Share News

హ్యాట్రిక్‌తో మెరిసింది

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:36 AM

బ్యాటింగ్‌లో తడబడిన లఖ్‌నవూ చేసిందే 163 పరుగులు. అయినా ఆ జట్టు బౌలర్లు చూపిన తెగువ వహ్వా.. అనిపించకమానదు. పేసర్‌ యష్‌ ఠాకూర్‌, స్పిన్నర్‌ క్రునాల్‌ పాండ్యా పరుగులను కట్టడి చేయడమే కాదు.. కీలక వికెట్లతో...

హ్యాట్రిక్‌తో  మెరిసింది

లఖ్‌నవూ ఘనవిజయం

  • పేసర్‌ యశ్‌కు ఐదు వికెట్లు

  • కట్టడి చేసిన స్పిన్నర్‌ క్రునాల్‌

  • గుజరాత్‌ చిత్తు

బ్యాటింగ్‌లో తడబడిన లఖ్‌నవూ చేసిందే 163 పరుగులు. అయినా ఆ జట్టు బౌలర్లు చూపిన తెగువ వహ్వా.. అనిపించకమానదు. పేసర్‌ యష్‌ ఠాకూర్‌, స్పిన్నర్‌ క్రునాల్‌ పాండ్యా పరుగులను కట్టడి చేయడమే కాదు.. కీలక వికెట్లతో గుజరాత్‌ను దెబ్బతీశారు. దీంతో 54/0 నుంచి 80/5కు పడిపోయిన ఆ జట్టు మరిక కోలుకోలేకపోయింది. అటుజెయింట్స్‌ హ్యాట్రిక్‌ విజయంతో సంబరాలు చేసుకుంది.

లఖ్‌నవూ: ఐపీఎల్‌లో ఇప్పటిదాకా గుజరాత్‌ టైటాన్స్‌పై గెలవని లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఆ కొరత తీర్చేసుకుంది. పేసర్‌ యశ్‌ ఠాకూర్‌ (5/30), స్పిన్నర్‌ క్రునాల్‌ పాండ్యా (3/11) తమ మ్యాజిక్‌ బంతులతో టైటాన్స్‌కు అనూహ్య షాక్‌ను ఇచ్చారు. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రాహుల్‌ సేనకిది హ్యాట్రిక్‌ విజయం కాగా.. పట్టికలోనూ మూడో స్థానానికి చేరింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. స్టొయినిస్‌ (43 బంతుల్లో 58), రాహుల్‌ (33), పూరన్‌ (22 బంతుల్లో 32 నాటౌట్‌) రాణించారు. నల్కందే, ఉమేశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్‌ 18.5 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. సాయి సుదర్శన్‌ (23 బంతుల్లో 31), తెవాటియా (25 బంతుల్లో 30) ఆకట్టుకున్నారు. లఖ్‌నవూ స్పీడ్‌గన్‌ మయాంక్‌ యాదవ్‌ ఒక్క ఓవర్‌ వేసి పక్కటెముకల నొప్పితో వైదొలిగాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా యశ్‌ ఠాకూర్‌ నిలిచాడు.

వణికించిన యశ్‌, క్రునాల్‌: ఓ మాదిరి ఛేదనను సులువుగా పూర్తి చేస్తుందనుకున్న గుజరాత్‌ జెయింట్స్‌ అనూహ్యంగా తడబడింది. లఖ్‌నవూ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో పాటు వరుస విరామాల్లో వికెట్లు నేలకూలుస్తూ మ్యాచ్‌ను లాగేశారు. స్పిన్నర్‌ క్రునాల్‌, పేసర్‌ యశ్‌ ఠాకూర్‌ కీలక వికెట్లతో దెబ్బతీశారు. ఓపెనర్లు సాయిసుదర్శన్‌, గిల్‌ తొలి వికెట్‌కు అందించిన 54 పరుగుల భాగస్వామ్యం తప్ప టైటాన్స్‌ ఇన్నింగ్స్‌లో చెప్పుకోవడానికేమీ లేకపోయింది. పవర్‌ప్లేలో 54 పరుగులతో పటిష్టంగానే కనిపించినా గిల్‌ వికెట్‌ను యష్‌ తీశాడు. ఇక ఆ తర్వాత గుజరాత్‌ను లఖ్‌నవూ బౌలర్లు అల్లాడించారు. విలియమ్సన్‌ (1)ను స్పిన్నర్‌ బిష్ణోయ్‌ ఒంటిచేత్తో అందుకున్న రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ బాట పట్టించగా.. తొమ్మిదో ఓవర్‌లో సాయి, శరత్‌ (2)లను క్రునాల్‌ పాండ్యా దెబ్బతీశాడు. దీనికి తోడు 7-11 ఓవర్ల మధ్య కనీసం ఓ ఫోర్‌ కూడా రాబట్టలేకపోయింది. విజయ్‌ శంకర్‌ (17), నల్కందే (12)లను స్పిన్నర్లు తెగ ఇబ్బందిపెట్టారు. 12వ ఓవర్‌లో సిక్సర్‌ బాదిన నల్కందేను క్రునాల్‌.. కాసేపటికే విజయ్‌, రషీద్‌ (0)లను యశ్‌ మెయిడిన్‌ డబుల్‌ వికెట్‌గా అవుట్‌ చేయడంతో టైటాన్స్‌ 93 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకుంది. అప్పటికీ ఛేదన మరీ కష్టంగా లేకున్నా చేతిలో వికెట్లు లేకపోవడం దెబ్బతీసింది. చివర్లో తెవాటియా మెరుపులు ఓటమి తేడాను తగ్గించాయి. 19వ ఓవర్‌లో తెవాటియా, నూర్‌ (4)ల వికెట్లను తీసిన యశ్‌ మ్యాచ్‌ను ముగించాడు.

సాదాసీదాగా..: టాస్‌ గెలవగానే లఖ్‌నవూ కెప్టెన్‌ రాహుల్‌ బ్యాటింగ్‌కు మొగ్గు చూపినా.. బరిలోకి దిగాక బ్యాటర్లు పరుగుల కోసం తెగ కష్టపడ్డారు. చివర్లో పూరన్‌, బదోని (20) కాస్త బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోరు 160 దాటగలిగింది. అంతకుముందు తొలి ఓవర్‌లోనే జట్టుకు షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ డికాక్‌ (6) నాలుగో బంతికే వెనుదిరగ్గా.. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (7) తన పేలవ ఫామ్‌ను వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. ఈ ఇద్దరినీ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో మరో ఓపెనర్‌ రాహుల్‌, స్టొయినిస్‌ క్రీజులో నిలిచి జట్టును ఆదుకున్నారు. కానీ వీరు ఆచితూచి ఆడడం జట్టు భారీ స్కోరుపై ప్రభావం పడింది. అనంతరం స్పిన్నర్లు నూర్‌ అహ్మద్‌, రషీద్‌ ఖాన్‌ మెరుగ్గా బౌలింగ్‌ వేయడంతో ఈ జోడీ భారీ షాట్లు ఆడలేకపోయింది. అయితే వికెట్‌ను కాపాడుకుంటూ చక్కగా కుదురుకున్న ఈ ఇద్దరినీ పేసర్‌ నల్కందే దెబ్బతీసి జట్టుకు రిలీ్‌ఫనిచ్చాడు. ముందుగా 13వ ఓవర్‌లో రాహుల్‌ను అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 73 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. తన తర్వాతి ఓవర్‌లో స్టొయినిస్‌ రెండు సిక్సర్లు బాది అర్ధసెంచరీ పూర్తి చేసినా ఐదో బంతికి క్యాచ్‌ అవుటయ్యాడు. అటు ఈ దశలో క్రీజులో పూరన్‌ ఉన్నా బ్యాట్‌ ఝుళిపించలేకపోవడంతో 17 ఓవర్లలో స్కోరు 126/4గానే ఉంది. అయితే 18వ ఓవర్‌లో పూరన్‌ సిక్సర్‌, బదోని రెండు ఫోర్లతో 17 రన్స్‌ రాబట్టి లఖ్‌నవూ శిబిరంలో కాస్త జోష్‌ తెచ్చారు. కానీ ఈ సంతోషాన్ని ఆవిరి చేస్తూ బదోనిని రషీద్‌ అవుట్‌ చేయగా, చివరి ఓవర్‌లో పేసర్‌ జాన్సన్‌ 8 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు.

స్కోరుబోర్డు

లఖ్‌నవూ: డికాక్‌ (సి) నూర్‌ (బి) ఉమేశ్‌ 6, రాహుల్‌ (సి) తెవాటియా (బి) నల్కందే 33, పడిక్కళ్‌(సి) విజయ్‌ శంకర్‌ (బి) ఉమేశ్‌ 7, స్టొయినిస్‌ (సి) శరత్‌ (బి) నల్కందే 58, పూరన్‌ (నాటౌట్‌) 32, బదోనీ (సి) ఉమేశ్‌ (బి) రషీద్‌ 20, క్రునాల్‌ (నాటౌట్‌) 2 : ఎక్స్‌ట్రాలు : 5 : మొత్తం (20 ఓవర్లలో) 163/5 ; వికెట్లపతనం : 1/6, 2-18, 3-91, 4-112, 5-143 ; బౌలింగ్‌ : ఉమేశ్‌ 3-0-22-2, స్పెన్సర్‌ జాన్సన్‌ 4-0-32-0, రషీద్‌ 4-0-28-1, మోహిత్‌ 3-0-34-0, నూర్‌ అహ్మద్‌ 4-0-22-0, దర్శన్‌ నల్కందే 2-0-21-2

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) బిష్ణోయ్‌ (బి) క్రునాల్‌ 31, గిల్‌ (బి) యశ్‌ ఠాకూర్‌ 19, విలియమ్సన్‌ (సి) అండ్‌ (బీ) బిష్ణోయ్‌ 1, శరత్‌ (సి) బదోనీ (బి) క్రునాల్‌ 2, విజయ్‌ శంకర్‌ (సి) రాహుల్‌ (బి) యశ్‌ ఠాకూర్‌ 17, నల్కందే (సి) యశ్‌ ఠాకూర్‌ (బి) క్రునాల్‌ 12, తెవాటియా (సి) పూరన్‌ (బి) యశ్‌ ఠాకూర్‌ 30, రషీద్‌ (సి) సబ్‌ హుడా (బి) యశ్‌ ఠాకూర్‌ 0, ఉమేశ్‌ (సి) డికాక్‌ (బి) నవీన్‌ 2, జాన్సన్‌ (నాటౌట్‌) 0, నూర్‌ (సి) డికాక్‌ (బి) యశ్‌ ఠాకూర్‌ 4 : ఎక్స్‌ట్రాలు : 12 : (మొత్తం 18.5 ఓవర్లలో) 130 ఆలౌట్‌ ; వికెట్లపతనం : 1-54, 2-56, 3-58, 4-61, 5-80, 6-93, 7-93, 8-102, 9-126 బౌలింగ్‌: మణిమారన్‌ సిద్ధార్థ్‌ 4-0-29-0, నవీన్‌ ఉల్‌ హక్‌ 4-0-37-1, మయాంక్‌ యాదవ్‌ 1-0-13-0, యశ్‌ ఠాకూర్‌ 3.5-1-30-5, క్రునాల్‌ 4-0-11-3, బిష్ణోయ్‌ 2-0-8-1.

Updated Date - Apr 08 , 2024 | 01:36 AM