Share News

హమ్మయ్య..ముంబై

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:20 AM

అశుతోష్‌ శర్మ (28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 61) అసాధారణ ఇన్నింగ్స్‌తో విజయంపై ఆశలు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌.. చివరకు ఆఖరి ఓవర్‌లో గట్టెక్కింది. 193 పరుగుల ఛేదనలో పంజాబ్‌...

హమ్మయ్య..ముంబై

  • ఆఖరి ఓవర్‌లో విజయం

  • సూర్యకుమార్‌ అర్ధసెంచరీ

  • వణికించిన పంజాబ్‌

  • అశుతోష్‌ పోరాటం వృధా

ముల్లాపూర్‌: అశుతోష్‌ శర్మ (28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 61) అసాధారణ ఇన్నింగ్స్‌తో విజయంపై ఆశలు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌.. చివరకు ఆఖరి ఓవర్‌లో గట్టెక్కింది. 193 పరుగుల ఛేదనలో పంజాబ్‌ స్కోరు ఓ దశలో 14/4 మాత్రమే. కానీ ఈ స్థితి నుంచి అశుతోష్‌, శశాంక్‌ సింగ్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41) మ్యాచ్‌ను చివరి వరకు తెచ్చారు. కానీ కీలక దశలో ముంబై పేసర్లు బుమ్రా, కొట్జీ వీరి వికెట్లు తీసి జట్టును ఆదుకున్నారు. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ సేన 9 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ సీజన్‌లో చివరి ఓవర్‌లో పంజాబ్‌ ఓడడం ఇది నాలుగోసారి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 78), రోహిత్‌ (36), తిలక్‌ (34 నాటౌట్‌) రాణించారు. హర్షల్‌కు మూడు, కర్రాన్‌లకు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్‌ 19.1 ఓవర్లలో 183 పరుగులు చేసి ఓడింది. బుమ్రా, కొట్జీలకు మూడేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బుమ్రా నిలిచాడు.

బెదరగొట్టిన అశుతోష్‌: పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ ముంబై పేసర్లు కొట్జీ, బుమ్రా చెలరేగడంతో పంజాబ్‌ ఛేదన పేలవంగా ఆరంభమైంది. కానీ ఓవైపు వికెట్లు నేలకూలుతున్నా మధ్య ఓవర్లలో శశాంక్‌-అశుతోష్‌ జోడీ రన్‌రేట్‌ తగ్గకుండా ఆడడంతో ముంబైకి ఓటమి కళ్లముందు కనిపించింది. తొలి 13 బంతుల్లోనే ప్రభ్‌సిమ్రన్‌ (0), రొసో (1), కర్రాన్‌ (6), లివింగ్‌స్టోన్‌ (1) పెవిలియన్‌కు చేరడం దెబ్బతీసింది. అప్పటికి స్కోరు 14 పరుగులే. బుమ్రా ఒకే ఓవర్‌లో రొసో, కర్రాన్‌ల వికెట్లతో షాకిచ్చాడు. ఈ స్థితిలో శశాంక్‌ ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఏడో ఓవర్‌లో హర్‌ప్రీత్‌ సింగ్‌ (13)ను శ్రేయాస్‌ గోపాల్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేయగా ఐదో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో ఎండ్‌లో జితేశ్‌ (9)ను పేసర్‌ ఆకాశ్‌ ఎల్బీ చేయడంతో 77/6 స్కోరుతో పంజాబ్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. కానీ అశుతోష్‌ ముంబైపై ఎదురుదాడికి దిగాడు. శశాంక్‌-అశుతోష్‌ జోడీ పంజాబ్‌ విజయంపై ఆశలు రేకెత్తించిన వేళ.. బుమ్రా ఝలక్‌ ఇచ్చాడు. 13వ ఓవర్‌లో శశాంక్‌ వికెట్‌ తీశాడు. 16వ ఓవర్‌లో రెండు అద్భుత సిక్సర్లతో అశుతోష్‌ 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేయగా, బ్రార్‌ మరో సిక్సర్‌తో మధ్వాల్‌ 24 పరుగులిచ్చుకున్నాడు. దీంతో సమీకరణం 24 బంతుల్లో 28 రన్స్‌కు మారడంతో మ్యాచ్‌ పంజాబ్‌ వైపు మొగ్గింది. ఈ దశలో బుమ్రా 3 పరుగులే ఇవ్వగా.. 18వ ఓవర్‌లో అశుతోష్‌ను కొట్జీ అవుట్‌ చేయడంతో ఒక్కసారిగా ముంబైలో జోష్‌ కనిపించింది. దీనికి తోడు తర్వాతి ఓవర్‌లోనే బ్రార్‌ సైతం అవుట్‌ కావడంతో ఇక ఆశలు లేకుండా పోయాయి. చివర్లో రబాడ (8) సిక్సర్‌తో ఆరు బంతుల్లో 12 రన్స్‌ అవసరమైనా, తొలి బంతికే అతను రనౌట్‌ కావడంతో ఎంఐ ఊపిరిపీల్చుకుంది.

సూర్య అర్ధసెంచరీ: టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన ముంబై త్వరగానే ఓపెనర్‌ ఇషాన్‌ (8) వికెట్‌ను కోల్పోయినా.. సూర్యకుమార్‌ అదరగొట్టాడు. రోహిత్‌, తిలక్‌ సహకారమందించడంతో ఎంఐ సవాల్‌ విసిరే స్కోరును సాధించింది. ఐదో ఓవర్‌లో రోహిత్‌ను ఎల్బీగా అవుటిచ్చినా రివ్యూకు వెళ్లడంతో బతికిపోయాడు. ఆరో ఓవర్‌లో అతడి సిక్సర్‌తో ముంబై పవర్‌ప్లేలో 54/1 స్కోరుతో ఫర్వాలేదనిపించింది. అనంతరం సూర్య ఎక్కువగా స్ట్రయికింగ్‌ తనే తీసుకుంటూ అడపాదడపా బౌండరీలతో చెలరేగాడు. దీంతో 34 బంతుల్లో అతడి ఫిఫ్టీ పూర్తయ్యింది. అటు 12వ ఓవర్‌లో పేసర్‌ కర్రాన్‌కు రోహిత్‌ చిక్కడంతో రెండో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో 22 బంతులపాటు ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. ఇక 16వ ఓవర్‌లో రివ్యూ ద్వారా ఎల్బీ నుంచి గట్టెక్కిన సూర్య చెలరేగి 4,6,6తో 18 రన్స్‌ రాబట్టాడు. కానీ సెంచరీ ఖాయమనిపించిన తరుణంలో సూర్యను కర్రాన్‌.. కెప్టెన్‌ హార్దిక్‌ (10)ను హర్షల్‌ వరుస ఓవర్లలో అవుట్‌ చేశారు. మరోవైపు 19వ ఓవర్‌లో టిమ్‌ డేవిడ్‌ (14) 4,4,6తో 18 రన్స్‌ అందించగా, స్కోరు 200 దాటుతుందనిపించింది. అయితే ఆఖరి ఓవర్‌లో హర్షల్‌ 7 పరుగులే ఇచ్చి డేవిడ్‌, షెఫర్డ్‌ (1)ల వికెట్లు తీశాడు. నబీ (0) రనౌటయ్యాడు.

స్కోరుబోర్డు

ముంబై: ఇషాన్‌ (సి) హర్‌ప్రీత్‌ (బి) రబాడ 8, రోహిత్‌ (సి) హర్‌ప్రీత్‌ (బి) కర్రాన్‌ 36, సూర్యకుమార్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) కర్రాన్‌ 78, తిలక్‌వర్మ (నాటౌట్‌) 34, హార్దిక్‌ (సి) హర్‌ప్రీత్‌ (బి) హర్షల్‌ 10, డేవిడ్‌ (సి) కర్రాన్‌ (బి) హర్షల్‌ 14, షెఫర్డ్‌ (సి) శశాంక్‌ (బి) హర్షల్‌ 1, నబీ (రనౌట్‌) 0 : ఎక్స్‌ట్రాలు : 11 ; మొత్తం 20 ఓవర్లలో 192/7 ; వికెట్లపతనం : 1-18, 2-99, 3-148, 4-167, 5-190, 6- 192, 7-192; బౌలింగ్‌: లివింగ్‌స్టోన్‌ 2-0-16-0, అర్ష్‌దీప్‌ 3-0-35-0, రబాడ 4-0-42-1, హర్షల్‌ 4-0-31-3, కర్రాన్‌ 4-0-41-2, హర్‌ప్రీత్‌ 3-0-21- 0

పంజాబ్‌: కర్రాన్‌ (సి) ఇషాన్‌ (బి) బుమ్రా 6, ప్రభ్‌సిమ్రన్‌ (సి) ఇషాన్‌ (బి) కొట్జీ 0, రొసో (బి) బుమ్రా 1, లివింగ్‌స్టోన్‌ (సి అండ్‌ బి) కొట్జీ 1, హర్‌ప్రీత్‌ సింగ్‌ (సి అండ్‌ బి) శ్రేయాస్‌ 13, శశాంక్‌ (సి) తిలక్‌ (బి) బుమ్రా 41, జితేశ్‌ (ఎల్బీ) మఽధ్వాల్‌ 9, అశుతోష్‌ (సి) నబీ (బి) కొట్జీ 61, హర్‌ప్రీత్‌ బ్రార్‌ (సి) నబీ (బి) హార్దిక్‌ 21, హర్షల్‌ (నాటౌట్‌) 1, రబాడ (రనౌట్‌) 8 : ఎక్స్‌ట్రాలు : 21 ; మొత్తం 19.1 ఓవర్లలో 183 ఆలౌట్‌ ; వికెట్లపతనం : 1-10, 2-13, 3-14, 4-14, 5-49, 6-77, 7-111, 8-168, 9-174 ; బౌలింగ్‌: కొట్టీ 4-0- 32-3, బుమ్రా 4-0-21-3, మఽధ్వాల్‌ 3.1-0-461, హార్దిక్‌ 4-0-33-1, శ్రేయాస్‌ 2-0-26-1, షెఫర్డ్‌ 2-0-20-0.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 7 6 1 0 12 0.677

కోల్‌కతా 6 4 2 0 8 1.399

చెన్నై 6 4 2 0 8 0.726

హైదరాబాద్‌ 6 4 2 0 8 0.502

లఖ్‌నవూ 6 3 3 0 6 0.038

ఢిల్లీ 7 3 4 0 6 -0.074

ముంబై 7 3 4 0 6 -0.133

గుజరాత్‌ 7 3 4 0 6 -1.303

పంజాబ్‌ 7 2 5 0 4 -0.251

బెంగళూరు 7 1 6 0 2 -1.185

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

1

ముంబై ఇండియన్స్‌ తరఫున ఎక్కువ సిక్సర్లు (224) బాదిన బ్యాటర్‌గా రోహిత్‌

Updated Date - Apr 19 , 2024 | 02:20 AM