ఏదీ ఆ నైపుణ్యం?
ABN , Publish Date - Oct 27 , 2024 | 05:04 AM
కోహ్లీ, రోహిత్, జడేజా, అశ్విన్ వంటి సూపర్ స్టార్లు ఉండీ.. అదీ స్వదేశంలో.. అందునా స్పిన్ వికెట్‌పై భారత జట్టు ఘోర పరాభవాన్ని దేశ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేటి క్రికెటర్లకు వయస్సు మీరినందున...
కోహ్లీ, రోహిత్, జడేజా, అశ్విన్ వంటి సూపర్ స్టార్లు ఉండీ.. అదీ స్వదేశంలో.. అందునా స్పిన్ వికెట్‌పై భారత జట్టు ఘోర పరాభవాన్ని దేశ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేటి క్రికెటర్లకు వయస్సు మీరినందున స్పిన్ బౌలర్లనూ సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అశ్విన్‌కు 38 ఏళ్లు, రోహిత్ వయస్సు 37 సంవత్సరాలు, కోహ్లీ, జడేజా కూడా 36కి సమీపిస్తున్నారు. ఈనేపథ్యంలో వారిలో బ్యాటింగ్, బౌలింగ్‌లో గత నైపుణ్యాలు కొరవడ్డాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వయస్సు తరుముకొస్తుండడం నిజమే. కానీ స్వదేశంలో మన బ్యాటర్లు బ్యాటింగ్ చేసే విధానంలోనే లోపముంది. కొంతకాలంగా టెస్ట్ మ్యాచ్‌ల తొలి ఇన్నింగ్స్‌లో మనోళ్లు చాలినన్ని పరుగులు చేయలేకపోతున్నారు. 450 పరుగులు చేసినంత సమయం క్రీజులో ఉంటేనే పిచ్ నలిగి స్పిన్నర్లకు తోడ్పడుతుంది. కానీ మన టాపార్డర్ బ్యాటర్లు అంతసేపు బ్యాటింగ్ చేస్తే కదా! పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడం టెస్ట్ క్రికెట్‌లో ముఖ్యం. పైగా..స్పిన్నర్లను తిప్పికొట్టాలంటే చక్కని డిఫెన్సివ్ నైపుణ్యాలుండాలి. దిగ్గజాలు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నారంటే ఓపిక, డిఫెన్స్ నైపుణ్యాలే కారణం.
ప్రస్తుత ఐపీఎల్, టీ20 ఎరాలో యువ బ్యాటర్లే కాదు సీనియర్లలోనూ ఎక్కువ సమయం క్రీజులో ఉండాలనే ధోరణి కనిపించడంలేదు. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ తీరును మార్చుకోకపోవడమే న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్ట్‌ల ఘోర పరాజయానికి కారణమనేది సుస్పష్టం. ఇక బీసీసీఐ ఏరికోరి తెచ్చుకున్న గంభీర్ చీఫ్ కోచ్‌గా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాల్లో భారత్ బోల్తాపడడం గమనార్హం. గత జూలైలో శ్రీలంకపై ఆ దేశంలో టీ20 సిరీస్ గెలవడం ద్వారా గంభీర్ కోచింగ్ ప్రస్థానం ఘనంగా ప్రారంభమైంది. కానీ ఆ జట్టుతో వన్డే సిరీ్‌సలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత జట్టు డొల్లతనం బయటపడింది. అసలంక, వెల్లలగే, హసరంగ, వాండర్సేతో కూడిన లంక స్పిన్‌ను రోహిత్, కోహ్లీ వంటి మహామహులతో కూడిన టీమిండియా ఎదుర్కోలేక వన్డే సిరీ్‌సను కోల్పోయింది.