Share News

వర్షం లేకపోయినా మూడో రోజూ రద్దు

ABN , Publish Date - Sep 30 , 2024 | 05:32 AM

భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వరుసగా రెండో రోజు కూడా ఒక్క బంతీ పడలేదు. శుక్రవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడం గమనార్హం...

వర్షం లేకపోయినా మూడో రోజూ రద్దు

చిత్తడిగా మైదానం

భారత్‌-బంగ్లాదేశ్‌ రెండో టెస్టు

కాన్పూర్‌: భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వరుసగా రెండో రోజు కూడా ఒక్క బంతీ పడలేదు. శుక్రవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కావడం గమనార్హం. శనివారం వర్షం కారణంగా ఆట వీలుపడకపోగా.. ఆదివారం మాత్రం వరుణుడి నుంచి ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. అయినా అంపైర్లు ఆట ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. దీనికి కారణం.. శనివారం రాత్రి కురిసిన వర్షానికి గ్రీన్‌పార్క్‌ మైదానం పూర్తి చిత్తడిగా మారడమే. వాస్తవానికి ఆదివారం ఉదయం నుంచీ వర్షం లేకపోవడంతో కాస్త ఆలస్యంగానైనా ఆట ప్రారంభమవుతుందని అభిమానులు ఆశించారు. కానీ అవుట్‌ ఫీల్డ్‌ అంతా నీటితో బురదమయంగా మారింది. ఉదయం 10, 12తో పాటు మధ్యాహ్నం 2 గంటలకు కూడా అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. అప్పటికి కవర్లు కూడా తీసేశారు. చివర్లో కాస్త ఎండ కూడా వచ్చింది. అయినా ఆట కొనసాగితే ఆటగాళ్లు జారిపడే అవకాశం ఉందని అంపైర్లు భావించారు.


పెవిలియన్‌ దగ్గర ప్యాచ్‌లు ఉండడంతో మ్యాచ్‌ రెఫరీ జెఫ్‌ క్రో అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో 2 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం తొలి రోజు మ్యాచ్‌ కూడా ఆలస్యంగా ఆరంభమై రెండో సెషన్‌ ప్రారంభంలోనే ముగిసింది. అప్పటికి బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. మరోవైపు మ్యాచ్‌ చివరి రెండు రోజులు వాతావరణం అనుకూలించే అవకాశం కనిపిస్తోంది.


బీసీసీఐపై అభిమానుల అసంతృప్తి

దాదాపు ఎనిమిది సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయిన ఈ రెండో టెస్టు డ్రా కావడం తథ్యమే. అయితే గ్రీన్‌పార్క్‌ మైదానం నిర్వహణ తీరుపై సోషల్‌ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై బీసీసీఐని నిలదీశారు. వర్షం లేకపోయినా ఆట రద్దు కావడం దారుణమని, స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదంటూ.. ప్రపంచంలోనే సంపన్న క్రికెట్‌ బోర్డు డబ్బంతా ఏమైపోతున్నదని ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌ తీరు బోర్డుకు గుణపాఠం లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అంపైర్లు మూడుసార్లు పిచ్‌ను పరిశీలించినా.. ఎక్కడ సమస్య ఉందో తమతో చర్చించలేదని క్యూరేటర్‌ శివ్‌ కుమార్‌ తెలిపాడు.

Updated Date - Sep 30 , 2024 | 05:32 AM