Share News

దూబే దూకుడు

ABN , Publish Date - Jan 12 , 2024 | 02:11 AM

అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీ్‌సలో భారత్‌ శుభారంభం చేసింది. టీ20 ప్రపంచక్‌పలో చోటు ఆశిస్తున్న శివమ్‌ దూబే (40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 నాటౌట్‌) బ్యాట్‌తోనూ...

దూబే దూకుడు

తొలి టీ20

భారత్‌దే బోణీ

6 వికెట్లతో అఫ్ఘాన్‌పై విజయం

మొహాలీ: అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీ్‌సలో భారత్‌ శుభారంభం చేసింది. టీ20 ప్రపంచక్‌పలో చోటు ఆశిస్తున్న శివమ్‌ దూబే (40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 నాటౌట్‌) బ్యాట్‌తోనూ, బంతి (2-0-9-1)తోనూ అదరగొట్టాడు. దీంతో గురువారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అలాగే సిరీ్‌సలో 1-0తో ఆధిక్యం సాధించింది. రెండో మ్యాచ్‌ ఆదివారం ఇండోర్‌లో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. నబీ (27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42), అజ్మతుల్లా (29) రాణించారు. అక్షర్‌, ముకేశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. జితేశ్‌ (31), తిలక్‌ (26), గిల్‌ (23) ఆకట్టుకున్నారు. ముజీబుర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా శివమ్‌ దూబే నిలిచాడు.

చెలరేగిన శివమ్‌: ఓ మాదిరి ఛేదనలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ శివమ్‌ దూబే సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చక్కటి భాగస్వామ్యాలతో జట్టును విజయం దిశగా నడిపాడు. అయితే 14 నెలల బ్రేక్‌ తర్వాత టీ20 ఆడిన కెప్టెన్‌ రోహిత్‌ ఖాతా తెరవకుండా ఇన్నింగ్స్‌ రెండో బంతికే రనౌటయ్యాడు. నాన్‌స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న గిల్‌ (23).. కెప్టెన్‌ పిలుపును పట్టించుకోకుండా బంతి వైపే చూస్తుండిపోయాడు. ఈలోగా రోహిత్‌ మరో ఎండ్‌కు చేరడంతో త్రో అందుకున్న కీపర్‌ గుర్బాజ్‌ వికెట్లను గిరాటేశాడు. అయితే గిల్‌ ఆ తర్వాత ధాటిగా ఆడి ఐదు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. మరోసారి భారీ షాట్‌కు వెళ్లి నాలుగో ఓవర్‌లో స్టంపౌట్‌ అయ్యాడు. పవర్‌ప్లేలో 36 పరుగులే చేసినా.. శివమ్‌ దూబే మెరుపు ఇన్నింగ్స్‌తో మూడు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తిలక్‌తో కలిసి మూడో వికెట్‌కు 44, జితేశ్‌తో నాలుగో వికెట్‌కు 45 పరుగులు జత చేశాడు. 14వ ఓవర్‌లో ముజీబ్‌ బంతికి జితేశ్‌ అవుటయ్యాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన దూబే 18వ ఓవర్‌లో వరుసగా 6,4 బాదేసి మ్యాచ్‌ను ముగించాడు. అప్పటికి ఐదో వికెట్‌కు దూబే అజేయంగా రింకూతో కలిసి 42 పరుగులు జత చేయడం విశేషం.

నబీ జోరుతో..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ జట్టు తమ ఇన్నింగ్స్‌ను ఆత్మవిశ్వాసంతోనే ఆరంభించింది. తొలి పది ఓవర్లలో 57 పరుగులే చేసినా.. ఆ తర్వాత గేరు మార్చి ఏకంగా 101 పరుగులు రాబట్టింది. టాపార్డర్‌లో గుర్బాజ్‌, జద్రాన్‌, ఒమర్జాయ్‌ భారత బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నారు. మిడిలార్డర్‌లో వెటరన్‌ నబీ అదరగొట్టాడు. దీనికితోడు డెత్‌ ఓవర్లలో బౌండరీల రూపంలో ధారాళంగా పరుగులు రావడంతో అఫ్ఘాన్‌ సునాయాసంగా 150 దాటేసింది. పేసర్‌ అర్ష్‌దీప్‌, దూబే మాత్రం కట్టడి చేయగలిగారు. ఓపెనర్లు గుర్బాజ్‌, జద్రాన్‌ క్రీజులో నిలదొక్కుకుంటూ తొలి వికెట్‌కు 50 పరుగులు జత చేసి వరుస ఓవర్లలో వెనుదిరిగారు. అనంతరం అరంగేట్ర బ్యాటర్‌ రహ్మత్‌ షా (3) విఫలం కావడంతో టపటపా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో నబీ, ఒమర్జాయ్‌ జట్టును ఆదుకున్నారు. 15వ ఓవర్‌లో ఒమర్జాయ్‌ సిక్సర్‌, నబీ రెండు ఫోర్లు, తర్వాతి ఓవర్‌లో నబీ రెండు సిక్సర్లతో స్కోరులో వేగం పెరిగింది. అయితే 18వ ఓవర్‌లో ముకేశ్‌ ఈ ఇద్దరినీ అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా చివరి రెండు ఓవర్లలో నజీబుల్లా (19 నాటౌట్‌), జనత్‌ (9 నాటౌట్‌)ల తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో 28 పరుగులు రాబట్టింది.

స్కోరుబోర్డు

అఫ్ఘాన్‌: గుర్బాజ్‌ (స్టంప్‌) జితేశ్‌ (బి) అక్షర్‌ 23; ఇబ్రహీం జద్రాన్‌ (సి) రోహిత్‌ (బి) దూబే 25; ఒమర్జాయ్‌ (బి) ముకేశ్‌ 29; రహ్మత్‌ షా (బి) అక్షర్‌ 3; నబీ (సి) రింకూ (బి) ముకేశ్‌ 42; నజీబుల్లా (నాటౌట్‌) 19; జనత్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 158/5. వికెట్ల పతనం: 1-50, 2-50, 3-57, 4-125, 5-130; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-1-28-0; ముకేశ్‌ 4-0-33-2; అక్షర్‌ 4-0-23-2; సుందర్‌ 3-0-27-0; దూబే 2-0-9-1; బిష్ణోయ్‌ 3-0-35-0.

భారత్‌: రోహిత్‌ (రనౌట్‌) 0; గిల్‌ (స్టంప్‌) గుర్బాజ్‌ (బి) ముజీబుర్‌ 23; తిలక్‌ వర్మ (సి) గుల్బదిన్‌ (బి) ఒమర్జాయ్‌ 26; దూబే (నాటౌట్‌) 60; జితేశ్‌ (సి) ఇబ్రహీం (బి) ముజీబుర్‌ 31; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 16, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 17.3 ఓవర్లలో 159/4. వికెట్ల పతనం: 1-0, 2-28, 3-72, 4-117; బౌలింగ్‌: ఫరూఖి 3-0-26-0; ముజీబుర్‌ 4-1-21-2; నబీ 2-0-24-0; నవీనుల్‌ 3.3-0-43-0; ఒమర్జాయ్‌ 4-0-33-1; నబీ 1-0-12-0.

1

భారత్‌పై టీ20ల్లో తమ అత్యధిక స్కోరు (158/5) సాధించిన అఫ్ఘాన్‌

Updated Date - Jan 12 , 2024 | 02:11 AM