Share News

IPL 2024: సన్‌రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్‌ వేళ ఉప్పల్ స్టేడియంపై అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 05 , 2024 | 06:10 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ మరోసారి ప్రస్తుత పాలక వర్గంపై మండిపడ్డారు. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లను సమస్యలు వెంటాడుతున్నాయని విమర్శించారు. అధ్వాన్నమైన మరుగుదొడ్లు, తగిన నీటి సౌకర్యాలు లేమి ప్రధాన సమస్యలు ఉన్నాయన్నారు. మరోవైపు హెచ్‌సీఏ ఆధ్వర్యంలోనే అనధికారిక ప్రవేశాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

IPL 2024: సన్‌రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్‌ వేళ ఉప్పల్ స్టేడియంపై అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ మరోసారి ప్రస్తుత పాలక వర్గంపై మండిపడ్డారు. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లను సమస్యలు వెంటాడుతున్నాయని విమర్శించారు. అధ్వాన్నమైన మరుగుదొడ్లు, తగిన నీటి సౌకర్యాలు లేమి ప్రధాన సమస్యలు ఉన్నాయన్నారు. మరోవైపు హెచ్‌సీఏ ఆధ్వర్యంలోనే అనధికారిక ప్రవేశాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. విమర్శకులకు ఈ లోపాలు కనిపించడం లేదా అని అజారుద్దీన్ ప్రశ్నించారు.


హెచ్‌సీఏ సభ్యులకు కూడా టికెట్లు దొరకడం లేదు.. కానీ బ్లాక్ మార్కెట్ దొంగలకు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయని హెచ్‌సీఏ ప్రస్తుత పాలక వర్గంపై విమర్శల దాడి చేశారు. ఆఖరికి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ కూడా టికెట్ల కోసం పోరాడాల్సి పరిస్థితి నెలకొందని అన్నారు. నేటి (శుక్రవారం) మ్యాచ్‌కు పాసులు ఇవ్వలేదని అన్నారు. మరోవైపు బకాయిలు చెల్లించకపోవడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్‌ కోత విధించారని ఆయన ప్రస్తావించారు. సంస్కరణలు చేస్తామని హామీ ఇచ్చిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ గందరగోళాన్ని మాత్రమే అందించిందని, మార్పు ఎక్కడ ఉందని అజారుద్దీన్ ప్రశ్నించారు.


కాగా దాదాపు రూ.3 కోట్ల బకాయిలు ఉండడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్‌ కోత విధించారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో బకాయిలు చెల్లించడంతో విద్యుత్‌ను పునరుద్ధరించిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 05 , 2024 | 06:13 PM