Share News

గట్టెక్కిన రాజస్థాన్‌ ఆఖరి ఓవర్‌లో విజయం

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:52 AM

లో స్కోర్‌ థ్రిల్లర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఒత్తిడిని జయించింది. అయితే కేవలం తమ 147 పరుగుల స్కోరును కాపాడుకోవడంలో అటు పంజాబ్‌ బౌలర్లు సైతం పట్టువదలకుండా పోరాడారు...

గట్టెక్కిన రాజస్థాన్‌ ఆఖరి ఓవర్‌లో విజయం

నేటి మ్యాచ్‌లు

కోల్‌కతా X లఖ్‌నవూ మ.3.30 గం. నుంచి

ముంబై X చెన్నై రాత్రి 7.30 గం. నుంచి

  • హెట్‌మయెర్‌ మెరుపులు

  • పోరాడిన పంజాబ్‌ బౌలర్లు

ముల్లాపూర్‌ (చండీగఢ్‌): లో స్కోర్‌ థ్రిల్లర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఒత్తిడిని జయించింది. అయితే కేవలం తమ 147 పరుగుల స్కోరును కాపాడుకోవడంలో అటు పంజాబ్‌ బౌలర్లు సైతం పట్టువదలకుండా పోరాడారు. దీంతో ఆఖరి ఓవర్‌ వరకు ఇరువైపులా మ్యాచ్‌ చేతులు మారుతూ వచ్చింది. కానీ హెట్‌మయెర్‌ (10 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 27 నాటౌట్‌) హిట్టింగ్‌ మరో బంతి ఉండగా ఆర్‌ఆర్‌ను గట్టెక్కించింది. ఫలితంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. అలాగే పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలపర్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. అశుతోష్‌ (16 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 31), జితేశ్‌ (29) మాత్రమే రాణించారు. కేశవ్‌, అవేశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసి నెగ్గింది. జైశ్వాల్‌ (39), తనుష్‌ (24) ఫర్వాలేదనిపించారు. రబాడ, కర్రాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా హెట్‌మయెర్‌ నిలిచాడు.

ఒత్తిడికి లోనైనా..: స్వల్ప ఛేదనే అయినా స్లో వికెట్‌పై రాజస్థాన్‌ కూడా తడబడింది. ఆరంభంలో ఇన్నింగ్స్‌ నిదానంగా సాగడంతో పాటు వికెట్లను కోల్పోయి ఒత్తిడికి లోనైంది. ఇక ఓటమి ఖాయమే అనిపించినా.. ఆఖర్లో హెట్‌మయెర్‌ బాదుడు జట్టును ఆదుకుంది. ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన తనుష్‌.. జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే, ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 56 పరుగులు జత చేసినా వేగం లోపించింది. అడపాదడపా ఫోర్లతో పవర్‌ప్లేలో జట్టు 43 పరుగులు చేసింది. బంతులు ఎక్కువగా వృధా చేసిన తను్‌షను తొమ్మిదో ఓవర్‌లో లివింగ్‌స్టోన్‌ అవుట్‌ చేశాడు. అటు శాంసన్‌ (18) 6,4తో 13 పరుగులు వచ్చాయి. అయితే తొలిసారి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసిన జైస్వాల్‌ను, శాంసన్‌ను వరుస ఓవర్లలో రబాడ అవుట్‌ చేయడం ఆర్‌ఆర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. దీనికి తోడు ఫామ్‌లో ఉన్న పరాగ్‌ (23), ధ్రువ్‌ జురెల్‌ (6) కూడా వెంటవెంటనే అవుట్‌ కావడంతో ఉత్కంఠ నెలకొంది. 16 బంతుల్లో 33 పరుగులు కావాల్సిన వేళ మ్యాచ్‌ ఇరువైపులా మొగ్గు చూపింది. కానీ హెట్‌మయెర్‌ 18వ ఓవర్‌లో 4,6.. తర్వాతి ఓవర్‌లో పోవెల్‌ (11) రెండు ఫోర్లతో పంజాబ్‌లో గుబులు రేపారు. అదే ఓవర్‌లో పోవెల్‌, కేశవ్‌ (1)లను సామ్‌ కర్రాన్‌ అవుట్‌ చేసి ఆర్‌ఆర్‌లో ఆందోళన రేపాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 10 రన్స్‌ కావాల్సిన వేళ.. అర్ష్‌దీప్‌ రెండు డాట్‌ బాల్స్‌ వేసినా హెట్‌మయెర్‌ ఆ తర్వాత 6,2,6తో రాజస్థాన్‌ను సంబరాల్లో ముంచాడు.

బౌలర్లదే జోరు: తొలి పది ఓవర్లలో 53/4. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ స్కోరిది. రాజస్థాన్‌ బౌలర్లు అదరగొట్టడంతో పరుగులు రాకపోగా, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. చివరి ఓవర్లలో అశుతోష్‌ ధాటికి కాస్త పరువు దక్కించుకుంది. కెప్టెన్‌ ధవన్‌ గాయంతో బరిలోకి దిగకపోగా.. బెయిర్‌స్టో (15)కు జతగా అథర్వ (15) బరిలోకి దిగాడు. అయితే నాలుగో ఓవర్‌లోనే అతడిని పేసర్‌ అవేశ్‌ వెనక్కి పంపాడు. ఇక వరుస ఓవర్లలో ప్రభ్‌సిమ్రన్‌ (10)ను చాహల్‌, బెయిర్‌స్టోను కేశవ్‌ అవుట్‌ చేయడంతో పంజాబ్‌ పతనం మొదలైౖంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సామ్‌ కర్రాన్‌ (6)ను పదో ఓవర్‌లో కేశవ్‌ అవుట్‌ చేశాడు. ఇదే ఓవర్‌లో శశాంక్‌ (9) ఎల్బీ కావాల్సి ఉన్నా అంపైర్‌ కాల్‌తో గట్టెక్కాడు. ఐదు ఓవర్లపాటు కనీసం ఫోర్‌ కూడా రాకపోగా 12వ ఓవర్‌లో జితేశ్‌, శశాంక్‌ల ఒక్కో ఫోర్‌తో 12 రన్స్‌ వచ్చాయి కానీ తర్వాతి ఓవర్‌లోనే శశాంక్‌ను పేసర్‌ కుల్దీప్‌ అవుట్‌ చేయగా, మరుసటి బంతికే లివింగ్‌స్టోన్‌ క్యాచ్‌ను కీపర్‌ శాంసన్‌ అందుకోలేకపోయాడు. పరుగులు మరింత కష్టంగా మారిన వేళ 15వ ఓవర్‌లో జితేశ్‌ తమ ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్‌ను బాదాడు. 16వ ఓవర్‌లోనూ జితేశ్‌ మరో సిక్సర్‌తో పాటు లివింగ్‌స్టోన్‌ 4,6తో 17 రన్స్‌ రాగా స్కోరు కూడా వంద దాటింది. ఇక పంజాబ్‌ ఆటలో వేగం పెరిగిందనుకునేలోపే అవేశ్‌ ఓవర్‌లో జితేశ్‌ పెవిలియన్‌కు చేరగా, లివింగ్‌స్టోన్‌ రనౌటయ్యాడు. అప్పటికి 18 ఓవర్లలో స్కోరు 122/7 మాత్రమే. ఈ స్థితిలో అషుతోశ్‌ 19వ ఓవర్‌లో ఇచ్చిన క్యాచ్‌ను శాంసన్‌, అవేశ్‌ ఢీకొని వదిలేశారు. ఆ తర్వాత రెండు సిక్సర్లతో అత్యధికంగా 18 రన్స్‌ రాబట్టాడు. అయితే ఆఖరి ఓవర్‌లో బౌల్ట్‌ ఆరు పరుగులే ఇచ్చి అశుతోష్‌ వికెట్‌ తీశాడు.

స్కోరుబోర్డు

పంజాబ్‌: అథర్వ (సి) కుల్దీప్‌ (బి) అవేశ్‌ 15, బెయిర్‌స్టో (సి) హెట్‌మయెర్‌ (బి) కేశవ్‌ 15, ప్రభ్‌సిమ్రన్‌ (సి) జురెల్‌ (బి) చాహల్‌ 10, కర్రాన్‌ (సి) జురెల్‌ (బి) కేశవ్‌ 6, జితేశ్‌ (సి) పరాగ్‌ (బి) అవేశ్‌ 29, శశాంక్‌ (సి) జురెల్‌ (బి) కుల్దీప్‌ 9, లివింగ్‌స్టోన్‌ (రనౌట్‌) 21, అశుతోష్‌ (సి) కేశవ్‌ (బి) బౌల్ట్‌ 31, హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 147/8; వికెట్ల పతనం: 1-27, 2-41, 3-47, 4-52, 5-70, 6-103, 7-122, 8-147; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-22-1, కుల్దీప్‌ సేన్‌ 4-0-35-1, అవేశ్‌ ఖాన్‌ 4-0-34-2, చాహల్‌ 4-0-31-1, కేశవ్‌ మహరాజ్‌ 4-0-23-2.

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) హర్షల్‌ (బి) రబాడ 39, తనుష్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 24, సంజూ శాంసన్‌ (ఎల్బీ) రబాడ 18, రియాన్‌ పరాగ్‌ (సి) రబాడ (బి) అర్ష్‌దీప్‌ 23, ధ్రువ్‌ జురెల్‌ (సి) శశాంక్‌ (బి) హర్షల్‌ 6, హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 27, పావెల్‌ (సి) జితేశ్‌ (బి) కర్రాన్‌ 11, కేశవ్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) కర్రాన్‌ 1, బౌల్ట్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 19.5 ఓవర్లలో 152/7; వికెట్ల పతనం: 1-56, 2-82, 3-89, 4-113, 5-115, 6-136, 7-138; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 3.5-0-45-1, రబాడ 4-0-18-2, కర్రాన్‌ 4-0-25-2, లివింగ్‌స్టోన్‌ 3-0-21-1, హర్షల్‌ 2-0-21-1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3-0-22-0.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 6 5 1 0 10 0.767

కోల్‌కతా 4 3 1 0 6 1.528

చెన్నై 5 3 2 0 6 0.666

లఖ్‌నవూ 5 3 2 0 6 0.436

హైదరాబాద్‌ 5 3 2 0 6 0.344

గుజరాత్‌ 6 3 3 0 6 -0.637

ముంబై 5 2 3 0 4 -0.073

పంజాబ్‌ 6 2 4 0 4 -0.218

ఢిల్లీ 6 2 4 0 4 -0.975

బెంగళూరు 6 1 5 0 2 -1.124

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

Updated Date - Apr 14 , 2024 | 01:52 AM