Share News

అంతులేని నిర్వేదం.. అవధుల్లేని ఆనందం

ABN , Publish Date - Jul 31 , 2024 | 06:31 AM

మూడు రోజుల క్రితమే త్రుటిలో చేజారిన పతకం.. చెదిరిన ఒలింపిక్‌ స్వప్నం.. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా తీవ్ర నైరాశ్యం ఆవరిస్తుంది. కానీ, రైతుబిడ్డ సరబ్‌జోత్‌ సింగ్‌ మాత్రం పడిలేచిన కెరటంలా ఎగిశాడు.. మను భాకర్‌తో కలసి పారిస్‌ మెగా క్రీడల్లో దేశానికి రెండో పతకాన్ని

అంతులేని నిర్వేదం.. అవధుల్లేని ఆనందం

మూడు రోజుల క్రితమే త్రుటిలో చేజారిన పతకం.. చెదిరిన ఒలింపిక్‌ స్వప్నం.. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా తీవ్ర నైరాశ్యం ఆవరిస్తుంది. కానీ, రైతుబిడ్డ సరబ్‌జోత్‌ సింగ్‌ మాత్రం పడిలేచిన కెరటంలా ఎగిశాడు.. మను భాకర్‌తో కలసి పారిస్‌ మెగా క్రీడల్లో దేశానికి రెండో పతకాన్ని అందించి సగర్వంగా నిలిచాడు. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే తొలుత అంతులేని నిర్వేదాన్ని..ఆనక ప్రపంచాన్నే జయించానన్న సంతోషాన్ని 22 ఏళ్ల వయసులోనే సింగ్‌ చవిచూశాడు.

ఫుట్‌బాలర్‌ అవుదామని..: హరియాణాలోని అంబాలా సమీపంలో ధేన్‌ గ్రామానికి చెందిన జతీందర్‌ సింగ్‌, హర్దీప్‌ కౌర్‌ దంపతులకు 2001లో సరబ్‌జోత్‌ జన్మించాడు. తండ్రి చిన్న రైతు. సరబ్‌..చిన్నప్పుడు ఫుట్‌బాలర్‌ కావాలనే అనుకొన్నా.. ఏదో గందరగోళంలో ఉండేవాడు. అయితే, 13 ఏళ్ల వయసులో సమ్మర్‌ క్యాంప్‌లో కొందరు పిల్లలు ఎయిర్‌ గన్‌తో షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం చూసి అటువైపు ఆకర్షితుడయ్యాడు. వెంటనే తన తండ్రి వద్దకు వెళ్లి తానూ షూటర్‌నవుతానని చెప్పడంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యాడు. పైగా తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. అయితే, సరబ్‌జోత్‌ పట్టువీడక పోవడంతో కొడుకు కల కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. అమెరికాలో ఉన్న సరబ్‌జోత్‌ తాత కూడా ఆర్థిక తోడ్పాటునందించడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. 2016లో అంబాలోని అభిషేక్‌ రాణా అకాడమీలో శిక్షణ కోసం రోజూ 35 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి వెళ్లేవాడు. కొద్దిరోజుల్లో మెళకువలు నేర్చుకొన్న సింగ్‌.. జాతీయ షూటింగ్‌ పోటీల్లో కాంస్యం సాధించాడు. 2019లో జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో స్వర్ణ పతకంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. కెరీర్‌లో వడివడిగా ఎదిగిన సింగ్‌.. 2021లో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్‌లో పసిడి పతకాలు కొల్లగొట్టాడు. గత ఆసియా క్రీడల్లో టీమ్‌ స్వర్ణంతోపాటు మిక్స్‌డ్‌లో రజతం సాధించాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్‌ పతకంతో మురిశాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - Jul 31 , 2024 | 06:31 AM