‌కు అనుమతి లేదు.

- ద్విచక్ర వాహనదారులు హెల్మెట్స్‌ను వాహనం వద్దనే ఉంచి లాకింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలి.

city4.jpg

ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు

ఉప్పల్‌ స్టేడియంలో మార్చి 27న, ఏప్రిల్‌ 4న జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసేందుకు గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి వచ్చే అభిమానుల కోసం 60 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు ఆయా రోజుల్లో సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మెహిదీపట్నం, ఘట్‌కేసర్‌, హయత్‌నగర్‌, ఎన్జీవోస్ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్‌ క్వార్టర్స్‌, కోఠి, అఫ్జల్‌గంజ్‌, లక్డీకాపూల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ, మేడ్చల్‌, మియాపూర్‌, జేబీఎస్‌, ఈసీఐఎల్‌ ఎక్స్‌రోడ్‌, బోయిన్‌పల్లి, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, కొండాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, ఎల్‌బీనగర్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి స్టేడియానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్సుల వివరాలు, ఇతర సమాచారం కోసం 9959226160 (కోఠి), 9959226154 (రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌) నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ జరుగుతున్నందున నగరంలోకి వచ్చే హెవీ వాహనాలను దారిమళ్లిస్తామని సీపీ తరణ్‌జోషి తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:50 వరకు వాహనాల మళ్లింపులు అమల్లో ఉంటాయన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:12 PM