Share News

సూపర్‌-8కు ఇంగ్లండ్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:54 AM

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ శనివారం నాడు పడిన టెన్షన్‌ అంతా..ఇంతా కాదు. బహుశా ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌లో ఆ జట్టు ఎదుర్కొన్న ఉత్కంఠ మరే టీమ్‌ కూడా ఎదుర్కొని ఉండదు. కారణం...

సూపర్‌-8కు ఇంగ్లండ్‌

నార్త్‌సౌండ్‌ (ఆంటీగ్వా): డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ శనివారం నాడు పడిన టెన్షన్‌ అంతా..ఇంతా కాదు. బహుశా ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌లో ఆ జట్టు ఎదుర్కొన్న ఉత్కంఠ మరే టీమ్‌ కూడా ఎదుర్కొని ఉండదు. కారణం..నమీబియాతో ఆ జట్టు ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు వరుణుడు తీవ్రంగా ఆటంకం కలిగించడమే. మ్యాచ్‌ రద్దయితే ఇంగ్లండ్‌ గ్రూపు దశ నుంచే ఇంటిముఖం పట్టాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఆగి ఆగి పడిన వర్షంతో మూడు గంటలపాటు బట్లర్‌ సేన తీవ్ర ఉద్విగ్నతకు లోనైంది. ఎట్టకేలకు 11 ఓవర్లతో ఆట మొదలుకాగా..ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా వరుణుడు మరోసారి పలకరించాడు. దాంతో చివరగా ఒక్కో ఇన్నింగ్స్‌ను 10 ఓవర్లకు కుదించారు. ఇంగ్లండ్‌ తొలుత 122/5 స్కోరు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హ్యారీ బ్రూక్‌ (47 నాటౌట్‌) ధనాధన్‌ బ్యాటింగ్‌ చేశాడు. అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధన ప్రకారం నమీబియా లక్ష్యాన్ని 10 ఓవర్లలో 126గా నిర్ధారించారు. కానీ ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 84/3 స్కోరుకే పరిమితమైంది. దాంతో 41 రన్స్‌తో నెగ్గినా ఇంగ్లండ్‌కు టెన్షన్‌ తప్పలేదు.


ఇదే గ్రూప్‌ ‘డి’లో ఆస్ట్రేలియా-స్కాట్లాండ్‌ ఆఖరి మ్యాచ్‌పై ఇంగ్లండ్‌ సూపర్‌-8 అవకాశాలు ఆధారపడి ఉండడమే అందుకు కారణం. ఆ పోరులో ఆసీస్‌ గెలిస్తేనే ఇంగ్లండ్‌ ముందంజ వేసేది. దాంతో ఆ మ్యాచ్‌ ఫలితం కోసం ఇంగ్లండ్‌ ఎదురు చూడాల్సి వచ్చింది. చివరకు ఆసీస్‌ నెగ్గడంతో..ఇంగ్లండ్‌ సూపర్‌-8కి క్వాలిఫై అయ్యింది.

క్రికెట్‌కు వీజ్‌ గుడ్‌బై: నమీబియా ఆల్‌రౌండర్‌, 39 ఏళ్ల డేవిడ్‌ వీజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక్కడ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌అనంతరం అతడు రిటైర్మెంట్‌ నిర్ణయం ప్రకటించాడు.

సంక్షిప్తస్కోర్లు

ఇంగ్లండ్‌: 10 ఓవర్లలో 122/5 (బ్రూక్‌ 47 నాటౌట్‌, బెయిర్‌ స్టో 31, ట్రంపెల్‌మన్‌ 2/31).

నమీబియా: 10 ఓవర్లలో 84/3 (వాన్‌ లింగెన్‌ 33, వీజ్‌ 27).

Updated Date - Jun 17 , 2024 | 04:54 AM