సిడ్నీ టెస్టే ఆఖరా?
ABN , Publish Date - Dec 31 , 2024 | 06:12 AM
కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడా? భారత్ కనుక డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకపోతే..బోర్డర్-గవాస్కర్ సిరీ్‌సలో ఆఖరిది, ఐదోది అయిన సిడ్నీ టెస్టు తర్వాత ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలని...

మెల్‌బోర్న్: కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడా? భారత్ కనుక డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకపోతే..బోర్డర్-గవాస్కర్ సిరీ్‌సలో ఆఖరిది, ఐదోది అయిన సిడ్నీ టెస్టు తర్వాత ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలని అతడు దాదాపు నిర్ణయానికి వచ్చేశాడా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. టెస్టు జట్టులో రోహిత్ చోటుపై బోర్డు పెద్దలు, సెలెక్టర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే జట్టు కనుక డబ్ల్యూటీసీ తుది పోరుకు వస్తే తనను జట్టులో కొనసాగించాలని బోర్డు పెద్దలు, సెలెక్టర్లను రోహిత్ కోరనున్నట్టు సమాచారం. కానీప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే..టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు కష్టమే. అందువల్ల జనవరి 3 నుంచి సిడ్నీలో జరిగే ఐదో టెస్టు రోహిత్‌కు చివరిదని తెలుస్తోంది. వాస్తవంగా..స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీ్‌సలో భారత్ 0-3తో చిత్తయినప్పుడే..రోహిత్‌ను కెప్టెన్‌గా తొలగించడంతోపాటు టెస్టు జట్టు నుంచి ఉద్వాసన పలకాలనే డిమాండ్లు గట్టిగా వినిపించాయి.
రోహిత్‌కు సమయం వచ్చేసింది: రవిశాస్త్రి
టెస్టులనుంచి రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. ‘టెస్టుల్లో సుదీర్ఘ కాలంగా రోహిత్ భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. పైగా ఈ ఫార్మాట్‌లో రోహిత్ టెక్నిక్‌కూడా బాగాలేదు. అతడి పాదాల కదలిక వేగంగా లేదు. బంతిని ఎదుర్కోవడంలో ఆలస్యం చేస్తున్నాడు. వీటన్నింటి రీత్యా ఈ సిరీస్ తర్వాత అతను రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోవడం ఉత్తమం’ అని శాస్త్రి అభిప్రాయడ్డాడు.
కోహ్లీ మరో మూడేళ్లు ఆడతాడు: కోహ్లీలో మరో మూడు, నాలుగేళ్లు ఆడే సత్తా ఉందని రవిశాస్త్రి చెప్పాడు. ‘విరాట్ ఎలా అవుటయ్యాడన్నది వదిలేయండి. కానీ అతడిలో ఇంకొంత కాలం క్రికెట్ ఆడే సామర్థ్యం ఉంది’ అని చెప్పుకొచ్చాడు.