Share News

జోరుకు బ్రేక్‌

ABN , Publish Date - Apr 01 , 2024 | 01:22 AM

గత మ్యాచ్‌లో భారీ హిట్టింగ్‌తో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదే జోరును కొనసాగించ లేకపోయింది. బంతితో మోహిత్‌ శర్మ (3/25), బ్యాట్‌తో మిల్లర్‌ (27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44నాటౌట్‌) చెలరేగడంతో..

జోరుకు బ్రేక్‌

  • సన్‌రైజర్స్‌ తడ‘బ్యాటు’

  • 7 వికెట్లతో గుజరాత్‌ గెలుపు

  • మోహిత్‌, మిల్లర్‌ విజృంభణ

అహ్మదాబాద్‌: గత మ్యాచ్‌లో భారీ హిట్టింగ్‌తో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదే జోరును కొనసాగించ లేకపోయింది. బంతితో మోహిత్‌ శర్మ (3/25), బ్యాట్‌తో మిల్లర్‌ (27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44నాటౌట్‌) చెలరేగడంతో..ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 7 వికెట్లతో సన్‌రైజర్స్‌పై గెలిచింది. తొలుత హైదరాబాద్‌ 20 ఓవర్లలో 162/8 స్కోరు చేసింది. అబ్దుల్‌ సమద్‌ (29), అభిషేక్‌ శర్మ (29), క్లాసెన్‌ (24) ఫర్వాలేదనిపించారు. రషీద్‌, నూర్‌, ఒమర్జాయ్‌లకు తలో వికెట్‌ దక్కింది. లక్ష్యాన్ని గుజరాత్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాయి సుదర్శన్‌ (45), గిల్‌ (36) రాణించారు. మోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.

సునాయాసంగా..: ఛేదనలో మిల్లర్‌ ఫటాఫట్‌ ఆటతో గుజరాత్‌ అలవోకగా నెగ్గింది. ఓపెనర్లు సాహా (25), గిల్‌ తొలి వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యంతో టైటాన్స్‌కు చక్కని ఆరంభాన్నిచ్చారు. అయితే, 2 సిక్స్‌లతో జోరు చూసిన సాహాను షాబాజ్‌ బౌల్డ్‌ చేయడంతో.. పవర్‌ప్లే ముగిసేసరికి టైటాన్స్‌ 52/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఆ తర్వాత గిల్‌, సుదర్శన్‌ స్కోరు బోర్డును నడిపిచారు. 10వ ఓవర్‌లో గిల్‌ను మార్కండే అవుట్‌ చేయడంతో.. క్రీజులోకి వచ్చిన మిల్లర్‌ పవర్‌ బ్యాటింగ్‌తో హైదరాబాద్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 16వ ఓవర్‌లో మార్కండే బౌలింగ్‌లో మిల్లర్‌ 4,4,6,6తో ఏకంగా 24 పరుగులు రాబట్టడంతో.. గుజరాత్‌ 138/2తో విజయానికి చేరువైంది. చివరి 24 బంతుల్లో 25 రన్స్‌ అవసరమవగా, సుదర్శన్‌ను కమిన్స్‌ క్యాచవుట్‌ చేశాడు. కానీ, మిల్లర్‌.. 5 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు.

కట్టడి చేసిన నూర్‌, రషీద్‌: గతమ్యాచ్‌లో ముంబైపై 277 పరుగుల భారీస్కోరు చేసి ఔరా అనిపించిన హైదరాబాద్‌ బ్యాటర్లు.. ఈసారి గుజరాత్‌ బౌలర్ల దెబ్బకు తడబడ్డారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకొన్న సన్‌రైజర్స్‌.. ఓపెనర్లు హెడ్‌ (19), మయాంక్‌ అగర్వాల్‌ (16)లను స్వల్ప స్కోరుకే కోల్పోయింది. కానీ, వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ 2 సిక్స్‌లతో ఎదురుదాడి చేయడంతో.. పవర్‌ప్లేలో హైదరాబాద్‌ 56/1తో భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే, మధ్య ఓవర్లలో రషీద్‌, నూర్‌ పరుగులను కట్టడి చేస్తూ రైజర్స్‌పై ఒత్తిడిపెంచారు. హెడ్‌ను నూర్‌ బౌల్డ్‌ చేయగా.. ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్న అభిషేక్‌ను మోహిత్‌ క్యాచవుట్‌ చేశాడు. దీంతో 10 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 74/3తో నిలిచింది. డేంజర్‌మన్‌ క్లాసెన్‌ను రషీద్‌ బోల్తా కొట్టించడంతో సన్‌రైజర్స్‌ ఇబ్బందుల్లో పడింది. సమద్‌ ఎదురుదాడి చేసినా.. మార్‌క్రమ్‌ (17)తోపాటు మిగిలిన వారు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.

స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: హెడ్‌ (బి) నూర్‌ 19, మయాంక్‌ అగర్వాల్‌ (సి) దర్శన్‌ (బి) అజ్మతుల్లా 16, అభిషేక్‌ (సి) గిల్‌ (బి) మోహిత్‌ 29, మార్‌క్రమ్‌ (సి) రషీద్‌ (బి) ఉమేష్‌ 17, క్లాసెన్‌ (బి) రషీద్‌ 24, షాబాజ్‌ (సి) తెవాటియా (బి) మోహిత్‌ 22, సమద్‌ (రనౌట్‌) 29, వాషింగ్టన్‌ (సి) రషీద్‌ (బి) మోహిత్‌ 0, కమిన్స్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 162/8; వికెట్ల పతనం: 1-34, 2-58, 3-74, 4-108, 5-114, 6-159, 7-159, 8-162; బౌలింగ్‌: అజ్మతుల్లా 3-0-24-1, ఉమేశ్‌ 3-0-28-1, రషీద్‌ 4-0-33-1, నూర్‌ అహ్మద్‌ 4-0-32-1, మోహిత్‌ 4-0-25-3, దర్శన్‌ 2-0-18-0.

గుజరాత్‌: సాహా (సి) కమిన్స్‌ (బి) షాబాజ్‌ 25, గిల్‌ (సి) సమద్‌ (బి) మార్కండే 36, సుదర్శన్‌ (సి) అభిషేక్‌ (బి) కమిన్స్‌ 45, మిల్లర్‌ (నాటౌట్‌) 44, విజయ్‌ శంకర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.1 ఓవర్లలో 168/3; వికెట్ల పతనం: 1-36, 2-74, 3-138; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-27-0, షాబాజ్‌ 2-0-20-1, ఉనాద్కట్‌ 3.1-0-33-0, వాషింగ్టన్‌ 3-0-27-0, మార్కండే 3-0-33-1, కమిన్స్‌ 4-0-28-1.

Updated Date - Apr 01 , 2024 | 01:22 AM