ఢిల్లీ అలవోకగా..
ABN , Publish Date - Mar 06 , 2024 | 06:10 AM
డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 నాటౌట్)...

జెమీమా, లానింగ్ హాఫ్ సెంచరీలు
29 పరుగులతో ముంబై చిత్తు
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ:
20 ఓవర్లలో 192/4 (జెమీమా 69 నాటౌట్, లానింగ్ 53; షబ్నిం 1/46, పూజ 1/20).
ముంబై:
20 ఓవర్లలో 163/8 (అమన్‌జోత్ 42; జొనాసెన్ 3/21, కాప్ 2/37).
నేటి మ్యాచ్
గుజరాత్ X బెంగళూరు రాత్రి 7.30 గం. నుంచి
డబ్ల్యూపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా షబ్నిం రికార్డులకెక్కింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో మూడో ఓవర్ రెండో బంతిని ఆమె గంటకు 132.1 కిమీ వేగంతో విసిరింది. ఈ బంతిని లానింగ్ ఆడలేక పోయింది.
న్యూఢిల్లీ: డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (33 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 నాటౌట్), లానింగ్ (38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) అర్ధ శతకాలతో.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఆరంభ మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి ఢిల్లీ అంచెలో క్యాపిటల్స్ బదులు తీర్చుకొంది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. షబ్నిం పూజ, హేలీ, ఇషాక్ తలో వికెట్ పడగొట్టారు. లక్ష్య ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన ముంబై 163/8 స్కోరుకే పరిమితమైంది. పేసర్ మరిజానె కాప్ (2/37) దెబ్బకు ముంబై ఘోరంగా తడబడింది. ఓపెనర్ యాస్తిక (6)తోపాటు హర్మన్‌ప్రీత్ (6)ను కాప్ అవుట్ చేయగా.. బ్రంట్ (5)ను శిఖ వెనక్కిపంపింది. ఈ దశలో మాథ్యూస్, అమెలియా కెర్ (17) నాలుగో వికెట్‌కు 25 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, హేలీని జొనాసెన్ (3/21) క్యాచవుట్ చేయడంతో హర్మన్‌సేన మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకొంది. అమన్‌జోత్ (42), సజన (24 నాటౌట్) కొంతసేపు పోరాడినా.. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు.
బాదేసిన జెమీమా
డెత్ ఓవర్లలో జెమీమా ఎడాపెడా షాట్లతో విరుచుకుపడడంతో.. ఢిల్లీ భారీ స్కోరు చేసింది. జొనాసెన్ (4 నాటౌట్)తో కలసి ఐదో వికెట్‌కు 16 బంతుల్లో అభేద్యంగా 41 పరుగులు జోడించిన రోడ్రిగ్స్.. టీమ్ స్కోరును 190 మార్క్ దాటించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్‌ను లానింగ్ ముందుండి నడిపించింది. షఫాలీ (28)తో కలసి తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించిన లానింగ్.. క్యాప్సీ (19), జెమీమాలతో రెండో, మూడు వికెట్లకు 31, 35 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పింది. బౌండ్రీతో ఫిఫ్టీ పూర్తి చేసిన లానింగ్‌ను పూజ క్యాచవుట్ చేసింది. అయితే, చివరి 5 ఓవర్లలో జెమీమా సూపర్ షోతో.. ముంబై 69 పరుగులు సమర్పించుకొంది.