Share News

ఆమిర్‌.. రియల్‌ హీరో

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:11 AM

రెండు చేతులూ లేకపోయినా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ కూడా చేయగల కశ్మీర్‌ యువకుడు ఆమిర్‌ హుస్సేన్‌ ప్రతిభకు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అబ్బురపడ్డాడు. ఇటీవల అతడి వీడియోను చూసిన సచిన్‌ ఏదో ఒక రోజు

ఆమిర్‌.. రియల్‌ హీరో

కశ్మీర్‌ దివ్యాంగ క్రికెటర్‌కు సచిన్‌ ప్రశంసలు

శ్రీనగర్‌: రెండు చేతులూ లేకపోయినా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ కూడా చేయగల కశ్మీర్‌ యువకుడు ఆమిర్‌ హుస్సేన్‌ ప్రతిభకు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అబ్బురపడ్డాడు. ఇటీవల అతడి వీడియోను చూసిన సచిన్‌ ఏదో ఒక రోజు కలుస్తానని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం సచిన్‌ కశ్మీర్‌ పర్యటనలోనే ఉండడంతో తన మాటను నిలబెట్టుకున్నాడు. కశ్మీర్‌ పారా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కూడా అయిన 34 ఏళ్ల ఆమిర్‌ను మాస్టర్‌ తన విడిదికి పిలిపించుకుని ఆప్యాయంగా మాట్లాడాడు. అంతేకాకుండా తన సంతకంతో కూడిన బ్యాట్‌ను అతడికి బహుమతిగా అందించాడు. ‘ఆమిర్‌ నిజమైన హీరో. నువ్విలాగే ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నా. నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది’ అని సచిన్‌ ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు.

ప్రమాదంలో చేతులు కోల్పోయినా..

ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రి మిల్లులో జరిగిన ప్రమాదంలో ఆమిర్‌ రెండు చేతులను కోల్పోయాడు. అయినా కుంగిపోకుండా మెడ, భుజం సాయంతో బ్యాట్‌ పట్టుకుని బ్యాటింగ్‌లో రాటుదేలాడు. అలాగే కుడి కాళ్ల మధ్య వేలిలో బంతిని ఇరికించుకుని బౌలింగ్‌ కూడా చేయగలడు. 2013 నుంచి ఆమిర్‌ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారి రాష్ట్ర జట్టు కెప్టెన్‌ అయ్యాడు.

Updated Date - Feb 25 , 2024 | 05:11 AM