Share News

Sania Mirza : సానియాతో బంధానికి స్వస్తి

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:12 AM

భారత మాజీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ విడిపోయారన్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. పాక్‌కు చెందిన ప్రముఖ నటి సనా జావెద్‌ను వివాహం

Sania Mirza : సానియాతో బంధానికి స్వస్తి

షోయబ్‌కు మళ్లీ పెళ్లి

నటి సనాతో పాక్‌ మాజీ కెప్టెన్‌ వివాహం

కరాచీ/న్యూఢిల్లీ: భారత మాజీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ విడిపోయారన్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. పాక్‌కు చెందిన ప్రముఖ నటి సనా జావెద్‌ను వివాహం చేసుకున్నట్టు 41 ఏళ్ల షోయబ్‌ శనివారం వెల్లడించాడు. సామాజిక మాధ్యమాల్లో సనాతో తన పెళ్లి ఫొటోను అతడు పోస్ట్‌ చేశాడు. 2010లో పెళ్లితో ఒక్కటైన సానియా, మాలిక్‌ మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయని..దాంతో వారిద్దరూ విడిపోయారని 2022 నుంచి వార్తలు వస్తున్నాయి. రెండేళ్లుగా సానియా, మాలిక్‌ జంటగా కనిపించిన సందర్భాలూ లేవు. అయితే, గతేడాది అక్టోబరు 30న తమ కుమారుడు ఇజాన్‌ ఐదో బర్త్‌డేను సానియా, షోయబ్‌ దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకకు హాజరైనా ఇద్దరూ విడివిడిగా కుమారునితో కలిసున్న ఫొటోలను పోస్ట్‌ చేయడం గమనార్హం. పెళ్లి తర్వాత కొంతకాలం సానియా, షోయబ్‌ దుబాయ్‌లో నివసించారు. ఇక.. సానియా, షోయబ్‌ విడాకులు తీసుకోవడంపై ఇరువర్గాల నుంచి ఇన్నిరోజులు ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, దీనిపై సానియా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా తాజాగా స్పందించారట. ‘ఖులా’ (ఇస్లామిక్‌ షరియా చట్టాల ప్రకారం) పద్ధతిలో సానియా విడాకులు తీసుకుందని ఇమ్రాన్‌ వెల్లడించారని మీడియాలో వార్తలు వచ్చాయి. మాలిక్‌కిది మూడో వివాహం కాగా, 30 ఏళ్ల సనాకిది రెండో పెళ్లి. 2020లో పాక్‌ గాయకుడు ఉమర్‌ జైస్వాల్‌ను వివాహమాడిన సనా.. గతేడాదే అతడితో విడిపోయింది. సానియా కంటే ముందు హైదరాబాద్‌ యువతి ఆయేషాను 2002లో పెళ్లి చేసుకున్న షోయబ్‌, ఆ తర్వాత ఆమెతో విడిపోయాడు.

వేదనాభరిత పోస్ట్‌..: ‘మనకు అశాంతిని కలిగించే విషయాన్ని వదిలేయాల్సిందే’ అనే వ్యాఖ్యను అద్దం ఎదుట కళ్లుమూసుకొని తాను నిలుచుని ఉన్న ఫొటోను వారం కిందట 37 ఏళ్ల సానియా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడం..ఆమెలో వేదనకు అద్దం పట్టింది. ‘పెళ్లి కష్టం..విడాకులు కష్టం. జీవితం మనం అనుకున్నంత సులువు కాదు. నేనూ చాలా కష్టాలు ఎదుర్కొన్నా. మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. అయితే ఆ విషయంలో తెలివిగా వ్యవహరించాలి’ అని రెండు రోజుల కిందట సానియా చేసిన సుదీర్ఘ పోస్ట్‌ షోయబ్‌తో తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పరోక్షంగా ఏకరువు పెట్టినట్టయిందన్న కామెంట్లు వినిపించాయి.

Updated Date - Jan 21 , 2024 | 05:12 AM