Share News

ఆర్థిక సాయం కోసం గిరిపుత్రుడి ఎదురుచూపు

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:08 AM

కొండంత ఆశయం అతడిది. శిఖరమంత లక్ష్యాన్ని కూడా గుండె ధైర్యంతో అధిగమించే ఉక్కు సంకల్పం ఆ గిరిజన బిడ్డది. ఐదు శిఖరాలను దిగ్విజయంగా అధిరోహించిన అతడి చూపు ఇప్పుడు

ఆర్థిక సాయం కోసం గిరిపుత్రుడి ఎదురుచూపు

కొండంత ఆశయం అతడిది. శిఖరమంత లక్ష్యాన్ని కూడా గుండె ధైర్యంతో అధిగమించే ఉక్కు సంకల్పం ఆ గిరిజన బిడ్డది. ఐదు శిఖరాలను దిగ్విజయంగా అధిరోహించిన అతడి చూపు ఇప్పుడు మౌంట్‌ ఎవరె్‌స్టపై పడింది. ఇది ఖర్చుతో కూడిన సాహస యాత్ర కావడంతో నిరుపేద కుటుంబానికి చెందిన పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్‌ ప్రభుత్వం, దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.

పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్‌ (20) స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా, మరిపాడ మండలం భుక్యా తండా. తండ్రి రామ్మూర్తి కరెంట్‌ పని చేస్తుంటాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యశ్వంత్‌కు 15 ఏళ్ల వయసులో పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. దీంతో భువనగిరిలోని పర్వతారోహణ పాఠశాలలో చేరి, క్లిష్టతరమైన కొండలను ఎక్కడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆ తర్వాత సిక్కింలోని ఇండియన్‌ హిమాలయన్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వెంచర్‌ అండ్‌ ఎకో టూరిజం (ఐహెచ్‌సీఏఈ)లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి యశ్వంత్‌ ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. 2020 నుంచి మూడేళ్ల వ్యవధిలో కిలిమంజారో (5,895 మీటర్లు), ఎల్బెరస్‌ (5,645 మీటర్లు), స్టోక్‌ కంగ్రీ (6,153 మీటర్లు) సహా ఐదు పర్వతాలను దిగ్విజయంగా అధిరోహించాడు. వచ్చే ఏప్రిల్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన మౌంట్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కేందుకు అనుమతి ఫీజు, ఆక్సిజన్‌ పరికరాలు, ప్రత్యేక దుస్తులు, ఇతరత్రా సామగ్రికి సుమారు రూ.40 లక్షలు అవసరమవుతాయని యశ్వంత్‌ తెలిపాడు. ఇందుకోసం ఇప్పటిదాకా రూ.15 లక్షలు విరాళాల రూపంలో లభించాయని, మిగిలిన మొత్తం ప్రభుత్వం లేదా దాతలెవరైనా అందజేస్తే, ఎవరె్‌స్టను అధిరోహించి రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకొస్తానని యశ్వంత్‌ హామీ ఇస్తున్నాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

Updated Date - Jan 21 , 2024 | 05:08 AM