Share News

ఆసీస్‌ ఆల్‌రౌండ్‌షో

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:10 AM

తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళల జట్టు ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచింది. అటు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణించిన ఆస్ట్రేలియా జట్టు...

ఆసీస్‌ ఆల్‌రౌండ్‌షో

సిరీస్‌ ఆశలు సజీవం

రెండో టీ20లో భారత్‌ ఓటమి

ముంబై: తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళల జట్టు ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచింది. అటు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణించిన ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌లో సజీవంగా నిలిచింది. దీంతో ఇక్కడే సిరీస్‌ పట్టేద్దామనుకున్న భారత ఆశలకు బ్రేక్‌ పడినట్టయింది. ఇరు జట్ల మధ్య నిర్ణాయక మ్యాచ్‌ మంగళవారం జరుగనుంది. కెరీర్‌లో 300వ మ్యాచ్‌ ఆడిన ఎలిస్‌ పెర్రీ (34 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. దీప్తి శర్మ (30), రిచా ఘోష్‌ (23), స్మృతి మంధాన (23) మాత్రమే ఓ మాదిరిగా ఆడారు. వేర్‌హమ్‌, సదర్లాండ్‌, గార్త్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఆసీస్‌ 19 ఓవర్లలో 4 వికెట్లకు 133 పరుగులు చేసి నెగ్గింది. హీలీ (26), మూనీ (20) ఆకట్టుకున్నారు. దీప్తికి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కిమ్‌ గార్త్‌ నిలిచింది.

పెర్రీ జోరు: ఆసీస్‌ ఓపెనర్లు హీలీ, మూనీ 51 పరుగులు జోడించి గెలుపు బాటలు వేశారు. ఈ ఇద్దరినీ వరుస ఓవర్లలో దీప్తి శర్మ అవుట్‌ చేసినా ఆసీస్‌ ఇబ్బందిపడలేదు. ఎలిస్‌ పెర్రీ చివరికంటా నిలిచి ఎడాపెడా బౌండరీలతో జోరు ప్రదర్శించింది.

ఆరంభం నుంచే వికెట్ల పతనం: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్క బ్యాటర్‌ నుంచి కూడా అద్భుత ప్రదర్శన కనిపించలేదు. మిడిలార్డర్‌లో రిచా శర్మ, దీప్తి శర్మ మాత్రం కాస్త ఆదుకునే ప్రయత్నం చేశారు.

1

అంతర్జాతీయ క్రికెట్‌లో 300 మ్యాచ్‌లాడిన తొలి ఆసీస్‌ మహిళా క్రికెటర్‌గా ఎలిస్‌ పెర్రీ. ఓవరాల్‌గా మిథాలీ, షార్లెట్‌ ఎడ్వర్డ్స్‌, సుజీ బేట్స్‌ ఈ ఫీట్‌ సాధించారు.

Updated Date - Jan 08 , 2024 | 01:10 AM