Share News

కోల్‌కతా అవలీలగా..

ABN , Publish Date - Apr 30 , 2024 | 02:42 AM

ఈడెన్‌ గార్డెన్స్‌లో చివరి ఆరు మ్యాచ్‌ల్లోనూ 200కు పైగా స్కోర్లు నమోదు కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ చేసింది కేవలం 153 పరుగులే. దీంతో ఈ సునాయాస లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అవలీలగా ఛేదించింది...

కోల్‌కతా అవలీలగా..

నేటి మ్యాచ్‌

లఖ్‌నవూ X ముంబై రాత్రి,7.30 గం. వేదిక: లఖ్‌నవూ

ఫిల్‌ సాల్ట్‌ మెరుపు అర్ధ శతకం

7 వికెట్లతో ఢిల్లీ చిత్తు

వరుణ్‌కు మూడు వికెట్లు

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌లో చివరి ఆరు మ్యాచ్‌ల్లోనూ 200కు పైగా స్కోర్లు నమోదు కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ చేసింది కేవలం 153 పరుగులే. దీంతో ఈ సునాయాస లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అవలీలగా ఛేదించింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో పవర్‌ప్లేలోనే సగానికి పైగా రన్స్‌ అందించాడు. ఫలితంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. దీంతో 12 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచిన కోల్‌కతా ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. కుల్దీప్‌ యాదవ్‌ (26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35 నాటౌట్‌), పంత్‌ (20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 27) మాత్రమే రాణించారు. వరుణ్‌ చక్రవర్తికి మూడు.. హర్షిత్‌, వైభవ్‌ అరోరాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ ఛేదనలో కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. శ్రేయాస్‌ (23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33 నాటౌట్‌), వెంకటేశ్‌ అయ్యర్‌ (23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. అక్షర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా వరుణ్‌ చక్రవర్తి నిలిచాడు.


సాల్ట్‌ జోరు: కోల్‌కతా ఓపెనర్‌ సాల్ట్‌ ఎప్పటిలాగే తన ధాటిని కొనసాగిస్తూ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌నే సంచలన రీతిలో ఆరంభించాడు. విలియమ్స్‌ వేసిన ఈ ఓవర్‌లో అతడు 4,6,4,4తో 23 రన్స్‌ రాబట్టడంతో ఢిల్లీ ఓటమి ఖాయమనిపిం చింది. రెండో ఓవర్‌లోనే సాల్ట్‌ అవుటవ్వాల్సి ఉన్నా మిడాన్‌లో విలియమ్స్‌ క్యాచ్‌ వదిలేశాడు. ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ మూడో ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లు బాదిన సాల్ట్‌.. ఆరో ఓవర్‌లో 4,6,4,4తో 26 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. ఈ బాదుడుకు కేకేఆర్‌ పవర్‌ప్లేలో 79 పరుగులతో నిలిచింది. అనంతరం వరుస ఓవర్లలో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌.. నరైన్‌ (15), సాల్ట్‌ల వికెట్లు తీయగా, వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన రింకూ సింగ్‌ (11) కూడా త్వరగానే నిష్క్రమించాడు. పదో ఓవర్‌లో విలియమ్స్‌ అతడి వికెట్‌ తీశాడు. కానీ అప్పటికే పటిష్ట స్థితిలో ఉన్న కోల్‌కతాకు కెప్టెన్‌ శ్రేయాస్‌, వెంకటేశ్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడి 16.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.

బౌలర్లదే హవా: భారీ ఛేదనను ప్రత్యర్థి ముందు ఉంచాలన్న లక్ష్యంతో టాస్‌ గెలవగానే ఢిల్లీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ బరిలోకి దిగాక కోల్‌కతా బౌలర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు దారుణంగా తడబడ్డారు. ఒక్కరు కూడా నిలకడగా ఆడలేక, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. కానీ టెయిలెండర్‌ కుల్దీప్‌ మాత్రం చివర్లో జట్టు పరువు కాపాడే ఇన్నింగ్స్‌ ఆడాడు. పేసర్‌ వైభవ్‌ అరోరా ఆరంభంలోనే రెండు వికెట్లతో దెబ్బతీయగా.. మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ వరుణ్‌ ప్రభావం చూపాడు. దీంతో ఓ దశలో 150 పరుగులు కూడా కష్టంగానే అనిపించింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ పృథ్వీ షా (13) మూడు ఫోర్లతో ఆహా.. అనిపించినా అరోరా తన వరుస ఓవర్లలో షా, హోప్‌ (6) వికెట్లను తీశాడు. ఇక 6,4తో జోరు చూపిన హిట్టర్‌ ఫ్రేజర్‌ (12)కు స్టార్క్‌ షాకిచ్చాడు. ఈ దశలో అభిషేక్‌ పోరెల్‌ (18) 4,6,4తో 16 రన్స్‌ సాధించడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 67/3తో ఫర్వాలేదనిపించింది. అప్పటికి రన్‌రేట్‌ బాగానే ఉన్నా వికెట్లు కాపాడుకోవడంలో విఫలమైంది. పోరెల్‌-పంత్‌ నాలుగో వికెట్‌కు అందించిన 31 పరుగులే అత్యధికం. వరుసగా పోరెల్‌, పంత్‌, స్టబ్స్‌ (4), అక్షర్‌ (15), కుశాగ్ర (1) ఇలా వచ్చి అలా వెళ్లడంతో 111/8 స్కోరుతో డీసీ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే కుల్దీప్‌ మాత్రం బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 16వ ఓవర్‌లో 6,4తో 16 రన్స్‌ అందించాడు. అలాగే రసిక్‌ (6)తో తొమ్మిదో వికెట్‌కు 29 పరుగులు అందించడంతో పాటు, ఆఖరి బంతి వరకు మ్యాచ్‌ తీసుకెళ్లి జట్టు స్కోరును 150 దాటించాడు.


స్కోరుబోర్డు

ఢిల్లీ: పృథ్వీ షా (సి) సాల్ట్‌ (బి) వైభవ్‌ 13, ఫ్రేజర్‌ (సి) వెంకటేశ్‌ (బి) స్టార్క్‌ 12, అభిషేక్‌ (బి) హర్షిత్‌ 18, హోప్‌ (బి) వైభవ్‌ 6, పంత్‌ (సి) శ్రేయాస్‌ (బి) వరుణ్‌ 27, అక్షర్‌ (బి) నరైన్‌ 15, స్టబ్స్‌ (సి) సాల్ట్‌ (బి) వరుణ్‌ 4, కుశాగ్ర (సి) సాల్ట్‌ (బి) వరుణ్‌ 1, కుల్దీప్‌ (నాటౌట్‌) 35, రసీక్‌ (సి) శ్రేయాస్‌ (బి) హర్షిత్‌ 8, విలియమ్స్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 153/9; వికెట్లపతనం: 1-17, 2-30, 3-37, 4-68, 5-93, 6-99, 7-101, 8-111, 9-140; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-43-1, వైభవ్‌ అరోరా 4-0-29-2, హర్షిత్‌ రాణా 4-0-28-2, సునీల్‌ నరైన్‌ 4-0-24-1, వరుణ్‌ చక్రవర్తి 4-0-16-3, రస్సెల్‌ 1-0-10-0.

కోల్‌కతా: సాల్ట్‌ (బి) అక్షర్‌ 68, నరైన్‌ (సి) ఫ్రేజర్‌ (బి) అక్షర్‌ 15, రింకూసింగ్‌ (సి) కుల్దీప్‌ (బి) విలియమ్స్‌ 11, శ్రేయాస్‌ (నాటౌట్‌) 33, వెంకటేశ్‌ (నాటౌట్‌) 26, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 16.3 ఓవర్లలో 157/3; వికెట్ల పతనం: 1-79, 2-96, 3-100; బౌలింగ్‌: లిజాడ్‌ విలియమ్స్‌ 3-0-38-1, ఖలీల్‌ అహ్మద్‌ 3-0-28-0, రసీక్‌ సలామ్‌ 2.3-0-30-0, అక్షర్‌ పటేల్‌ 4-0-25-2, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-34-0.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 9 8 1 0 16 0.694

కోల్‌కతా 9 6 3 0 12 1.096

చెన్నై 9 5 4 0 10 0.810

హైదరాబాద్‌ 9 5 4 0 10 0.075

లఖ్‌నవూ 9 5 4 0 10 0.059

ఢిల్లీ 11 5 6 0 10 -0.442

గుజరాత్‌ 10 4 6 0 8 -1.113

పంజాబ్‌ 9 3 6 0 6 -0.187

ముంబై 9 3 6 0 6 -0.261

బెంగళూరు 10 3 7 0 6 -0.415


గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

1

పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు (60) సాధించిన కోల్‌కతా బ్యాటర్‌గా సాల్ట్‌

2

ఈసీజన్‌లో పవర్‌ప్లేలో ఎక్కువ సిక్సర్లు (15) బాదిన మూడో బ్యాటర్‌గా సాల్ట్‌. అభిషేక్‌ (19), హెడ్‌, ఫ్రేజర్‌ (16) ముందున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 02:42 AM