Share News

విహారికి ఏసీఏ షోకాజ్‌ నోటీసు

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:34 AM

ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్‌, టీమిండియా క్రికెటర్‌ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) మధ్య వివాదం షోకాజ్‌ నోటీసుకు దారితీసింది. గత వారంలో జరిగిన ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌లో...

విహారికి ఏసీఏ షోకాజ్‌ నోటీసు

కొత్తగా చెప్పాల్సిందేమీ లేదన్న హనుమ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్‌, టీమిండియా క్రికెటర్‌ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) మధ్య వివాదం షోకాజ్‌ నోటీసుకు దారితీసింది. గత వారంలో జరిగిన ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌లో విహారికి షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని తీర్మానించారు. ఈనెల 25న ఈ-మెయిల్‌లో ఏసీఏ షోకాజ్‌ నోటీసులు పంపించింది. విహారికి తన సమస్యలను చెప్పుకోవడానికి ఇదొక అవకాశమని, తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేయాలని ఒక ఏసీఏ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అసలేమి జరిగిందో తెలుసుకోవడానికే తాము ఈ నోటీసు ఇచ్చామని ఆయన తెలిపారు. ఆంధ్ర క్రికెట్‌ అభివృద్ధిలో విహారి పాత్ర విలువైందని, అతడి సమస్యలు తెలియజేయడానికి ఇదొక అవకాశమని సదరు ఏసీఏ పెద్ద అభిప్రాయపడ్డారు. అయితే, దీనిపై విహారి స్పందిస్తూ తాను షోకాజ్‌ నోటీసుకు బదులిచ్చానని తెలిపాడు. ఈ సీజన్‌ రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో ఆంధ్ర జట్టు ఓడిన రోజునే తాను చెప్పాల్సిందంతా చెప్పానన్నాడు. వచ్చే దేశవాళీ సీజన్‌లో తాను వేరే జట్టు తరఫున ఆడాలని నిర్ణయించుకున్నానని, ఇందుకోసం నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వాల్సిందిగా ఏసీఏను అడిగానని, వారి స్పందన కోసం వేచి చూస్తున్నానని విహారి తెలిపాడు. ఇక, ఈ సీజన్‌ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌ అనంతరం విహారి హఠాత్తుగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత జట్టులోని 17వ నెంబర్‌ ఆటగాడు పృథ్వీరాజ్‌, అతడి తండ్రి తెచ్చిన ఒత్తిడిపై విహారి బహిరంగంగానే విమర్శలు చేయడం తెలిసిందే.

Updated Date - Mar 29 , 2024 | 02:34 AM