Share News

బోణీ కొట్టిన పాక్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:43 AM

గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో డీలాపడ్డ పాకిస్థాన్‌.. టీ20 వరల్డ్‌క్‌పలో ఎట్టకేలకు బోణీ చేసింది. గ్రూప్‌-ఎలో మంగళవారం పసికూన కెనడాతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. కెనడా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని...

బోణీ కొట్టిన పాక్‌

  • రిజ్వాన్‌ అర్ధ శతకం

  • 7 వికెట్లతో కెనడా చిత్తు

  • జాన్సన్‌ పోరాటం వృథా

న్యూయార్క్‌: గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో డీలాపడ్డ పాకిస్థాన్‌.. టీ20 వరల్డ్‌క్‌పలో ఎట్టకేలకు బోణీ చేసింది. గ్రూప్‌-ఎలో మంగళవారం పసికూన కెనడాతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. కెనడా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రిజ్వాన్‌ (53 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 53 నాటౌట్‌), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (33) రెండో వికెట్‌కు 62 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. పాక్‌ ఛేదనలో ఓపెనర్లు రిజ్వాన్‌, సైమ్‌ ఆయుబ్‌ (6) ఆరంభం నుంచి ఆచితూచి ఆడడంతో పవర్‌ప్లే పేలవంగా సాగింది. ఐదో ఓవర్‌లో ఆయుబ్‌ను డిలాన్‌ క్యాచవుట్‌ చేసి దెబ్బకొట్టాడు. కాగా, ఆరో ఓవర్‌లో రిజ్వాన్‌ తొలి బౌండ్రీ సాధించడంతో.. పవర్‌ప్లేలో పాక్‌ 28/1 స్కోరు చేసింది. ఎక్కువగా స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించిన బాబర్‌.. 10వ ఓవర్‌లో జునైద్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో మ్యాచ్‌లో ఊపుతెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, విజయానికి 32 బంతుల్లో 24 పరుగులు కావాల్సి ఉండగా.. బాబర్‌ను డిలాన్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఫఖర్‌ జమాన్‌ (4)ను గోర్డన్‌ వెనక్కిపంపాడు. కానీ, తుదికంటా క్రీజులో నిలిచిన రిజ్వాన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. పాక్‌ మరో 15 బంతులు మిగిలుండగానే నెగ్గింది. అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 106/7 స్కోరు చేసింది.


ఓపెనర్‌ ఆరన్‌ జాన్సన్‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) అర్ధ శతకంతో పోరాడినా.. మిగతా వారి నుంచి అతడికి కనీస సహకారం కరువైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆమెర్‌, రౌఫ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో విజయంతో సూపర్‌-8 అవకాశాలను పాక్‌ సజీవంగా నిలబెట్టుకొంది.

సంక్షిప్త స్కోర్లు

కెనడా: 20 ఓవర్లలో 106/7 (జాన్సన్‌ 52; ఆమెర్‌ 2/13, రౌఫ్‌ 2/26).

పాకిస్థాన్‌: 17.3 ఓవర్లలో 107/3 (రిజ్వాన్‌ 53 నాటౌట్‌, బాబర్‌ 33; డిలాన్‌ 2/18).

Updated Date - Jun 12 , 2024 | 02:43 AM