Share News

ఫేవరెట్‌ భారత్‌

ABN , Publish Date - Sep 11 , 2024 | 03:35 AM

ప్రపంచ చెస్‌ పండుగ ఒలింపియాడ్‌కు రంగం సిద్ధమైంది. బుధవారం ప్రారంభమవనున్న ఈ మెగా చెస్‌ టోర్నీ ఓపెన్‌ కేటగిరీలో 191 జట్లు, మహిళల విభాగంలో 180 జట్లు తలపడనున్నాయి. ఓపెన్‌ విభాగంలో గత చెస్‌ ఒలింపియాడ్‌లో కాంస్యం నెగ్గిన భారత...

ఫేవరెట్‌ భారత్‌

బరిలో తెలుగు జీఎంలు హారిక, హరికృష్ణ, అర్జున్‌

చెస్‌ ఒలింపియాడ్‌ నేటినుంచి

బుడాపెస్ట్‌: ప్రపంచ చెస్‌ పండుగ ఒలింపియాడ్‌కు రంగం సిద్ధమైంది. బుధవారం ప్రారంభమవనున్న ఈ మెగా చెస్‌ టోర్నీ ఓపెన్‌ కేటగిరీలో 191 జట్లు, మహిళల విభాగంలో 180 జట్లు తలపడనున్నాయి. ఓపెన్‌ విభాగంలో గత చెస్‌ ఒలింపియాడ్‌లో కాంస్యం నెగ్గిన భారత పురుషుల జట్టు ఈసారి రెండో సీడింగ్‌తో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా మహిళల జట్టుకు టాప్‌ సీడింగ్‌ లభించింది. దిగ్గజ ఆనంద్‌, హంపి ఈ పోటీలకు దూరం కావడంతో పురుషుల బృందాన్ని గుకేష్‌, మహిళల జట్టును తెలుగమ్మాయి హారిక నడిపించనున్నారు. ఫిడే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్తున్న వైశాలి జట్టుకు వెన్నుదన్ను కానుంది. వీరితో పాటు దివ్యా దేశ్‌ముఖ్‌, వంతిక అగర్వాల్‌ పావులు కదపనున్నారు. తానియా సచ్‌దేవ్‌ రిజర్వ్‌ ప్లేయర్‌గా ఉంది.


పురుషుల విభాగంలో తెలుగు ఆటగాళ్లు హరికృష్ణ, ఇరిగేసి అర్జున్‌, గుకేష్‌, విదిత్‌ గుజరాతి, ప్రజ్ఞానంద సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టాప్‌సీడ్‌ అమెరికా నుంచి ఫాబియానో కరువానా, వెస్లీ సో, లెవోన్‌ అరోనియన్‌తో పాటు మూడో సీడ్‌ చైనా నుంచి ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌కు భారత జీఎంల మధ్య రసవత్తర పోరు జరగనుంది.

Updated Date - Sep 11 , 2024 | 03:35 AM