Share News

IND vs ENG: ఉప్పల్‌ టెస్టులో టీమిండియా ఓటమి.. 7 వికెట్లతో ఇంగ్లండ్‌ను గెలిపించిన హార్ట్‌లీ

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:45 AM

భారత అభిమానులకిది ఊహించని షాకే.. తొలి రెండు రోజులు అటు బంతి, ఇటు బ్యాటుతో మనోళ్లదే పూర్థి స్థాయిలో ఆధిపత్యం. దీనికితోడు 190 పరుగుల ఆధిక్యం. కానీ తర్వాత రెండు రోజుల్లో అంతా తారుమారు...

IND vs ENG: ఉప్పల్‌ టెస్టులో టీమిండియా ఓటమి.. 7 వికెట్లతో ఇంగ్లండ్‌ను గెలిపించిన హార్ట్‌లీ

ఏడు వికెట్లతో భారత్‌ను దెబ్బకొట్టిన హార్ట్‌లీ

ఉప్పల్‌ టెస్టులో 28 పరుగులతో ఇంగ్లండ్‌ విజయం

భారత అభిమానులకిది ఊహించని షాకే.. తొలి రెండు రోజులు అటు బంతి, ఇటు బ్యాటుతో మనోళ్లదే పూర్థి స్థాయిలో ఆధిపత్యం. దీనికితోడు 190 పరుగుల ఆధిక్యం. కానీ తర్వాత రెండు రోజుల్లో అంతా తారుమారు. ఒల్లీ పోప్‌ అసమాన బ్యాటింగ్‌తో 231 పరుగుల లక్ష్యం ఎదురైనా.. పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన టీమిండియాపై అంచనాలేమీ తగ్గలేదు. అయితే అరంగేట్ర లెఫ్టామ్‌ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ ఏడు వికెట్ల మాయాజాలానికి జట్టులో ఒక్క బ్యాటర్‌ కూడా ఆకట్టుకోక పోవడంతో ఉప్పల్‌లో తొలిసారి భారత్‌ ఓడక తప్పలేదు. చివర్లో అశ్విన్‌, భరత్‌ పోరాడినా అది సరిపోలేదు.

హైదరాబాద్‌: ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ను భారత్‌ ఓటమితో ఆరంభించింది. ఉప్పల్‌లో నాలుగో రోజైన ఆదివారమే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ 28 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో 1-0తో సిరీ్‌సలో ముందుకెళ్లింది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ (7/62) భారత్‌ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. ఆరంభంలోనే టాపార్డర్‌ను కుదురుకోనీయకుండా దెబ్బతీశాడు. అయితే చివర్లో టెయిలెండర్లు పోరాటం చూపారు. కానీ కీలక సమయంలో వారిని సైతం పెవిలియన్‌కు చేర్చిన హార్ట్‌లీ జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. ఫలితంగా 231 రన్స్‌ ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. రోహిత్‌ (39), భరత్‌ (28), అశ్విన్‌ (28), రాహుల్‌ (22) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అంతకుముందు ఇంగ్లం డ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 420 రన్స్‌ చేసింది. ఒల్లీ పోప్‌ (196) తృటిలో డబుల్‌ సెంచరీ కోల్పోయాడు. హార్ట్‌లీ (34), రెహాన్‌ (28) రాణించారు. బుమ్రాకు 4, అశ్విన్‌కు 3, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 246, భారత్‌ 436 పరుగులు చేశాయి. పోప్‌నకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది. రెండో టెస్టు వచ్చేనెల 2న విశాఖపట్నంలో మొదలవనుంది.

‘డబుల్‌’ మిస్‌: ఓవర్‌నైట్‌ స్కోరు 316/6తో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌కు పోప్‌ చివరికంటా అండగా నిలిచాడు. అదేపనిగా రివర్స్‌ స్వీప్‌లతో స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాలపై ఒత్తిడి పెంచిన అతడు.. ఏడో వికెట్‌కు రెహాన్‌తో కలిసి 64, ఎనిమిదో వికెట్‌కు హార్ట్‌లీతో కలిసి 80 పరుగులు జోడించాడు. 180 రన్స్‌ వద్ద పోప్‌ క్యాచ్‌ను రాహుల్‌ వదిలేశాడు. అయితే డబుల్‌ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో బుమ్రా అద్భుత బంతికి పోప్‌ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. కానీ అప్పటికే జట్టు స్కోరు 420 పరుగులకు.. ఆధిక్యం 230కి చేరింది.

హార్ట్‌లీ దెబ్బకు..: స్పిన్‌ను చక్కగా ఎదుర్కొనే భారత బ్యాటర్లు అరంగేట్ర స్పిన్నర్‌ హార్ట్‌లీకి దాసోహం కావాల్సి వచ్చింది. టాపార్డర్‌ను అతడు కుదురుకోనీయలేదు. యశస్వీ (15), గిల్‌ (0)లను ఒకే ఓవర్‌లో అవుట్‌ చేసిన అతడు.. ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్‌ను ఎల్బీగా పంపాడు. ఐదో నెంబర్‌లో ఆడిన అక్షర్‌ (17), రాహుల్‌ కలిసి నాలుగో వికెట్‌కు 32 రన్స్‌ జోడించారు. టీ బ్రేక్‌ తర్వాత అక్షర్‌ను కూడా హార్ట్‌లీ అవుట్‌ చేసి తొలి నాలుగు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ దశలో రాహుల్‌, శ్రేయాస్‌ (13)పై ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అటు జడేజా (2) అనవసర పరుగుకోసం వెళ్లి స్టోక్స్‌ సూపర్‌త్రోతో రనౌటయ్యాడు.

ఆ ఇద్దరు పోరాడినా..: 119/7 స్కోరుతో జట్టు కష్టాల్లో పడిన వేళ 150 రన్స్‌ కూడా కష్టమే అనిపించింది. కానీ భరత్‌, అశ్విన్‌ గెలుపుపై ఆశలు రేకెత్తించారు. ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. రిస్కీ షాట్లకు వెళ్లకుండా స్పిన్నర్లను 21 ఓవర్లపాటు ఎదుర్కొన్నారు. ఆటను చివరిరోజు వరకు తీసుకెళతారని అనుకున్నా.. మరో రెండు ఓవర్లలో ఆట ముగుస్తుందనగా హార్ట్‌లీ కళ్లుచెదిరే బంతితో భరత్‌ను బౌల్డ్‌ చేశాడు. అలాగే ఆటను మరో అరగంట పొడిగించగా.. హార్ట్‌లీ తర్వాతి ఓవర్‌లో అశ్విన్‌ ముందుకు వచ్చి ఆడాలని చూసి స్టంప్‌ కావడంతో భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో సిరాజ్‌ (12), బుమ్రా (6) పదో వికెట్‌కు 25 రన్స్‌ జోడించి ఓటమి తేడాను తగ్గించారు.

స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 246;

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 436;

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలే (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 31; డకెట్‌ (బి) బుమ్రా 47; పోప్‌ (బి) బుమ్రా 196; రూట్‌ (ఎల్బీ) బుమ్రా 2; బెయిర్‌స్టో (బి) జడేజా 10; స్టోక్స్‌ (బి) అశ్విన్‌ 6; ఫోక్స్‌ (బి) అక్షర్‌ 34; రెహాన్‌ (సి) బుమ్రా 28; హార్ట్‌లీ (బి) అశ్విన్‌ 34; ఉడ్‌ (సి) భరత్‌ (బి) జడేజా 0; లీచ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 32; మొత్తం: 420 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-45, 2-113, 3-117, 4-140, 5-163, 6-275, 7-339, 8-419, 9-420, 10-420. బౌలింగ్‌: బుమ్రా 16.1-4-41-4; అశ్విన్‌ 29-4-126-3; అక్షర్‌ 16-2-74-1; జడేజా 34-1-131-2; సిరాజ్‌ 7-1-22-0.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) హార్ట్‌లీ 39; జైస్వాల్‌ (సి) పోప్‌ (బి) హార్ట్‌లీ 15; గిల్‌ (సి) పోప్‌ (బి) హార్ట్‌లీ 0; రాహుల్‌ (ఎల్బీ) రూట్‌ 22; అక్షర్‌ (సి అండ్‌ బి) హార్ట్‌లీ 17; శ్రేయాస్‌ (సి) రూట్‌ (బి) లీచ్‌ 13; జడేజా (రనౌట్‌) 2; భరత్‌ (బి) హార్ట్‌లీ 28; అశ్విన్‌ (స్టంప్‌) ఫోక్స్‌ (బి) హార్ట్‌లీ 28; బుమ్రా (నాటౌట్‌) 6; సిరాజ్‌ (స్టంప్‌) ఫోక్స్‌ (బి) హార్ట్‌లీ 12; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 202 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-42, 2-42, 3-63, 4-95, 5-107, 6-119, 7-119, 8-176, 9-177, 10-202. బౌలింగ్‌: రూట్‌ 19-3-41-1; ఉడ్‌ 8-1-15-0; హార్ట్‌లీ 26.2-5-62-7; లీచ్‌ 10-1-33-1; రెహాన్‌ 6-0-33-0.

2

తొలి ఇన్నింగ్స్‌లో 190+ ఆధిక్యం సాధించినా భారత్‌ ఓడడం ఇది రెండోసారి.

4

2013 నుంచి స్వదేశంలో భారత్‌ ఆడిన 47 టెస్టుల్లో ఇది నాలుగో ఓటమి.

Updated Date - Jan 29 , 2024 | 06:37 AM