Share News

జట్టు బస్సులో మద్యం తాగుతూ..

ABN , Publish Date - Feb 17 , 2024 | 05:00 AM

టీమ్‌ బస్సులో మద్యం సేవించాడన్న ఆరోపణలతో హైదరాబాద్‌ మహిళల క్రికెట్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ విద్యుత్‌ జయసింహపై వేటు పడింది. మద్యం తాగుతున్న వీడియోలు శుక్రవారం వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా

జట్టు బస్సులో మద్యం తాగుతూ..

హైదరాబాద్‌ మహిళల కోచ్‌ విద్యుత్‌ జయసింహ నిర్వాకం

వేటు వేసిన హెచ్‌సీఏ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టీమ్‌ బస్సులో మద్యం సేవించాడన్న ఆరోపణలతో హైదరాబాద్‌ మహిళల క్రికెట్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ విద్యుత్‌ జయసింహపై వేటు పడింది. మద్యం తాగుతున్న వీడియోలు శుక్రవారం వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవడంతో జయసింహను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు జయసింహ హెచ్‌సీఏ క్రికెట్‌ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఉత్తర్వుల్లో జగన్‌ పేర్కొన్నారు. విద్యుత్‌, దిగ్గజ క్రికెటర్‌ ఎంఎల్‌ జయసింహ కుమారుడు. ప్రస్తుతం నెట్‌లో చక్కర్లు కొడుతున్న కోచ్‌ వీడియో గతనెలలో తీసినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలోనే కొందరు క్రికెటర్లు హెచ్‌సీఏలోని ఒక కీలక వ్యక్తి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, ఆయన కార్యాలయంలోనే సమావేశం నిర్వహించి క్రికెటర్లకు సర్దిచెప్పినట్టు సమాచారం. కానీ, కోచ్‌ చర్యలను తీవ్రంగా పరిగణించిన కొందరు మహిళా క్రికెటర్లు ఈనెల 15న మరోసారి హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులకు ఫిర్యాదు చేయడం, మీడియాను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా క్రికెటర్లతో హెచ్‌సీఏ సభ్యులు మాట్లాడుతున్నారని, సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేసి చర్యలు తీసుకుంటామని జగన్‌ చెప్పారు. ఇక, జయసింహపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చినట్టు హెచ్‌సీఏ సభ్యుడు వంకా ప్రతాప్‌ తెలిపారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను కోచ్‌ విద్యుత్‌ ఖండించాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ క్రికెటర్‌ కుమార్తెను జట్టులోకి తీసుకోవడానికి తాను నిరాకరించడంతోనే తనపై ఇలా కుట్రపూరితంగా వ్యవహరించాడని అతను అన్నాడు.

Updated Date - Feb 17 , 2024 | 05:00 AM