Share News

దీప్తి ప్రపంచ రికార్డు

ABN , Publish Date - May 21 , 2024 | 01:23 AM

తెలుగమ్మాయి జీవాంజి దీప్తి విశ్వ వేదికపై సంచలన ప్రదర్శనతో మెరిసింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో రికార్డుతో స్వర్ణ పతకం కొల్లగొట్టింది. సోమవారం ఇక్కడ జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్‌ విభాగం రేసును...

దీప్తి ప్రపంచ రికార్డు

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో స్వర్ణం కైవసం

పారిస్‌ పారాలింపిక్స్‌కు అర్హత

కోబ్‌ (జపాన్‌): తెలుగమ్మాయి జీవాంజి దీప్తి విశ్వ వేదికపై సంచలన ప్రదర్శనతో మెరిసింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో రికార్డుతో స్వర్ణ పతకం కొల్లగొట్టింది. సోమవారం ఇక్కడ జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్‌ విభాగం రేసును దీప్తి 55.07 సెకన్లలో పూర్తి చేసి చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో గతేడాది అమెరికా అథ్లెట్‌ బ్రిన్నా క్లార్క్‌ నెలకొల్పిన ప్రపంచ రికార్డు (55.12 సె.)ను దీప్తి బద్దలుకొట్టింది. ఐసెల్‌ ఒండర్‌ (టర్కీ-55.19)కు రజతం, లిజాంషెలా అంగులో (ఈక్వెడార్‌- 56.68 సె)కు కాంస్య పతకాలు దక్కాయి. అంతకుముందు రోజు దీప్తి హీట్స్‌లో 56.18 సెకన్లతో ఆసియా రికార్డు టైమింగ్‌ను నమోదుచేసి ఫైనల్స్‌కు క్వాలిఫై అయింది. ఈ టోర్నీలో విజయంతో దీప్తి త్వరలో జరిగే పారిస్‌ పారాలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది.


ఇక, ఇదే టోర్నీలో భారత్‌కే చెందిన యోగేష్‌ కథునియా ఎఫ్‌56 కేటగిరీ డిస్కస్‌ త్రోలో రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఈ పోటీల్లో భారత్‌ ఇప్పటివరకు ఒక స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలు సహా మొత్తం 4 పతకాలు సాధించింది.

Updated Date - May 21 , 2024 | 01:23 AM